Breaking News

అమ్మకానికి ప్రజాస్వామ్యం – టంకశాల అశోక్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఏప్రిల్ 19న హైదరాబాద్ వచ్చినపుడు ఎన్నికల కోసం డబ్బు ఖర్చు దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. ఇంతవరకు రవాణాలో తనిఖీ అధికారులకు పట్టుబడిన డబ్బంటూ వారు చెప్పిన లెక్కలు ఇందుకొక సూచన మాత్రమే. ఆ రోజు వరకు దేశమంతటా కలిసి దొరికిన డబ్బు 335 కోట్ల రూపాయలు కాగా అందులో 105 కోట్లు కేవలం ఇక్కడే పట్టుబడ్డాయి.ఈ సమాచారానికి అదనంగా కొన్ని ప్రశ్నలు వేసుకొని చూడండి. ఇది పట్టుబడిన నగదు మొత్తం అయినపుడు పట్టుబడనిది ఎంత? పోలింగుకు తెలంగాణలో ఇంకా పదిరోజులు, సీమాంధ్రలో పదిహేడు రోజులు వుండగా పరిస్థితి ఇది అయినపుడు తక్కిన రోజులలో మరెంత దొరకవచ్చు? దొరకకుండా ఇంకెంత రవాణా కావచ్చు? రవాణాతో నిమిత్తం లేకుండా ఎక్కడికక్కడ ఎంత పంపిణీ కావచ్చు?
ఇది నగదు విషయం. ఖరీదైన వస్తువుల పంపిణీ మాటేమిటి? ఎన్నికల కమిషనర్లు ఎందువల్లనోగాని ఈ ప్రస్తావన చేయలేదు. వాటిలో ఎన్నెన్ని విధాలైన వస్తువులున్నాయి? వాటి ధరల రేంజ్ ఎంత? ఇప్పటికి పట్టుబడిన వాటి విలువెంత అన్న వివరాలు కూడా వారు చెప్పవలసింది. ఈ మొత్తం విలువను చూస్తే నగదు విలువకన్న ఎక్కువే తప్ప తక్కువ ఉండకపోవచ్చు.
ఇక మూడవది ఒకటున్నది. తనిఖీ అధికారులు తమకు పట్టుబడిన నగదు, వస్తువులకు పూర్తి లెక్కలు చెప్పటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆయా వ్యక్తుల నుంచి లంచం అనదగ్గ విధంగా కొంత తీసుకుని వదిలేయటం, అసలు ఎన్నికలతో సంబంధంలేని వారి నుంచి కూడా లేనిపోని నిబంధనలన్నీ మాట్లాడి బెదిరించి కొంత సొమ్ముకాజేయటం వంటివి చేస్తున్నట్లు వింటున్నాము. ఇందులో రెండవది ఎన్నికలతో సంబంధంలేని రవాణా గనుక అట్లుంచితే, మొదట్నుంచి ఎన్నికల డబ్బు దొంగ రవాణాను తక్కువ చేసి చూపేదే.
అనగా, అన్ని విధాలైన లెక్కలతో కలిపి ఓట్ల ఖరీదుకోసం మన ప్రజాస్వామిక పార్టీలు, వాటికి చెందిన ప్రజాస్వామిక నేతలు కలిపి, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అనేక వేల కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట. ఇక దేశమంతటా కలిసి ఎంత ఖర్చయ్యేదీ అంచనావేయటం కూడా కష్టం.ఈ రకమైన ఖర్చుపై ఒకానొక అధ్యయనం ఉన్నదీ లేనిదీ తెలియదు గాని, అది గనుక జరిగినట్లయితే మనకు పరిస్థితి ఇంకా బాగా బోధపడుతుంది. ఆ అధ్యయనానికి ఈ విధమైన ప్రశ్నలు వేసుకోవాలి:

(1) పట్టుబడిన నగదు ఎంత (2) పట్టుబడిన వస్తువులు ఏమేమిటి? (3) ఈ వస్తువుల ధరల రేంజ్ ఏమిటి? (4) ఏవేవి ఎవరి నుంచి పట్టుబడ్డాయి? (5) ఎవరి పార్టీ ఏది? (6) ఆ వ్యక్తుల వృత్తి వ్యాపారాలేమిటి? (7) వారిపై వృత్తి వ్యాపారపరంగా కాని, ఇతరత్రాగారి నేరారోపణలు ఏవైనా ఉన్నాయా? (8) వారు గతంలో ఎమ్మెల్యే ఎంపీలుగా, లేదా వేరే ఎన్నికైన ప్రతినిధులుగా ఉన్నారా? (9) మంత్రి పదవుల వంటివి ఏమైనా నిర్వహించారా? (10) పట్టుబడిన నగదుకు, వస్తువులకు సంబంధించి వారు ఇచ్చే వివరణలు ఏమిటి? (11) ఇవి అక్రమం అని రుజువైతే కేవలం వాటిని జప్తుచేయటం కాకుండా ఎన్నికల సంఘం వారిపై తీసుకుంటున్న అదనపు చర్యలు ఏవైనా ఉన్నాయా? (12) ఉంటే వాటి వివరాలు, లేని పక్షంలో అందుకు కారణాలు? (13) అట్లా పట్టుబడినవారు ఏ జిల్లాకు, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? (14) ఈ జరిగిన దానంతటిపై వారి పార్టీల వివరణ ఏమిటి? వారీవిధంగా దొరికి పోవటం గతంలో కూడా జరిగిందా?

ఇటువంటి సవివరమైన చిత్రీకరణ (మ్యాపింగ్) జరిగితే గాని మనకు ఆయా వ్యక్తుల గురించి పరిస్ధితుల గురించి మరికొంత అవగాహన పెరగదు. ఈ సమాచారంతో మౌలికమైన వివరాలు ఎన్నికల సంఘం నుంచి సమాచార హక్కు చట్టం కింద సంపాదించవచ్చు. మరికొంత సమాచారం ఇతరత్రా సేకరించవచ్చు. కనుక ఈ అధ్యయనాలను ఎవరైనా చేపడితే బాగుండును. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో, ఎన్నికలు అనబడే అతి కీలకమైన ప్రక్రియలో, ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో ఖరీదు చేసే కార్యక్రమం ఇంత భారీ ఎత్తున జరుగుతున్నపుడు ఆ విధమైన పరిశీలన చాలా అవసరం.

నిజానికి మన ప్రజాస్వామ్యం, ఎన్నికలు డబ్బుమయం (మానెటైజ్) కావటమన్న ధోరణి స్వాతంత్ర్యానికి పూర్వమే మొదలైనట్లు చాలా మందికి తెలియదు. స్వాతంత్ర్యానికి ముందు మనకు రెండు ప్రధానమైన ఎన్నికలు జరిగాయి. 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ప్రాంతీయ అసెంబ్లీలకు, కేంద్ర అసెంబ్లీకి ఒకసారి, తర్వాత రాజ్యాంగసభ ప్లస్ కేంద్ర అసెంబ్లీకి 1946లో ఎన్నికలు జరిగాయి. ఆ రెండు సందర్భాలలోనూ కాంగ్రెస్ ఎన్నికల బోర్డు అధ్యక్షునిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ డబ్బుకు “కీలకపాత్ర”నే ఇచ్చారు. “డబ్బులేదనే కారణంగా మనవాళ్లు ఎన్నిక కాకపోవటం అనే పరిస్థితి ఉండకూదడు” అంటూ అప్పటి పార్టీ అధ్యక్షుడు అబుల్ కలాం ఆజాద్‌కు ఆయన స్పష్టమైన రీతిలో లేఖ రాసారు. పారిశ్రామిక వేత్తల నుంచి బాగానే వసూళ్లు చేసారు. అది తెలిసిన గాంధీజీ దానిని బిర్లా వద్ద ఆక్షేపించగా, “మేము మహాత్ములం కాము” అంటే పటేల్ తోసిపుచ్చాడు. అంత ఉధృతంగా స్వాతంత్ర్యోద్యమం సాగుతూ, గాంధీజీ వంటి వారు నిరసించినా, “అపుడు విలువలు ఎంతో గొప్పగా”ఉండేవని మనం చెప్పుకునే కాలంలోనే పరిస్థితి అదైనపుడు, అది ఈసరికి ఇంతగా క్షీణించటంతో ఆశ్చర్యపడదగింది లేదు. దానిని సహజమైన పతనమనాలి.

దానినట్లుంచి, ప్రస్థుత పరిస్థితి గురించి పై తరహా పరిశీలన అవసరం అందుకు నేపథ్యం వలె, పైన పేర్కొన్న స్వాతంత్ర్య పూర్వపు ఎన్నికల నుంచి మొదలుకొని ఈ 2014 వరకు ఈ 75 – 80 సంవత్సరాల కాలంలో ఎన్నికలలో డబ్బుపాత్ర ఏ విధంగా పరిణమిస్తూ వచ్చిందో గమనించినట్లయితే మన ప్రజాస్వామ్యంతో డబ్బుకు గల సంబంధం అనే కోణం మరికొంత అర్థమవుతుంది.

ఇతరత్రా ధనరాసులు మన రాజకీయాలను శాసిస్తున్న తీరు అనేక విధాలుగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ధనవంతులతో పాటు మరీ అంత ధనికులు కాని వారికి కూడా పార్టీలు టికెట్లు ఇచ్చేవి. ఒక మోస్తరు ఖర్చు చేయగలవారికి తాము పోటీపడగలమనే దైర్యమూ ఉండేది. కాని ఆ పరిస్థితి ఈ సరికి పూర్తిగా మారింది. స్వయంగా పార్టీలు కోట్లకు కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేయగలవారి కోసం వెతుకుతున్నాయి. అభ్యర్ధులు స్వయంగా ఖర్చు చేస్తారా లేక “వసూళ్లు” చేసా అన్నది ఎట్లున్నా, అత్యధికులు మాత్రం స్వతంగా ఖర్చు చేయగలవారే. ఇందులో కమ్యూనిస్టులను వినహాయిస్తే తక్కిన పార్టీల మధ్య వ్యత్యాసం లేదు.

ఈ విధంగా కేంద్రంలో, రాష్ట్రాలలో దిగువసభలు, ఎగువసభలు రెండూ కోటీశ్వరుల మయం అయిపోతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసేవారు “వెల్లడిస్తున్న” ఆస్తుల వివరాలను చూస్తే, అందులో ఇదివరకు కోటీశ్వరులు ఎందరిని వెతికేవాళ్లం. ఇపుడు కాని వారెవరని వెతకవలసివస్తున్నది. డబ్బున్న వారే టికెట్లు కావాలంటే ఇన్ని కోట్ల “చందా” ఇవ్వాలంటున్నారు. అయినప్పటికీ అంగీకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వారి మధ్య పోటీలు ఏర్పడుతున్నాయి. ఏదో ఒక రోజున ఇటువంటి వారందరిని ఒక గదిలో నియోజక వర్గాల వారీగా సమావేశపరచి టికెట్లను వేలం వేస్తే ఆశ్చర్య పడదగ్గది లేకపోవచ్చు.

ఇటువంటి పార్టీలకు, అభ్యర్థులకు ప్రజాస్వామ్యం కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం ఇంతింత ఖర్చు చేసేందుకైనా వెనుకాడనంత ప్రేమ ఎందువల్ల  కలుగుతున్నదో రహస్యం కాదు. అది ఆ బాలగోపాలానికి తెలిసిన విషయమే. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగటం, మరింత దిగజారటం గాక మెరుగు పడతాయన్న ఆశలు ఎంతమాత్రం కలగటం లేదు.

పాపం ఎన్నికల సంఘం సంస్కరణల పేర, బందోబస్తుపేర, కఠిన చర్యల పేర తన పాట్లు తాను పడుతున్నది. కాని మన ప్రజాస్వామ్య ఉద్ధారకులు తమ చాతుర్యంతో, ఔద్ధత్యంతో ఆ సంస్థను వెక్కిరించి తమ పని తాము నిరాఘాటంగా సాగిస్తున్నారు.

విచిత్ర మేమిటంటే, ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని వీరీవిధంగా భ్రష్టు పట్టిస్తుండగా, మరొకవైపు ప్రజలు అదే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచుకుంటూ మరింత పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. ఈసారి సగం స్థానాలకు పోలింగ్ ముగిసేసరికి ఓటింగ్ శాతాలు 2009 కన్న సగటున 10 శాతం పెరిగాయి. ఈ రెండు పరిస్థితుల మధ్య వైరుధ్యం ఉంది. అది మనముందు ఏ రూపం తీసుకోవచ్చునన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

 – టంకశాల అశోక్
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

శతాబ్దాల కల‌ సాకారమైంది

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో ...

Comment on the article