Breaking News

నోటావల్ల ప్రయోజనం ఏమిటి? – షేక్ కరిముల్లా

గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని, వారికి ప్రశ్నించే హక్కు లేనట్లేనని’’ శెలవిచ్చారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ఎంతో వౌలికమైంది. అది ఒకరు ఇచ్చేది కాదు. ఇచ్చింది కాదు. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కు. కలెక్టర్ అలా మాట్లాడిన రోజే దినపత్రికలలో ‘‘ఒక టీడీపి ఎమ్మెల్యే 36 గంటలలో మూడు పార్టీలు మారి చివరాఖరుకు టీఆర్‌ఎస్‌లో తేలారు’’ అనే వార్త. ఉదాహరణలతో ప్రచురితమైంది. ఒక్క ఆ నాయకుడే కాదు, ఈ ఎన్నికల సీజన్‌లో అన్ని రాజకీయ పార్టీలలో సాధారణంగా కనిపించిన దృశ్యాలు. పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అన్న స్థాయికి చేరుకోవడమే విషాదం. ఇది దిగజారిపోయిన రాజకీయాలకు అద్దం పడుతుంది. ఎటువంటి విలువలు లేని రాజకీయాలు నెరపేవారికి నేతలకు ఓట్లు వేయాలా? వేయకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లేనా? ఈ ప్రశ్నలు సమాజంనుంచి వస్తాయి.

రాజకీయ పార్టీల సిద్ధాంతాల కంటే, విధానాల కంటే ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలు డబ్బు, మద్యం, కులం, మతం, రిగ్గింగ్, దొంగ ఓట్లు అన్నది అందరికి తెలుసు. గత ఆరు దశాబ్దలుగా 15 సార్వత్రిక ఎన్నికలను చవిచూసిన ప్రజలు ఈ ఓట్లవల్ల తమకు ఒరుగుతున్నదేమీ లేదని తేల్చుకున్నారు. అందుకే 30 నుంచి 40 శాతం మంది ఎన్నికలకు దూరంగా ఉంటూ, ఓట్లు వేయటం లేదు. కాబట్టి ఈ అసంతృప్తులను ఎలా తృప్తిపరచాలి? పోలింగ్ శాతాన్ని ఎలా పెంచాలి? అనే ఆలోచన ఇసి (ఎన్నికల సంఘం) చేసింది. సుప్రీంకోర్టు కూడ దీనికి వత్తాసు పలికింది. అదే ‘అదనపు మీట సిద్ధాంతం’. ఇప్పటికే ఈ పద్ధతి కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా, బ్రెజిల్, గ్రీస్, స్పెయిన్, రష్యా, చీలి, కొలంబియా, బంగ్లాదేశ్, స్వీడన్ తదితర దేశాలలో అమల్లో ఉంది. కాలిఫోర్నియాలో 1976లో తొలిసారిగా అమల్లోకి వచ్చింది.
అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49(2) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. అయితే ఇది రహస్య ఓటింగ్ పద్ధతికి సరిపోనందున, చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన లేనందున అమలు కాలేదు. ఇప్పుడు ఈవీఎంలు వాడుకలోకి రావటంతో ఎన్నికల కమిషన్ చొరవ చూపింది. ప్రభుత్వం దీన్ని సహజంగానే వ్యతిరేకించింది. అప్పుడు పౌర హక్కుల సంస్థ – పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పి.యు.సి.ఎల్.) ‘నోటా’కు మద్దతుగా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసులో 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ‘నోటా’ను ప్రవేశపెట్టాలని రూలింగ్ ఇచ్చింది. అది ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, రాజకీయ పార్టీలు నిష్కళంక అభ్యర్థులను నిల్చోబెట్టే నియమబద్ధ మార్పుకు ఇది దారితీస్తుందని చెప్పింది.

ఫలితంగా గత ఏడాది ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ‘నోటా’ తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. చాలాచోట్ల ఓటర్లు కసితీరా ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల గెలుపుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి.
నిజానికి ‘నోటా’వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులందరికంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చినా ఫలితాల్లో మార్పేమి ఉండదు. ఎక్కువ ఓట్లు దక్కిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ‘నోటా’కు తిరస్కరణ హక్కుకు (రైట్ టు రిజెక్ట్) తేడా వుంది. తిరస్కరణ హక్కు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ‘నోటా’ను తిరస్కరణ హక్కుగా చాలామంది పొరబడుతున్నారు. అది తిరస్కరణ హక్కు కాదంటూ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషి స్పష్టంచేసారు. ‘నోటా’కు పడ్డ ఓట్లను చెల్లని ఓట్లుగానే పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. ‘నోటా’ ఓట్లు అభ్యర్థుల గెలుపును శాసించలేవు. అలాగే వాళ్ల అభ్యర్థిత్వాలను కూడా రద్దుపరచ లేవు. కాబట్టి ‘నోటా’వల్ల ప్రయోజనం లేదనేది స్పష్టం. ‘నోటా’కు ఇప్పటివరకు ఎలాంటి గుర్తును ఇ.సి కేటాయించలేదు. అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని ప్రముఖ రచయిత సౌదా హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేసారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మన హైకోర్టు ‘నోటా’కు గుర్తు కేటాయించాలని, వీలైతే ఈ ఎన్నికలలోనే కేటాయించాలని ఎన్నికల సంఘంను ఆదేశించింది. ‘నోటా’కు గుర్తు ఈ ఎన్నికలలో కేటాయించే అవకాశం లేకపోయినా వచ్చే ఎన్నికల నాటి నుండి ‘నోటా’కు గుర్తు వస్తుంది.
మొత్తానికి ఎన్నికల సంఘం పదును లేని ఆయుధం ప్రజలకు ఇచ్చినా, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ‘నోటా’ ప్రభావం తక్కువేమి కాదు. చాలాచోట్ల పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఓటర్లు ఈసారి ‘నోటా’ ఓటు వేస్తారు. ఇప్పటికే ఒడిశాలోని కొంధోమాల్ గిరిజనులు, కోల్‌కతాలోని సెక్స్ వర్కర్లు ‘నోటా’కు ఓటు వేస్తామని ప్రకటించినట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. తమను పట్టించుకోని నాయకులకు, పార్టీలకు ఎందుకు ఓటువేయాలనీ పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రజలలో కలిగిన నిరాశను, అసంతృప్తిని తగ్గించేందుకు, వాళ్ళను ఓటు వేసేలా పోలింగ్ బూత్‌లకు తెచ్చేందుకు ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రయోగం తాత్కాలిక తాయిలమే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. కనీసం కొన్ని వ్యవస్థీకృత మార్పులు చేయక తప్పదు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

శతాబ్దాల కల‌ సాకారమైంది

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో ...

Comment on the article