Breaking News

జూలురు లోకతప్త కవిత్వం ‘ముండ్లకర్ర’


అవరటానికి కప్పల్లేవ్  చెరువు చచ్చి వూరు పాడై  జనం గలగలా నవుతున్న కంకాళాలు  లేదూ ఫ్రిజ్‌ల్లో దాక్కున్న మినరల్ బాటిల్సు  ఎప్పుడు ఎవరు తెల్లారేసరికి  చెరువుపై చేపలా తేల్తారో!! 

ఎంత విషాదమిది? ఈనాడు తెలంగాణ పల్లెటూళ్లు ఎలా ఉన్నాయో ఇది చదివితేనే అర్థమవుతుంది. జీవితంలోని కష్టసుఖాలు, వాటి కార్యాచరణ సంబంధాల పట్ల సరైన అవగాహన ఉన్న కవి జూలూరు గౌరీశంకర్. ఆయన కవిత్వం జ్వలించే ఆగ్రహంగానో, ఉక్రోషంగానో, నిస్సహాయంగా, నిర్వేదంగా కనిపించే హాలాహలంగానో కనిపించినా ప్రతి అక్షరం తన స్వీయానుభవం నుంచి ఆవిష్కృతమైన తెలంగాణా జీవిత పార్శ్వమే. ‘ముండ్లకప్ప’- జూలూరు గౌరీశంకర్ సమగ్ర కవిత్వం… ఒక పలవరింత ఒక కలవరింత, మహా పులకరింత! 


”మనం తప్పు చేసినప్పుడు నాయన వూహించకుండా చెంపపై కొట్టే దెబ్బ మహాకవిత్వం. నాయన దెబ్బకొట్టాక, అమ్మ ప్రేమగా అన్నం ముద్దలు పెట్టడం విలువకట్టలేని ప్రపంచకవిత్వం. చిన్నప్పుడు మన దెబ్బలాట అత్యంత అద్భుత జీవితసారం. ఏమీ తెలియకుండా మనమేం చేస్తామో అదే శుద్ధకవిత్వం.

చిన్నప్పుడు చొక్కాలాగు ఇప్పి గాబుకాడ గబుక్కున బరిబాతల చేసే స్నానం కవిత్వం కాదా”… ఇవీ కవి గౌరీశంకర్ కవిత్వానికిచ్చే నిర్వచనం. ఇది చదువుతూంటే ఎంతో ముచ్చటేస్తుంది. అంతేకాదు. కవిత్వాన్ని ఇంతబాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పలగమా అనిపిస్తుంది. ఇవన్నీ గౌరీశంకర్‌కే సాధ్యమైన విషయాలు. అందుకేనేమో వాడ్రేవు చినవీరభద్రుడు ఒకచోట ఇలా ఉంటారు- ”తెలంగాణాలోని స్థానికతను తన కవిత్వంలో దోసిళ్లతో కుమ్మరించిన కవి జూలూరు గౌరీశంకర్. అతని ముండ్లకర్ర 1995నుండి 2002 దాకా రాసిన కవితల సమాహారం తను రాసిన దీర్ఘకవితలు మినహా తక్కిన కవితలన్నీ ఇందులో వచ్చాయి కాబట్టి దీన్ని అతని ప్రతినిధి సంకలనంగా చెప్పవచ్చు.

గౌరీశంకర్ కవితల్ని ఒకటొకటే చదువతూంటే అతని ఉద్విగ్నత, ఆపుకోలేని ఆవేశం మనల్ని నిస్సందేహంగా చలింపచేస్తాయి. తన ”ప్రపంచకం కోసం ఏ ప్రపంచంతోనైనా కలబడతా”ననే కవి మననొక జలపాతపు హోరుతో ముంచెత్తుతారు. తెలంగాణా యువ కవుల్లో ఇంత గ్రాఫికల్‌గా తన వూరిని, తన నేలను, తన బాధను దర్శింపచేయగలిగిన కవిని ఇంతదాకా నేను చూడలేదు…” ఈ మాటలు నిజమని ”ముండ్లకర్ర” చదివిన వారికి తప్పక తెలుస్తాయి. అందుకనే గుడిపాటి, జూలూరు గురించి రాస్తూ- ”గౌరీశంకర్ కవిత్వంలో తనది కాని బాధని వెళ్లబోసుకోవడం లేదు. అందుకని సొంత బాధని ఏకరువు పెట్టడం లేదు. పదుగురు చూసి ఉపేక్షించే విషయాల్నే తన కవిత్వంలో చూపిస్తున్నారు. పనిగట్టుకుని పదాల్ని పేర్చడం లేదు. ఉండబట్టలేని తనం వల్లనే రాస్తున్నారు. తను చూస్తున్న విషయాల్నే కవిత్వంలో రికార్డు చేస్తున్నాడు. అందులోనూ సరళత, సూటిదనం, నిక్కచ్చితత్వం ఉన్నాయి…” అంటూ తెలంగాణా కవిత్వ జల జూలూరుగా ప్రశంసిస్తారు. కవిగానే కాక కవిత్వోద్యమకారుడిగా కూడా జూలురుఉ కృషిని అభినందిస్తారు గుడిపాటి. 


”నేను ఎనకబడ్డ ప్రాంతాన్ని 
ఎనకెనకబడ్డ కులాన్ని…” 


ఈ మాటలు అనడానికి ఎవరికైనా తెగింపే కాదు… అవగాహన కూడా ఉండాలి. ఎలా, ఎందుకు, ఎవరివల్ల వెనుకబాటుతనం కలిగిందో చెప్పుకోగల సత్తా ఉండాలి. అవన్నీ తన ”ముండ్ల కర్ర”లో జూలూరి అద్భుతంగా ప్రదర్శించారు. అందుకనే సీతారాం జూలూరిని అలజడి కవి అంటారు ఇందులో- 


”మూతికి చేతికి మధ్య 
అడ్డును అడ్డగోడలుగా 
నరకటమే వ్యాకరణం…” 


ఇలా అనడంలో పఠాభిని మించి పోయినట్లు కనిపిస్తారు జూలూరి గౌరీశంకర్. 


”వూరిమీద పులి పడ్డప్పుడు 
నన్ను నేను పులిగోరును చేసుకుంటున్నా” 


ఇలా అనడం వెనుక, పులి ఎవరో, తానెందుకు పులిగోరు అవుతున్నాడో ఇవన్నీ వర్తమాన సామాజిక రాజకీయ అంశాలకు తాను ఎంతగా ప్రతిస్పందిస్తున్నారో తెలుపుతున్నాయి. 


”పాదముద్ర, ఎలియాస్, పొలికట్టె, వూరుచావు, నా తెలంగాణ, కాటు, సిలబస్‌లో లేని పాఠం, ఓ నమఃశవాయ, మూడవ గుణపాఠం, మాలకాకి వంటి కావ్యాలను ఇదివరలో ప్రచురించిన జూలూరు గౌరీశంకర్ ”ముండ్లకర్ర” పేరుతో తన సమగ్ర కవితాసంకలనం అందివ్వడం ముదావహం. గౌరీశంకర్ అందరి కవుల్లాగే అన్ని విషయాల మీద కవిత్వం రాసినా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ”నా తెలంగాణ” అనే దీర్ఘకవిత రాశారు. కరువు జీవితాల కన్నీటి గాథల్నీ, విలవిల్లాడుతోన్న తెలంగాణ రైతున్నలు, కష్టజీవులు, అంటరానితనాలు, వాడ వినాయకుడు ఊరు వినాయకుడు, నీళ్లు అందని ఎర్ర సెలకలు, రోడ్లు వూడ్చే పొరకల తల్లులు ఇలా ప్రతి అంశాన్నీ ఎంతో బలంగా కవిత్వీకరించారు. ”పొక్కిలి” తెలంగాణ కవుల కవితా సంకలనం తేవడంలో ప్రధాన భూమిక గౌరీశంకర్‌దే- 


”వూళ్లకు వూళ్లు దుమ్ముకొట్టి చితుకుతున్నా 
సివాలెత్తని పిట్టల గుంపు తెలంగాణ 
కిష్టపట్టె కష్టాల పట్టెయితే బావుండు 
అదిప్పుడు వలసల పట్టిక 
దరిద్రానికి దర్వాజ తెలంగాణ” 


అంటూ తెలంగాణ కవుల భాషమీద వ్యాఖ్యానించిన కవులను గూర్చి 


”వంక బెట్టండి మా వాక్యాలకు 
పండించుకోండి మీ కావ్యాలను 
ఇప్పుడింక తెలంగాణకు తోవ తెల్సింది 
ఒక్కసారి కాళోజీ వాగులో బడి 
నదులమై పొంగుకొద్దాం రండి…” 


తను నిత్యం రాస్తూ అందరిచేతా రాయిస్తూ, తన ప్రాంతాన్ని కవిత్వపటం మీద అగ్రభాగాన నిలుపుతోన్న గౌరీశంకర్ సమగ్ర సంకలనం ”ముండ్లకర్ర”… ఆయన కవిగా నిత్య సమరంలో అనుసరిస్తోన్న అనేక యుద్ధ వ్యూహాల, విన్యాసాల నెలవు!


(ముండ్లకర్ర; జూలూరు గౌరీశంకర్; పుటలు: 247; వెల: 100 రూ.లు; 
స్పృహ సాహితీసంస్థ, కోదాడ, నల్గొండ జిల్లా 508206


– చీకోలు సుందరయ్య

Check Also

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజన తత్త్వం – స్కై బాబా

రవి కథలు ఊరూ- వాడ వాతావరణంలోంచి నడిచి, పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *