Breaking News

ఒగ్గు కథకు చిరునామా “మిద్దె రాములు” – ఓ తెలంగాణ కళాకారుడు

ఒగ్గు కథకు మారు పేరు ‘మిద్దె రాములు’. అతని పాటకు పల్లె పల్లవవుతుంది. అతని గొంతు గట్లను దాటుతూ పంట పొలాల్ని స్పృశిస్తుంది. అతని కథకు తంగెడుపూలు తలవూపుతూ స్వాగతం చెబితే, పల్లెలు, తండాలు ప్రాణం పోసుకుంటాయి. అతను ఆ రోజు ఊళ్లో కథ చెబుతాడంటే ఆ ఊరికి కొత్త కళ వచ్చేస్తుంది.

అది ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ఆడిటోరియం. చిరుగజ్జెల సవ్వడితో, నాట్య భంగిమలతో ఓ తెలంగాణ కళాకారుడు అద్భుతంగా ఒగ్గు కథ చెప్పాడు. స్టేజి దిగగానే జనమంతా ఆయన చుట్టుమూగి ‘ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌’ అనసాగారు. ఆ ఒగ్గు కళాకారుడు వారి వంక తదేకంగా చూస్తూ ‘ఆటోగ్రాఫ్‌ అంటే ఏంటని అడిగాడు. అసలాయనకు సంతకం పెట్టడం కాదు, రాయడం చదవడమే రాదు. అదుగో ఆయనే అంతర్జాతీయఖ్యాతి గాంచిన మిద్దె రాములు. వేల కథ ల్ని పుక్కిటపట్టి, యాభై ఏళ్ళుగా జనాన్ని ఉర్రూతలూగిస్తున్న రాములు. సినారే పుట్టిన ఊళ్లో పుట్టిన రాములు.

కరీంనగర్‌ జిల్లాలోని హన్మాజిపేటను ప్రపంచ పటంలో చిత్రించిన రాములు. ఒగ్గు కథకు మారు పేరు ‘మిద్దె రాములు’. అతని పాటకు పల్లె పల్లవవుతుంది. అతని గొంతు గట్లను దాటుతూ పంట పొలాల్ని స్పృశిస్తుంది. అతని కథకు తంగెడుపూలు తలవూపుతూ స్వాగతం చెబితే, పల్లెలు, తండాలు ప్రాణం పోసుకుంటాయి. అతను ఆ రోజు ఊళ్లో కథ చెబుతాడంటే ఆ ఊరికి కొత్త కళ వచ్చేస్తుంది. ప్రజలు సాయంత్రంలోగా అన్ని పనులు ముగించుకుంటారు. ఇవాళ ‘మిద్దె రాములు’ ఒగ్గు కథను విననివారు తెలంగాణ పల్లెలో ఇంచుమించుగా ఉండరు. సంప్రదాయ కళలు కనుమరుగవుతున్న దశలో, గ్రామీణులకు దగ్గరగా ఉండే ఒగ్గు కథా ప్రక్రియ విలక్షణ శైలిని తిరిగి సజీవంగా నిలపుతున్న కళాకారుడు మిద్దె రాములు.
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ మిద్దె రాములు ఒగ్గు కథ. ఈ కథ కంటే దాన్ని రాములు వివరించినపుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాములు బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వకుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. రాములు స్వయంకృషితోనే ఈ కథా ప్రక్రియను నేర్చుకున్నాడు. జానపద కళారూపాళ్లో ‘ఒగ్గు కథ’ ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం- గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గుకథ.
అయినా గౌడ కులస్తుడైన రాములు పట్టుపట్టి మరీ నేర్చుకున్నాడు. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేకపోవడం వల్లే ఈ కథ రాములుకు ఒంటపట్టింది. వేములవాడకు వెళ్లి హరికథలు, బుర్ర కథలు చూసేవాడిని. ఎలాగైనా కథ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో కాళ్ళకు గజ్జెల వలె తుమ్మకాయలు కట్టుకుని, తలుపులు మూసి ఆము దం దీపం పెట్టుకుని ఆ దీపపు నీడలో నా కదలికల్ని గమనించేవాడిని. ఇదీ మిద్దె రాములు ‘స్టైల్‌’ అని ముద్ర పడేలా కృషి చేశాను అంటా రు రాములు. యాభై ఏళ్ల నుంచి దాదాపు ముప్ఫై వేల ప్రదర్శనలిచ్చాడు. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో రాము లు శిష్య, ప్రశిష్యులు రెండు వేల మంది వరకున్నారు. శుభకార్యాలకే కాదు, అశుభకార్యాలకు అంటే దేవుసాలకు కథలు చెప్తుంటారు రాములు. జనాభా నియంత్రణ, వయోజన విద్య, అక్షరాస్యత కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి ప్రభుత్వం రాములు కథల్ని విరివిగా ఉపయోగించుకుంది.
ఒగ్గు కథ చెప్పడంలో తన శైలితోపాటు, ఆయన బృందం డోలు, తాళం కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతాడు. పాటలు జోడించి కథను పండిస్తాడు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తాడు రాములు. తన ఒగ్గు కథ సరిగ్గా చెబితే నాలు గు రోజుల పాటు సాగుతుందంటాడు. ఆయన కథలో కొస మెరుపుగా బోనాల నృత్యం. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతాడు. రాములు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో దాదాపు రెండు వందల ప్రదర్శినలిచ్చాడు. 1990లో మారిషన్‌లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చి అప్పటి మారిషస్‌ ప్రధాని అనురుధ్‌ జగన్నాథ్‌, గవర్నర్‌ రంగస్వామి రంగడు ప్రశంసలు అందుకున్నాడు.
ఇంటర్‌స్టేట్‌ కల్చరల్‌ ఎక్ఛేంజ్‌ ప్రొగ్రాంలో పాల్గొని తెలు గు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. వివిధ కళా సంస్థల నుంచి ‘జానపద కళా బ్రహ్మ’ ఒగ్గు కథా చక్రవర్తి, కళాపురస్కార్‌ బిరుదులు పొందాడు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, రాష్ట్రపతి జైల్‌సింగ్‌, ముఖ్యమంత్రి అంజయ్య, చంద్రబాబు వరకు అందరి ఎదుట ప్రదర్శినలిచ్చి ప్రశంసలందుకున్నాడు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కరీంనగర్‌ పట్టణానికి ఆహ్వానించారు. అది ఎన్నికల సభలో మాట్లాడ్డానికి. సర్కస్‌ గ్రౌండ్‌లో ఇందిరా గాంధీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రసంగించాల్సి ఉంది.
వేలకొద్ది జనం. రాత్రి పదయింది ఇందిర జాడలేదు. అప్పుడు రాములు కథ మొదలుపెట్టాడు. అసలు అది ఇందిరాగాంధీ పాల్గొనే సభ అని జనం మరిచిపోయారు. అర్ధరాత్రి పన్నెడయ్యింది. రాములు కథ నడుస్తూనే ఉంది. అదిగో అప్పుడు ఒంటి గంటకు ప్రధాన వక్త వచ్చారు. అంటే ఐదు గంటలపాటు వేలాదిమంది జనాన్ని తన కథలో రాములు కూర్చోబెట్టారు. ఈ కథ రాములుతోనే ఆగిపోకుండా ఉండాలంటే ప్రభు త్వం ఒగ్గు కథ కోసం ఓ వర్క్‌ షాప్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భంలో రాములును కాకతీయ యూనివర్సిటీ గాని, తెలుగు యూనివర్సిటీ గాని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలి. మిద్దె రాములు గజ్జె కట్టి యాభై ఏళ్లయింది. అందుకే వేములవాడలో ఈ నెల 9,10వ తేదీల్లో మిద్దె రాములు ఒగ్గు కథ స్వర్ణోత్సవ సంబురాల్ని జరుపుతున్నాం. ఈ సంబురాలకు సినారె, గద్దర్‌లతో పాటు అనేక మంది కళాకారులు, కవులు, రచయితలు హాజరవుతున్నారు.
-డా॥ గోపు లింగారెడ్డి
(వ్యాసకర్త విశ్రాంత తెలుగు అధ్యాపకులు)
Listen to Oggu Kathalu online : Visit www. Telugufolksongs.com
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

ఉరుముతున్న ఉగ్రభూతం!

మారణహోమం సృష్టిం చేందుకు వాహనాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నా రు. ఇప్పుడు లండన్‌లో జరిగిన దాడి కూడా వాహనం తోవచ్చి ప్రజలను ...

Comment on the article