ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం -వాణిజ్య పంటల వైపు అడుగులు
నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం
ఎస్. శర్మ
కామారెడ్డి :
నిజామాబాద్ జిల్లా వ్యవసాయరంగంలో అభివృద్ధి పథంలో కొనసాగేందుకు వనరులు వున్నా అనుకున్నంత మేరకు పురోగతి సాధించ లేకపోతుంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి నిజాంసాగర్, అలీసాగర్ ప్రాజక్టులతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొంత వరకు వుంది. అయితే గత దశాబ్దాలుగా నిజాంసాగర్, అలీసాగర్ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిలువ లేక జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి.
అనేక సంవత్సరాలుగా ఈ జలాశయాల పరిధిలోని ఆయకట్టు బీడుగానే వుంది. జిల్లాలో ముఖ్యంగా ఖరీఫ్, రబీ పంటలు పండించే వెసులుబాటు వుంది. వర్షాకాలంలో సాధారణంగా ఖరీఫ్ పంటలు ఆయకట్టు సాగులో జిల్లా రైతులు తలమునకలవుతారు. అయితే కొంతకాలంగా వర్షాలు అంతంత మాత్రంగా వుండడంతో సాగు విస్తీర్ణం అభివృద్ధి సాధించలేకపోతుంది. ప్రధాన పంటలైన వరి, మక్కతో పాటు వాణిజ్య పంటగా చెరుకు, పసుపు విస్తృతంగా జిల్లాలో పండిస్తారు.
ఇవిగాక పత్తి, పొద్దు తిరుగుడు, సోయా వంటి పంటలు, కూరగాయల సాగు పెరిగింది. ప్రధానంగా జిల్లాలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం ఆధునిక వ్యవసాయంలో పేరెన్నికగన్నది. ఆ ప్రాంతంతో పాటు జక్రాన్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లో కూరగాయల సాగు బాగా జరుగుతోంది. ఈ వ్యవసాయ దిగుబడులను మార్కెటింగ్ చేయడంలో రైతులకు సరైన సదుపాయాలు లేకపోవడం శోచనీయం.
ఆర్మూర్ ప్రాంతంలో పసుపు సాగు విస్తీర్ణం వేలాది హెక్టార్లలో కొనసాగుతోంది. ఇక్కడ ముఖ్యవాణిజ్య పంటగా పసుపుతో పాటు పొద్దు తిరుగుడు, ఎర్ర జొన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పాలన్న ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారింది. కామారెడ్డి ప్రాంతంలో చెరుకు పంట విస్తృతస్థాయిలో పండిస్తారు. గతంలో ఖండసారీ చక్కెర పరిశ్రమలకు చెరుకు తరలించే రైతులు ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని గాయత్రీ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీ ముందుగానే రైతుల నుంచి ఒప్పందాలు చేసుకొని చెరుకు పంట పండించేందుకు ముడి సరుకుతో పాటు ఆర్థిక సహాయం కల్పిస్తుంది. అయితే వర్షాధారంగా బోర్ల కింద సాగయ్యే ఈ పంట ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడంలో విఫలమవుతున్నారు. జిల్లాలోని ఈ ప్రాంతంలో చెరుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత దిగుబడి సాధించేందుకు రైతులకు మెళుకువలు తెలుస్తాయి.
జిల్లాలో ఇప్పటికే వరి పరిశోధనా కేంద్రాన్ని వర్ని మండలం రుద్రూర్లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ పరిశోధన ఆ ప్రాంతానికే పరిమితమైంది. రబీ సీజన్లో సైతం వరి సాగు గత దశాబ్దంగా అంతంత మాత్రంగానే దిగుబడి సాధిస్తుంది.
జిల్లాలో పేరుమోసిన వరి వంగడాలుగా ఐఆర్ 64 రుద్రూర్ పరిశోనా కేంద్రం రూపొందించినప్పటికీ జిల్లా అంతటా ఈ వంగడాన్ని అభివృద్ధిలోకి తేవడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. మద్నూర్ ప్రాంతంలో విస్తృతస్థాయిలో పండే పత్తి పంటకు మార్కెటింగ్ ఇబ్బందులను రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.
Latest posts by Nizamabad News Central Desk (see all)
- పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు - March 16, 2017
- పంటపొలాలు ధ్వంసం. - March 15, 2017
- ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన TNREDCL చైర్మన్ - March 5, 2017