Breaking News

లోగుట్టు?

నిజామాబాద్‌, జనవరి 10,

 

నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు చివరకు ఏం తేల్చనున్నారు…….. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించి ఒక్కసారిగా ఎందుకు నిలిప వేశారు…115 భవనాలకు నోటీసులు ఇచ్చిన బల్దియా…ఓ వైద్యుడి బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేయడంతో ఈ తంతును ముగించేసిందా…..!

నిజామాబాద్‌, జనవరి 9: నిజామాబాద్‌ నగరంలో ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు, కూల్చివేతల పరంపర యగ్నంలా సాగుతుందని భావించిన తరుణంలో ఆరంభశూరత్వంగా మిగలడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పెద్దల హస్తం కూడ ఉందనడం హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన మున్సిపల్‌ నగర పాలకవర్గం, అధికారులు కొంతకాలంగా స్పెషల్‌డ్రైవ్‌ చేశారు. ఈ సందర్బంగా 115 భవనాలు అక్రమంగా నిర్మించారంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఖలీల్‌వాడిలోని ఆస్పత్రుల అక్రమ భవనాలకు కూడా కార్పొరేషన్‌ అధికారులు అక్టోబర్‌లో నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నవంబర్‌ 23న అక్రమ కట్టడాల కూల్చివేతలను మొదలుపెట్టారు. నాలుగైదు రోజులు కూల్చివేతలను ముమ్మరంగా సాగించిన కార్పొరేషన్‌ అధికారులు ఆ తర్వాత అకస్మాత్తుగా ఆపేశారు. ఈ వ్యవహారంలో ‘గుట్కా’ వ్యాపారంతో సంబంధమున్న ఓ మైనార్టి నేత చక్రం తిప్పి రూ.కోటికి ‘డీల్‌’ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు కార్పొరేషన్‌ అధికారులు తలొగ్గి మౌనం వహిస్తున్నారంటున్నారు. పాత కట్టడాల తొలగింపును పక్కన పెడితే నూతనంగా చేపట్టే అక్రమ కట్టడాలను పట్టించుకోకపోవడంతో అవి జోరందుకున్నాయి అని అంటున్నారు. కనీస నిబంధనలను పాటించకుండా అనుమతులను లెక్కచేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై కార్పొరేషన్‌ అధికారులు ప్రశ్నిస్తే ‘ఇంతకుముందే నిర్మించిన అక్రమ కట్టడాల సంగతేమిటి అని ప్రశ్నిస్తుండటం’ గమనార్హం.

అధికారుల వెనుకడుగు

జిల్లా కేంద్రంలో ఖలీల్‌వాడి, వినాయక్‌నగర్‌, గంగాస్థాన్‌ ప్రాంతాల్లో అపార్టమెంట్లు, నూతన కట్టడాల జోరు పెరిగింది. నిబంధనలకు విరుద్దంగా భవనాలు చేపట్టడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగాయి. అక్టోబర్‌లో వినాయాక్‌నగర్‌లోని అశోక అపార్ట్‌మెంట్‌లో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. సంబంధిత అపార్ట్‌మెంట్‌ను అధికారులు సీజ్‌ చేయగా, నాలుగు రోజుల తర్వాత తిరిగి నిర్మాణ పనులు కొనసాగాయి. అలాగే నగరంలో సెల్లార్లు లేకుండా నిర్మాణాలు కొనసాగాయి. వినాయక్‌నగర్‌లోని ఓ టీవీ షోరూం భవనానికి సెల్లార్‌ కూడా వ్యాపార సముదాయంగా మారింది. అలాగే బస్టాండ్‌ వద్ద ఓ కాంప్లెక్స్‌కు సెల్లార్‌లో సైతం వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. అపార్ట్‌మెంట్లకు సెట్‌బ్యాంకు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బస్వగార్డెన్‌ సమీపంలో మూడు అపార్టుమెంట్లు, గంగాస్థాన్‌, వినాయాక్‌నగర్‌ ప్రాంతంలో విచ్చలవిడిగా అపార్ట్‌మెంట్లు పెరిగిపోతున్నాయి. కనీస నిబంధనలు కూడా పాటించడంలేదు. ఖలీల్‌వాడిలోని చక్ర ఆస్పత్రిని కేవలం 150 గజాల్లోనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. నవంబర్‌లో కార్పొరేషన్‌ అధికారులు పై రెండతస్తులను కూల్చివేశారు. అయినా ఈ భవనంలో ఆస్పత్రి కొనసాగుతోంది. వినాయాక్‌నగర్‌, సుభాష్‌నగర్‌లలోని ఉద్యానవనశాఖ ముందట రెండు భవనాలను అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నారని కార్పొరేషన్‌ అధిఆకరులు కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత ఇప్పుడా నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఇలా అనేకచోట్ల ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతను ఎందుకు మొదలెట్టారు? ఎందుకు ఆపేశారు? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

—-గురిచూసి కొట్టిన ‘గుట్కా’ నేత…

కార్పొరేషన్‌లో అక్రమ కట్టడాల నిర్మాణంలో యజమానుల తరపున ఒక గుట్కా నేత చక్రం తిప్పినట్లు తెలిసింది. ఇప్పటికే భారీగా వసూలు చేసి కొందరు పెద్దలను ప్రసన్నం చేసుకున్న సదరు నేత మరికొందరి వద్ద వసూళ్లపర్వం కొనసాగిస్తున్నాడన్న ప్రచారం ఉంది. సదరు మైనార్టీ నేత వ్యవహారం అధికారపార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. నోటీసులు అందుకున్న 15 భవనాల యజమానుల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసి ఓ ముఖ్యనేతకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. తద్వార కార్పొరేషన్‌ అధికారుల బారి నుంచి భవన యజమానులను తప్పించినట్లు చెపుకుంటున్నారు. అక్రమ గుట్కా వ్యాపారం చేస్తున్న నేత ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎవరిపైనా ఇలాంటి తప్పిదాల నుంచి రక్షించేందుకు పనిచేస్తున్నట్లు జనం రోడై కూస్తోంది. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్మాణాన్ని కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తే కూల్చివేశారు. ప్రస్తుతం తిరిగి యథావిధిగా కొనసాగుతోంది. దీనిపై స్పందించిన అధికారులు మౌనంగా ఉన్నారు. ఇందులో సదరు నేత మధ్యవర్తిగా లకలాది రూపాయలు అందించి కొందరు అధికారులను సమన్వయపరిచినట్లు తెలిసింది. గతంలో నిజామాబాద్‌ మండలం కాలూరు సమీపంలో గుట్కా కంటైనర్‌ను పోలీసులు పట్టుకోగా సదరు నేత ఓ నేతతో ఫోన్‌ చేయించుకొని విడిపించుకున్నాడు. నాటి పోలీసులను ఎలాంటి జోక్యం చేసుకోకుండా చూసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా సదరు నేతపై జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ కొనసాగుతోంది.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *