కనుమరుగవుతున్న కులవృత్తులు

 

– రెడిమేడ్‌తో రోడ్డున పడుతున్న కళాకారులు

– కులవృత్తులపై యంత్రాల దాడి

– ఉపాధి కోసం ఊర్లు ఖాళీ

– ప్రభుత్వ ఆదరణ కరవు

– చేతిలో పనిలేక చిదిగిపోతున్న బతుకులు

రెంజల్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తులకు, కళాకారులకు ప్రసిద్ధిగాంచిన మనదేశంలో నేడు కులవృత్తులు కళాకారులు కరువై కనుమరుగైపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కులవృత్తులు మూలనపడ్డాయి. చేతిలో పనిలేక చిదిగిపోతున్న బతుకులు ఉపాధి కోసం కొందరు వలసబాట పడుతుండగా మరికొందరు స్థానికంగానే దినసరి కూలీలుగా మారుతున్నారు. యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కులవృత్తులు మూలనపడ్డాయి. రెడిమేడ్‌ యంత్రాలు, ప్లాస్టిక్‌, స్టీల్‌, దుస్తులు, కర్రవస్తువులు, ఆభరణాలు వంటి వాటిపై రెడిమెడ్‌ వస్తువులు దాడిచేశాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా వృత్తిదారులకు పనులులేక కుటుంబపోషణ భారమై దిక్కుతోచని స్థితిలో ఉన్న కళాకారులను ఇప్పటికైన ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించి కులవృత్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ప్రతి పనికి కులవృత్తుల వారిపై ఆధారపడాల్సి వచ్చేది. చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, దర్జీ ఇలా అన్ని కులాలవారు చేసిన పరికరాలు వస్తువులతోనే పనులు జరిగేవి. ఇప్పుడు చేద్దామంటే పనులు లేక పస్తులుంటున్న పరిస్థితి.

దుమ్ము పట్టిన కుమ్మరి కొలిమి :

పంటలు చేతికొస్తున్నాయంటే రైతులకు ముందుగా గుర్తుకు వచ్చేది కుమ్మరివారు. ఉదయం నుంచి రాత్రి వరకు కొడవళ్లను సానబడుతూ, ఎడ్లబండ్లకు కుమ్ములు పడుతూ, నాగళ్ళకుకర్రులు సానపడుతూ నిత్యం బిజీగా ఉండే కమ్మరి కొలిమి నేడు కొలిమి వెలగక బ్రతుకు గడవని పరిస్థితిలో ఉన్నాడు. రైతులు పెట్టిన ధాన్యంతో కుటుంబ పోషణ జరిగేది. అలాంటిది గ్రామంలో ధాన్యం కొనేవారే కరువయ్యారు. హర్వెస్టర్‌ అందుబాటులో ఉండడంతో కొడవలిపట్టే రైతే కనిపించని పరిస్థితి నెలకొంది.

వడ్రంగి జీవితం దుర్భరం :

యంత్రాలు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో వడ్రంగి జీవితం దుర్భరమైంది. ఒకప్పుడు వడ్రంగి లేకపోతే రైతులేడని చెప్పాలి. కాని నేడు యంత్రాలు రావడంతో వడ్రంగి పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. గొర్రు చేయాలన్నా, నాగలి కావాలన్నా, గుంటుక, దేర, ఇలా ఏదైనా చేయాలంటే ముందుగా వెళ్లేది వడ్రంగి వద్దకే. నేడు వీధి వీధికి ట్రాక్టర్‌ ఉండడంతో రెడిమెట్‌ గొర్రు…నాగలి, గుంటుక అందుబాటులో ఉన్నాయి. దీంతో వడ్రంగి దుర్భర జీవితం గడుపుతున్నాడు.

తుమ్ములు మొలిచిన కుమ్మరివాము :

ప్లాస్టిక్‌ బిందెలు, స్టీలు ఫ్రిజ్‌లు మార్కెట్లో వివిధ రకాలలో అందుబాటులోకి రావడంతో కుమ్మరివారి కుండలు కొనేవారే కరువయ్యారు. ఒకప్పుడు కుమ్మరి కుండలేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. చెరవులకు వెళ్ళి మట్టిని తెచ్చి నానబెట్టి కుండలు తయారుచేసి కుమ్మరివాములో కాల్చేవారు. కాని నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్‌లోకి కొత్త కొత్త హంగులతో పరికరాలు అందుబాటులోకి వచ్చి కుండలు కొనేవారే కరువయ్యారు. ఘనంగా జరుపుకొనే బోనాల పండుగలకు, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించాలన్నా కుండలకు బదులుగా ఇత్తడి, స్టీల్‌ బిందెలను వినియోగిస్తున్నారు. ఫలితంగా కుమ్మరివారు వినియోగంలో లేకపోవడంతో అందులో తుమ్ములు మొలిచాయి.

కనిపించని నాటి దర్జీ దర్జా :

మార్కెట్‌లోకి రెడిమెడ్‌ దుస్తులు రావడంతో దర్జీలకు పనిలేకుండా పోయింది. ఒకప్పుడు దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి పండగలు వచ్చాయంటే ఇంటిల్లిపాది కొత్త బట్టలు కుట్టించుకునేవారు. పండగలకు నెలరోజుల ముందు నుంచే దర్జీలకు గిరాకీ ఉండేది. ఎంత కుట్టినా చేతినిండా పని ఉండేది. కుటుంబ సభ్యులందరు కలిసి రాత్రింబవళ్ళు కష్టపడినా ఒక్కోసారి కొత్త బట్టలు సమయానికి అందించేవారు కాదు. కాని నేడు కాలం మారింది. పండుగ వచ్చిందంటే పట్నానికి వెళ్ళి రెడిమెడ్‌ బట్టలు తీసుకోవాల్సిందే. దీంతో కుట్టు మిషన్ల చప్పుడు ఆగిపోయింది. గ్రామాల్లో బట్టలు కుట్టుకునేవారు లేక పట్నం బాట పట్టారు టైలర్లు.

కరువైన సర్కారు చేయూత :

మారిన పరిస్థితుల కులవృత్తులు నేడు కనుమరుగైనా వాటిని కాపాడేందుకు మాత్రం సర్కార్‌ చేయూత లేకుండా పోయిందని వృత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న నానుడి నేడు ఆ గ్రామాల్లో ఉండే కులవృత్తులు అంతరించి పోతున్నా కూడా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రభుత్వ సహాయం అందక దిక్కుతోచని స్థితిలో దుర్బర జీవితాల్ని గడుపుతున్నారు కులవృత్తులవారు. ఇప్పటికైనా ఉపకరణాలు, సామగ్రి, యంత్రాల్ని ప్రభుత్వం సమకూరుస్తే వాటితో పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటామని వారు చెబుతున్నారు. అలాగే కులవృత్తుల ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని కులవృత్తిదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *