Breaking News

నీళ్ళు లేక, వానలు లేక అల్లాడుతున్న పల్లె తెలంగాణా!

మన పల్లెల్లో పరిస్థితి చాల విషమంగా ఉంది. వేసిన పంటలు ఎలాగూ చేతికి రావడం లేదు. కాని అది ఎవ్వరు ఆలోచించడం లేదు. బతకడానికి కనీసం తాగే నీళ్ళు కూడా కరువయ్యే కరువు పరిస్థితి ఈనాడు ఊర్లల్లో ఉంది. బోర్లకు నీళ్ళు అందడం లేదు. నా నాటికి పరిస్థితి దిగజారుతున్నది. వారం వారానికి తేడా వస్తున్నది. స్వాతంత్రం వచ్చి ఆరు పదులు దాటినా కనీసం తాగు నీళ్ళు అందించలేని పరిస్థితికి అందరం సిగ్గు పడాలి. “ఇండియా షైనింగ్ “, “మేక్ ఇన్ ఇండియా ” కేవలం శుష్క నినాదాలుగా మారి, ఈ సభ్య సమాజంలో మనం ఇంకా కనీస అవసరాలు తీర్చలేకున్నం. ఈనాడు ఊర్లల్లో మొబైల్ ఫోన్లు, బీర్లు, విస్కీలు సులభంగా దొరుకుతున్నాయి కాని తాగే నీళ్ళు దొరకడం కష్టంగా ఉంది.
నిన్న ఊర్లో మా అమ్మతో మాట్లాడాను. ఇప్పటికే తాగే నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. ఇప్పుడు వాడే నీళ్ళకు కూడా కష్టంగా ఉందట. రోజుకు 5, 6 బిందెల సరిపడా వస్తున్నాయి. వచ్చే వారం వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

ప్రభుత్వ పథకాల అమలు – గ్రామ అభివృద్ధి పై సమాచార సేకరణ

 
“డయల్ యువర్ విల్లేజ్ ” టీం, మన తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన “మిషన్ కాకతీయ”, “హరిత హారం” మరియు “గ్రామ జ్యోతి” పై సర్వే చేయాలని సంకల్పించింది. ఈ పథకాల అమలు ఎలా ఉంది, దానివల్ల ప్రజలకు ఎలా మేలు కల్గుతుంది అని తెలుసుకోదలిచాం. ఒక సర్వే ఫారం తయారుచేసి, ముందుగా ఒకటి రెండు మండలాలలో ఫోన్ ద్వార ఊరి సర్పంచులతో మాట్లాడి సమాచారం సేకరించాం. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. 
 
ఖిల్లా ఘనపురం మండలంలో …. 
 
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నీళ్ళు, వానలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. స్థూలంగా ఈ క్రింది అంశాలపై మాట్లాడి, సమాచారం సేకరించాం. 
 
మిషన్ కాకతీయ 
ఈ ప్రాజెక్ట్ వల్ల ఊర్లకు, వ్యవసాయానికి మేలు జరుగుతుందని సర్పంచులు అంటున్నారు. కాకపోతే, వానలు లేనందువల్ల పూడికలు తీసినా పెద్ద ప్రయోజనం ఈ సీజన్లో జరుగలేదని వాపోయారు. మున్ముందు వానలు పడి, చెరువులు నిండి రైతులకు లాభిస్తుందని ఆశిస్తున్నారు. పొలాలకి ఒండ్రు మట్టి కొట్టుకున్న రైతులు భూములు సారవంతమై మంచి పంటలు మున్ముందు వస్తాయని భావిస్తున్నారు. 
చాలా ఊర్లల్లో గ్రామస్తులే ఒక గ్రూప్ గా ఏర్పడి చెరువు కాంట్రాక్టు పనులు చేసారు. ఊర్లో పొలిటికల్ గా చురుకుగా ఉండే వ్యక్తులు కలిసి గ్రూప్ గా ఈ పనులు పంచుకున్నారు. సహజంగా తెరాస నాయకులు ఎక్కువ లబ్ధి పొందినా, ఊరి పరిస్థితులను బట్టి, అక్కడక్కడ కాంగ్రెస్ మరియు తెదేపా వాళ్ళు కూడా ఈ పనులు పంచుకున్నారు. కొన్ని ఊర్లలో సర్పంచ్ కూడా ఈ పనుల్లో భాగస్వామ్యులుగా ఉన్నారు. బయటి కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ లేకుండా, లోకల్ వాళ్ళే పన్లు చేయడం వల్ల, పనులు నాణ్యంగా జరిగాయా అనే విషయం కొంత లోతుగా వెళ్లి విశ్లేషణ చేయాలి. సర్పంచులు పనులు నాణ్యంగానే జరిగాయని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్ల్లో , కాంట్రాక్టర్ తక్కువకి quote చేయడంతో పెద్దగా లాభించలేదని, నష్టం కూడా జరిగే పరిస్థితి ఉందని ఒకరిద్దరు సర్పంచులు చెప్పారు.
మొత్తం మీద, వానలు లేకపోవడం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై కొంత నిరాశకు గురి చేసింది. కాని మున్ముంది ఒనగూడే ప్రయోజనంపై ఇంకా ప్రజలు ఆశావహులై ఉన్నారు.
హరిత హారం 
వర్షాభావ పరిస్థితి ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా దెబ్బ తీసింది. అనుకున్న లక్ష్యాలలో పదోవంతు కూడా చేసే పరిస్థితి లేదు. చాల మంచి ప్రయోజనాలు కలిగే ప్రాజెక్ట్, సరియైన ప్రణాళిక లేకపోవడంతో ముందుకు పోలేకపోయింది. వానలు లేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఎక్కువ సమయం తీసుకొని, ప్రత్యామ్నాయ ఆలోచనలతో, అనువైన మార్గంతరాలతో ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాల్సి ఉండింది.
చాలా ఊర్లలో 200 – 5000 వరకు మొక్కలు పెట్టారు. ముఖ్యంగా ఇంటింటికి 3-5 మొక్కల చొప్పున ఇచ్చారు. మొక్కలు పెంచక పోతే రేషన్ రాదని, పెన్షన్ రాదని కూడా భయం చెప్పారు. అలా చెప్తే తప్ప జనాలు స్వచ్చందంగా చేసే అవగాహన కల్పించలేదు. మొక్కలలో దానిమ్మ, ఉసిరి, నిమ్మ, బత్తాయి, చింత, సుబాబులు, కానుగ, టేకు ముఖ్యంగా ఇచ్చారు.
ఇంకా స్కూల్స్ లో, గ్రామ పంచాయత్ దగ్గర, కొంత రోడ్ల పక్కన నాటారు. ఇవి సర్పంచ్ సిబ్బంది కొంత కాపాడుతున్నారు.
మిగతా మొక్కలు ఇంకా నర్సరీలలో ఉన్నాయి. వానలు పడితే వాటిని పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సర్పంచులు చెప్పారు. “ఈ వర్షాభావ పరిస్థితికి మనం చెట్లు కొట్టేయడం, మరి కొత్త చెట్లు పెట్టక పోవడం కారణమనే అవగాహన ప్రజల్లో వచ్చిందా” అనే ప్రశ్నకు కొంత వచ్చిందనే సర్పంచులు అంటున్నారు. వానలు పడితే తప్పక మొక్కలు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.  అన్ని డిపార్టుమెంటులు కలగలపకుండా ఒక డిపార్టుమెంటు ద్వారా చేయిస్తే ఈ హరిత హారం విజయవంతమౌతుందని ఒక సర్పంచ్ అన్నారు. మొత్తం మీద “హరిత హారం” ఐడియా పల్లెల వరకు, ప్రజల వరకు చేరింది. కాని అది సరిపోదు. ఈ అవగాహన ప్రజల్లో బలంగా రావడానికి ప్రభుత్వం స్వచ్చంద, సామాజిక సంస్థల సహాయం తీసుకొని, వారి భాగస్వామ్యంలో చేసినట్లయితే ఫలితాలుంటాయి. ఒక మంచి ఆలోచన, ప్రభుత్వ వేగిరపాటు వల్ల, అమలులో అవకతవకల వల్ల ఆగిపోకూడదు. ప్రభుత్వం పునరాలోచించి మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళాలి.
గ్రామ జ్యోతి 
ఇది ఇప్పుడే ముందుకు వస్తున్న పథకం. దీంట్లో రెండు భాగాలున్నాయి. ఒకటి బడ్జెట్, రెండు తమ ఊరిని తామే బాగు చేసుకోవాలనే ఆలోచన. అన్ని ఆదాయ పద్దులను కలగలిపి, దానిని 2-6 కోట్ల మొత్తంగా చూయిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఒక తాయిలం చూయిస్తున్నది. మరి అది కావాలంటే ప్రజలు కమిటీలు వేసుకొని స్వచ్చందంగా పనిచేసుకోవాలని చెప్తుంది. ప్రజల, నాయకుల దృష్టి తాయిలం పై ఉంది కాని కమిటీలపై అవగాహన లేదు. అది వారి తప్పు కాదు. మన గత ప్రభుత్వాలన్నీ ప్రభుత్వమంటే ఏదో ఇస్తుంది మనం తీసుకోవాలనే మైండ్ సెట్ తయారుచేసింది. “గంగాదేవిపల్లి” పై సిడి (CD) వేసినంత మాత్రాన ప్రజలు మారుతారా? గంగాదేవిపల్లి వెనుక కూసం రాజమౌళి అనే వ్యక్తి ఇరవయ్యేళ్ళ తపన, పరిశ్రమ ఉంది. ఆ ఊరికి దన్నుగా నిలిచి అవగాహన నూరిపోసిన “బాల వికాస” లాంటి స్వచ్చంద సంస్థల కృషి ఉన్నది. ఇది ఒక్కరోజులో ఓ అధికారి వచ్చి 7 కమిటీలు వేస్తేనే వస్తుందా? ఇటువంటి అవగాహన కల్పించి, ప్రజల ఆలోచన తీరును మార్చి, కార్యోన్ముఖులను చేసే ప్రక్రియలో స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలి. కొంత సమయం తీసుకొని, ఈ ఆలోచనలను వారిలో చొప్పించాలి. అప్పుడు గంగాదేవిపల్లి లో సాధ్యమయింది, అంతటా సాధ్యమౌతుంది.
ఇక బడ్జెట్ విషయానికి వస్తే, అందులో 70% EGS ఫండ్స్, కొంత 13th ఫైనాన్సు , కొంత 14th ఫైనాన్సు , కొంత SFC ఫండ్స్, మిగతా కొంత స్పెషల్ గ్రాంట్. ఇదీ గ్రామ జ్యోతి బడ్జెట్. ఇందులో సర్పంచు చేతికి వచ్చే పైసలు తక్కువ. మరి సర్పంచులు ఈ నిధులు ఏ రకంగా ఖర్చు చేయాలనుకుంటున్నారు? 90% సర్పంచులు చెప్పినవి రెండే విషయాలు. ఒకటి CC రోడ్లు, రెండు డ్రైనేజీలు. ఇప్పుడిప్పుడే కొంత నీటి సమస్య ఎదురై వాటి గురించి కూడా అడుగుతున్నారు .
మరి పరిష్కార మార్గాలేమిటి?
గ్రామ వ్యవస్థ చిన్నాభిన్నమై ఉంది. ఒకప్పుడు ఊరు స్వయం సమృద్ధిగా ఉండింది. కాని ఇప్పుడు ఊరు వెల్ఫేర్ సెంటర్ లా ఉంది. ప్రభుత్వం గాని, ఇంకెవరైనా ఏమైనా ఇస్తారా అని ఆశించే పరిస్థితికి ప్రభుత్వ విధానాలు తీసుకొచ్చాయి. ప్రజల్లో సరైన అవగాహన కల్పించకుండా ఎన్ని పథకాలు వేసినా ఫలితాలు నామమాత్రమే. మంచి ఆలోచనలకు, చక్కని ప్రణాళిక కూడా అవసరం. వాటిని అమలు చేసే ఉద్యోగుల్లో కూడా నిబద్ధత కావాలి. ఘనపూర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ కి శ్రీనివాస్ అనే డాక్టర్ వచ్చారు. అతని నిబద్ధతను గుర్తించిన స్థానికులు కొంత విరాళాలు సేకరించి 6 లక్షల రూపాయలతో కొంత అవసరమైన పరికరాలు సమకూర్చారు. దాంతో హాస్పిటల్ చక్కగా పనిచేస్తుందని, ప్రజలకు అనేక సేవలు అందిస్తుందని తెలిసింది. అది ఒక వ్యక్తి వల్ల వచ్చిన మార్పు.
ఊర్లల్లో స్కూల్ వ్యవస్థ కూడా వేగంగా క్షీణిస్తున్నది. ప్రభుత్వ పాటశాలలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ప్రతి ఊర్లో సగానికి పైగా ప్రైవేటు స్కూల్స్ కి వెళ్తున్నారు. ప్రజల్లో ఏమి చేసైనా పిల్లల్ని చదివించాలన్న ఆలోచన రావడం సంతోషమే, కాని అదే సమయానికి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ బడులు మాత్రం విద్యార్థులు లేక మూత పడే పరిస్థితిలో ఉన్నాయి. రెండు వైపుల ఖర్చుతో వ్యవస్థకు ప్రయోజనం లేకుండా పోతుంది.
చివరగా ఓ విజ్ఞప్తి !
ఈ విధమైన సర్వే ప్రతి మండలంలో జరగాలి. క్షేత్ర స్థాయి పరిస్థితిపై అవగాహన రావాలి, చర్చ జరగాలి. టెక్నాలజీ వినియోగించుకొని మనం ప్రజలకు మరియు ప్రభుత్వాలకు వారధి కావాలి. మనం చేసే పది పైసల సహాయం కన్నా, 8 గంటల సమయం వెచ్చించి వాళ్ళతో మాట్లాడి, నిజాలను మాట్లాడే పౌర బాధ్యత గొప్పది.
తెలంగాణాన వచ్చి సంవత్సరం దాటింది. చాలా సంబరాలు చేసుకున్నాం. ఇక ఇప్పుడైనా జరగాల్సిన పనుల మీద చర్చిద్దాం.
మీలో ఎవరైనా మీ మండలంలో సర్వే చేయాలనుకుంటే, facebook పై “డయల్ యువర్ విల్లేజ్ ” (https://www.facebook.com/pages/Dial-Your-Village/800575353346003?fref=ts) టీం కి మెసేజ్ పంపండి. చాల సులువుగా ఈ సర్వే చేయవచ్చు.
– రవి మేరెడ్డి
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రైతుల సంతాప సభ

బోధన్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం దేశ వ్యాప్తంగా రైతు అమరుల సంతాప దినం ...

Comment on the article