Breaking News

అక్రమాలపై బాణం… అంతర్జాలమే ఆయుధం…

జుక్కల్‌, న్యూస్‌టుడే: నేటి ఆధునిక కాలంలో అంతర్జాలం ప్రపంచాన్నే శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ సేవలపై అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెల వరకు ప్రతి ఒక్కరూ అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌, ముఖ్యమంత్రి ఇలా ప్రతి ఒక్కరూ ప్రజలకు అందించే సేవల్లో నాణ్యతను పెంపొందించుకునేందుకు పారదర్శకతను పాటిస్తున్నారు. అయితే వినియోగదారులు, ప్రజలు తమకు అందుతున్న సేవలపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా మరికొన్న కార్యాలయాల్లో అధికారులు పౌరసేవ పత్రం అమలు చేయకుండా లంచాల కోసం పీడిస్తున్నారు. ఇక ఇటువంటి అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు. ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వీటిని స్వీకరించిన ప్రభుత్వ సంస్థలు ఆ ఫిర్యాదులకు సత్వర పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే….

విజిలెన్సు శాఖ
ప్రభుత్వ శాఖల పనితీరు, పౌరులకు అందుతున్న సేవలపై విజిలెన్సు విభాగం పనిచేస్తోంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పని కావాలంటే లంచం ఇచ్చి చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో లంచం అడుగుతున్నారని ఉన్నత స్థాయి అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్సు విభాగం ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.సెంట్రిల్‌విజిలెన్సు.కమ్‌’ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో కుడిచేతి వైపు ఉన్న లోడ్జ్‌ ఆన్‌లైన్‌ కంప్లైంట్‌పై నొక్కాలి. ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే యూజర్‌ ఐడీని క్రియేట్‌ చేసుకొనే తెర వస్తుంది. అక్కడ పేరు, చిరునామా, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను నమోదు చేసుకోవాలి. ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రధాన వెబ్‌సైట్‌లలో నమోదు చేసి లాగిన్‌ అయితే విండో తెరుచుకుంటుంది. అక్కడ కంప్లైంట్‌ అనే బాక్సులో ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. పిర్యాదు రుజువుకు సంబంధించిన పత్రాలు, విడియోలు స్కాన్‌ చేసి పంపవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన రిఫరెన్సు సంఖ్య ఆధారంగా ఫిర్యాదు గురించి పదిరోజుల తర్వాత చూసుకోవచ్చు. అంతవరకు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది

కేంద్ర ప్రభుత్వ సంస్థలు- సహచట్టం ఫిర్యాదు
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 84 సంస్థల్లో క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతి అక్రమాలపై, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్న నిధుల వివరాల గురించి సహచట్టం ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చు
* ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఆర్టీఐఆన్‌లైన్‌.కమ్‌’ అనే వెబ్‌సైట్‌ను మొదట లాగిన్‌ కావాల్సి ఉంటుంది
* అక్కడ కుడివైపున ‘సైన్‌ ఆఫ్‌ హియర్‌’ అనే ఆప్షన్‌లోకి వెళ్లి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
* మెయిల్‌ ఐడీ, యూజర్‌ నేమ్‌ సహాయంతో మీ ఖాతాను ఆక్టివేట్‌ చేసుకోవాలి
* ఈ ఖాతా ద్వారా మనకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఎంచుకొని అడిగే ప్రశ్నలను ‘టెక్ట్స్‌ ఫర్‌ రిక్వెస్ట్‌’ అప్లికేషన్‌ నింపాలి
* ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుము రూ. 10 చెల్లించి 30 రోజుల్లోగా సమాచారం పొందవచ్చు.

ప్రధానమంత్రికి చేసే ఫిర్యాదులు ఇలా…
దేశ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలంటే ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.పీఎంఇండియా.గోవ్‌.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి సమస్యలను విన్నవించవచ్చు. పేజీ తెరుచుకోగానే ‘ఇంటరాక్ట్‌ విల్‌ హానరబుల్‌ పీఎం’ అని వస్తుంది. సైట్‌పై క్లిక్‌ చేస్తే చిరునామాతో పాటు మీ మెయిల్‌ ఐడీ అనుసంధానం ఉంటుంది. ‘క్లిక్‌ హియర్‌’ అన్న చోట క్లిక్‌ చేస్తే కామెంట్స్‌ అనే పేజీ తెరుచుకుంటుంది. ఫిర్యాదు దారుడి వివరాలైన ఈ-మెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీల్లో 1000 అక్షరాలల్లోపు సమస్యను వివరించి దిగువ భాగన ‘కోడ్‌’కు నమోదు చేయాలి.

ముఖ్యమంత్రికి ఇలా…
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.తెలంగాణ.గోవ్‌.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగన ‘సిటీజన్‌ ఇంటర్‌ ఫేస్‌’ అనే ‘పోర్టల్‌’ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసి ఈ-మెయిల్‌ ఐడీని నమోదు చేసి సంబంధిత విషయాన్ని కుప్లంగా రాయాలి.

రాష్ట్రపతికి పంపాలంటే…
రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ప్రెసిడెంట్‌ఆఫ్‌ఇండియా.నిక్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కుడివైపు ‘హెల్ప్‌లైన్‌’ పోర్టల్‌ను క్లిక్‌ చేస్తే ‘ప్రెసిడెంట్‌ సెక్రటేరియేట్‌ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్‌ ఏ రిక్వేస్ట్‌’ మీద క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ఫారం వస్తుంది. దాన్ని నింపి ‘గ్రివెన్స్‌ డిస్క్రిప్షన్‌’ అనే బాక్సులో 4000 పదాలకు మించకుండా సమస్యను వివరించి పీడీఎఫ్‌ రూపంలో ఆప్‌లోడ్‌ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సంఖ్య వస్తుంది. దాని సహాయంతో 15 రోజుల్లో పరిష్కారం అయిందా?.. లేదా?… అని చూసుకోవచ్చు.

గవర్నర్‌కు ఇలా…
‘ఏపీరాజ్‌భవన్‌ (ఎట్‌దరేట్‌ఆఫ్‌) జీమెయిల్‌.కమ్‌’ అనే మెయిల్‌కు ఫిర్యాదు దారుడు పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా రాసి నేరుగా పంపవచ్చు.

రిజర్వ్‌ బ్యాంకుకు చేయాలంటే…
సమాజంలో వ్యక్తుల మధ్య లావాదేవీలు అన్ని బ్యాంకులతో ముడిపడి ఉంటాయి. బ్యాంకుల్లో డబ్బు జమ చేయడం, తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బ్యాంకుల్లో ఖాతాదారులపై జరుగుతున్న అక్రమాలపై రిజర్వ్‌ బ్యాంకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ను లాగిన్‌ కావాలి. వాటిలో ఖాతాదారులు సాధారణ పౌరుల కోసం కుడివైపున ఏర్పాటు చేసిన బాక్సుపై క్లిక్‌ చేస్తే కొత్త విండో తెరుచుకుంటుంది. దాంట్లో పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలి. సాక్ష్యాలతో సహా ఆప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం ‘సేవ్‌’ చేయగానే ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందుతుంది. దీనిపై 15 రోజుల్లో విచారణ జరుగుతుంది.

పది రోజుల్లోనే సమాచారం – పెద్ది మురళి, సహ రక్షణ జిల్లా ప్రధాన కార్యదర్శి
సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేస్తే 30 రోజుల వరకు గడువు ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే పది రోజుల్లోపే సమాచారం తెలుసుకోవచ్చు. కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్‌లో విమానశ్రయం భూముల గురించి, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం ప్రతిపాదనల గురించి ఆన్‌లైన్‌లో వివరాలు కోరితే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని పదిరోజుల్లోపే సమాచారం అందించారు.

అందరూ సద్వినియోగం చేసుకోవాలి – అందుగులే రాములు, బస్వాపూర్‌
నేటి కాలంలో అంతర్జాలం ఆవశ్యకత రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా యువత అంతర్జాలంలో నిమగ్నమై సామాజిక వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారు. ప్రభుత్వం పనితీరుపై, అక్రమాలపై రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్లను సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు పారదర్శకత పాటించేలా విధిగా ప్రతి పౌరుడు కృషి చేయాలి.

Check Also

పెద్ద ఎక్లారాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ -ఒకరి పరిస్థితి విషమం

  మద్నూర్‌, నవంబర్‌ 9 : మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *