Breaking News

రాహుల్ వ్యూహం ఫలిస్తుందా?

మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లే కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించినంత మాత్రాన రాజకీయంగా ఎదగవచ్చని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన వ్యూహకర్తలు భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. రాహుల్ గాంధీ చాలా కాలం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ రాజకీయ దాడి చేస్తున్నారు. మోదీని విమర్శించేందుకు ఆయన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. మోదీది సూటుబూటు ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ ప్రారంభించిన విమర్శల పర్వం సాకులతో తప్పించుకోవద్దనేంత వరకు వచ్చింది. ఇది ఇక మీదట కూడా కొనసాగుతుందనేది నిర్వివాదాంశం. రాహుల్ గాంధీ నిన్న రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల సమావేశంలో సైతం నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దేశాన్ని పాలించాలి తప్ప సాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చకూడదంటూ ఎత్తిపొడిచారు.
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో కూడా ఆయన నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోశారు. రాహుల్ గాంధీ అతి స్వల్ప సమయంలో రెండు సార్లు హైదరాబాదు విశ్వవిద్యాలయానికి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొని మోదీని సూటిపోటి మాటలతో విమర్శించారు. విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ ప్రతి చిన్న విషయానికి కూడా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తున్నారు. ప్రధాన మంత్రిని విమర్శించటం ద్వారా రాహుల్ గాంధీ రాజకీయంగా ఎదగగలుగుతాడా? నరేంద్ర మోదీ రాజకీయానుభవంతో పోలిస్తే రాహుల్ గాంధీ రాజకీయానుభవం దేనికీ సరిపోదు. మోదీని విమర్శించేందుకు రాహుల్ గాంధీ రాజకీయ స్థాయి కూడా సరిపోదు.
రాహుల్ గాంధీకి మొన్నటి వరకు తల్లిచాటు పిల్లడు అనే ముద్ర ఉండేది. అది ఇప్పుడిప్పుడే పోతున్నా ఆయన ఇంకా పూర్తి స్థాయి నాయకుడుగా ఎదగలేదన్నది కాం గ్రెస్ నాయకులు సైతం ఒప్పుకునే సత్యం. రాజకీయాలలోకి వచ్చేందుకు చాలా కాలం పాటు సంశయించిన వ్యక్తి లోక్‌సభకు ఎన్నికైన తరువాత కూడా అయిష్టంగానే రాజకీయం చేసిన రాహుల్ గాంధీ యాభై రెండు రోజుల అజ్ఞాత వాసం తరువాత బాగా మారిపోయారు. ఆయన తన పూర్తి సమయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకే కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లినా మొత్తం సమయాన్నంతా రాజకీయాలకే కేటాయించటం ద్వారా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం ప్రధాన మంత్రిపై విమర్శలు గుప్పించటం ద్వారా తాను రాజకీయంగా ఎదగటంతోపాటు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని సాధించిపెట్టాలనుకుంటే తప్పుచేసినట్లే.
నరేంద్ర మోదీని విధాన నిర్ణయాలు, పాలనలోని లోపాలను ఎత్తిచూపించటం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలి. మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభు త్వం తప్పులను ఎత్తిచూపించటం ద్వారా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలి,రోడ్డెక్కిపోరాడాలి తప్ప చీటికిమాటికి విమర్శించ కూడదు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టి పంతొమ్మిది నెలలు కావస్తున్నా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. పలు ముఖ్యమైన పథకాలను ప్రకటించినా అవి సమర్థంగా అమలు కావటం లేదు. నరేంద్ర మోదీ పని తీరు పట్ల ఆయన మంత్రులు సైతం అసంతృప్తితో ఉన్నారు. బి.జె.పి నాయకులు, కార్యకర్తలు సైతం అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతోషంగా లేరు. ఎన్.డి.ఏ ప్రభుత్వం పని తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నాను కాబట్టే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఓటమిపాలైంది. ఎన్.డి.ఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల ముందు సహేతుకంగా పెట్టటం ద్వారా వారి మద్దతు సంపాదించేందుకు రాహుల్ గాంధీ కృషి చేయాలి. ఎన్.డి.ఏ విధానాలు తప్పు అని నిరూపించటంతోపాటు వాటికి ప్రత్యామ్నాయంగా తాను ఏం చేయగలడనేది ప్రజలకు వివరించాలి. ప్రజలు ఆలోచించేలా చేయటం ద్వారానే రాహుల్ గాంధీ నాయకుడుగా, ప్రజా నాయకుడుగా ఎదగ గలుగుతాడు. పడికట్టు పదాలతో కూడిన విమర్శలు వినేందుకు బాగానే ఉంటాయి కానీ ప్రజల మద్దతు సంపాదించలేవు.
యు.పి.ఏ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకాన్ని మొదట భ్రష్టు పట్టించిన ఎన్.డి.ఏ ప్రభుత్వం దాని ప్రాధాన్యతను గుర్తిం చి తన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. రాహుల్ గాంధీ ఇలాంటి తప్పులను ఒక పద్ధతి ప్రకారం ఎండగట్టటం ద్వారా ప్రజలకు తన పట్ల విశ్వాసం కలిగించాలి. తాను నిజంగానే సీరియస్ నాయకుడనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించగలగాలి. రాజకీయంగా ప్రాధాన్యతను కోల్పోతున్న కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నాయకుడుగా ఎదగాలి. ప్రజల నాడిని పట్టుకోగలిగే వారిని రాజకీయ సలహాదారులుగా నియమించుకోవాలి తప్ప పడికట్టుపదాలతో కూడిన ప్రసంగాలను రాసి ఇచ్చే వారిని కాదు. రాహుల్ గాంధీ అక్కసుతో కోసం విమర్శ చేయకుండా అవగాహనతో విమర్శలు చేసే స్థాయికి ఎదగాలి అప్పుడే ప్రజాధరణ లభిస్తుంది.

Check Also

బీరు ఎక్కువైతే పేగు కేన్సర్‌

 నిత్యం పరిమితికి మించి బీరు తాగటం, హాట్స్‌ డాగ్స్‌, బేకన్స్‌ లాంటివి తినటం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ...

Comment on the article