Breaking News

స్నేహ వారధి!

అమెరికాలో మూడురోజుల పర్యటన ఆరంభానికి ముందు భారతప్రధాని తన ఐదుదేశాల యాత్రలో ఇప్పటికే మూడింటిని పూర్తిచేశారు. ఈ పర్యటనలో ఒబామాతో భేటీ ఎంత ప్రధానమైనదో, ఆఖరు నిముషంలో వచ్చి చేరిన స్విట్జర్లాండ్‌, మెక్సికోలతో వ్యవహారం కూడా అంతే ప్రధానమైనది. స్విట్జర్లాండ్‌ వ్యాపారవేత్తలను భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించడం, నల్లధనం, పన్ను ఎగవేతలు ఇత్యాది అంశాలపై సమష్టి పోరాటానికి సంకల్పించడం వంటివి అటుంచితే, ఏ లక్ష్యంతో ప్రధాని ఈ దేశంలో కాలుమోపారో అది ఇప్పటికే నెరవేరింది. ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’(ఎనఎ్‌సజీ)లో భారత సభ్యత్వానికి తాను మద్దతు ఇవ్వబోతున్నట్టు స్విట్జర్లాండ్‌ చేసిన ప్రకటన మోదీ పర్యటనకు సార్థకత చేకూర్చింది. ఎనఎస్‌జీలో భారత్ ప్రవేశానికి ససేమిరా అంటున్న మరొక దేశం మెక్సికోను అమెరికా పర్యటన అనంతరం మోదీ బుజ్జగించబోతున్నారు. చైనా పాకిస్థానలు చేయీచేయీ కలిపి భారత్ సభ్యత్వాన్ని నిరోధించే ప్రయత్నాలు విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ నెలాఖరు నాటి ఎనఎస్‌జీ సర్వసభ్యసమావేశంలోగా అడ్డంకులన్నీ అధిగమించాలన్నది మోదీ లక్ష్యం.
                  ఈ పర్యటన ఆరంభంలో ప్రధాని మోదీ అప్ఘానిస్థానలో కొద్ది గంటలే గడిపివుండవచ్చును కానీ, ఇరుదేశాల స్నేహబంధాన్ని అది మరింత బలోపేతం చేసింది. అప్ఘాన అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో కలసి ప్రధాని ఆరంభించిన సాల్మా డ్యామ్‌ ఇప్పుడు ‘అఫ్ఘాన్-భారత్ స్నేహపూర్వక జలాశయం’గా పరవళ్ళు తొక్కుతోంది. హరిరుద్‌ నదిపై చిస్త్‌-ఇ-షరీఫ్‌ దగ్గర 1700 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రప్రభుత్వ సంస్థ ‘వాప్కోస్‌’ చేపట్టిన ఈ నిర్మాణం హీరత ప్రాంతంలో 75వేల హెక్టార్లను సస్యశ్యామలం చేస్తూ 42మెగావాట్ల విద్యుత్ తో గ్రామాలను వెలిగిస్తున్నది. మోదీ అన్నట్టుగా ఈ జలాశయం అఫ్ఘాన్ ఉజ్వల భవిష్యత్తుకు, ఇరుదేశాల స్నేహానికి ఎంతో భరోసా ఇస్తున్నమాట నిజమేకానీ, ఇది అంత సునాయాసంగా జరిగిపోలేదు. రెండుదేశాలకు చెందిన అనేకమంది కార్మికులు ప్రాణాలొడ్డి పనిచేస్తూ, స్వేదాన్నీ రక్తాన్నీ చిందిస్తే కానీ ఆ నీరుపారలేదు. తాలిబాన్‌కు ఎదురొడ్డి 15వందల మంది ఇంజనీర్లు కలసికట్టుగా సాధించిన విజయం ఇది. భారీ యంత్రసామగ్రి భారతనుంచి ఇరాన్ కు సముద్రమార్గాన చేరి, అక్కడనుంచి 1200 కిలోమీటర్లు రోడ్డుమార్గాన తరలి, అఫ్ఘాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టింది మొదలు 300 కిలోమీటర్లు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య జలాశయం వద్దకు వచ్చేది. తాలిబాన దాడులు, అఫ్ఘాన్ భద్రతాదళాల ప్రతిదాడుల మధ్యన ప్రాణాలకు నమ్మకం లేని స్థితిలోనే పదేళ్ళపాటూ ఈ నిర్మాణం సాగింది. అఫ్ఘాన్ తో స్నేహ సాన్నిహిత్యాల కోసం దాదాపు 14వేల కోట్లు ఆ దేశ మౌలిక సదుపాయాలమీద ఖర్చుచేస్తున్న భారత్ ఇప్పటికే అక్కడ ఒక అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించి ఇచ్చింది. కానీ, సాల్మాడ్యామ్‌ కథ వేరు. పద్నాలుగేళ్లక్రితం వాప్కోస్‌ అధికారులు మొదటిసారిగా ఈ ప్రాంతంలో అడుగుపెట్టి, భారతదేశంలోని జలవిద్యుత ప్రాజెక్టులతో పోల్చితే బాగా చిన్నదైన ఈ ప్రాజెక్టును నిర్మించడం ఏమాత్రం కష్టం కాదని నిర్థారించుకున్న నాటికి పరిస్థితులు ఇప్పటిలాగా లేవు. అంతకు ఏడాది క్రితమే పూర్తిగా అణగిపోయిన తాలిబాన కాలక్రమేణా ఇలా తలెగరేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ, ఒకసారి అవునన్నాక ఇక శస్త్రసన్యాసం చేసే సమస్యేలేదంటూ భారత్ బలంగా అడుగువేసి అంతిమంగా ఈ లక్ష్యాన్ని సాధించింది.
                  ఈ స్నేహవారధి ఆరంభం కూడా సరైన సమయంలోనే జరిగింది. ఏడాదికాలంగా తాలిబాన్ ఎంతగానో రెచ్చిపోతున్నది. మరణిస్తున్న నాయకుల స్థానంలో కొత్తగా వస్తున్నవారు హింసాత్మక చర్యల్లో కొత్తపుంతలు తొక్కుతున్నారు. పాకిస్థాన్ సహకారంతో తాలిబాన్ ను శాంతిచర్చల్లో కూర్చోబెట్టగలనన్న అష్రాఫ్‌ఘనీ విశ్వాసం కూడా క్రమంగా అణిగిపోతున్నది. అధికారంలోకి రాగానే, పూర్వ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ విధానాలకు స్వస్తిపలికి, భారత్ ను పక్కకునెట్టేసి పాకిస్థాన్ తో దోస్తీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన ఘనీ అనతికాలంలోనే దాని వ్యవహారశైలిని బాగా అర్థం చేసుకున్నారు. తాలిబాన్ ను దారికి తేగలిగేది భారత కాదు, పాకిస్థాన్ మాత్రమే అన్న ఆయన ఆలోచన వాస్తవికమైనదే కానీ, తాలిబానతో చర్చలకు సహకరిస్తానన్న పాకిస్థాన హామీ ఉత్తిదేనని తేలిపోవడానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.
                  ఇప్పుడాయన అదునుచిక్కినప్పుడల్లా పాకిస్థాన్‌పై విరుచుపడుతున్నారు. చివరకు, ‘తాపీ’ పైప్‌లైన్ ఆరంభోత్సవంలోనూ, మొన్నటిమొన్న పాకిస్థాన్‌ను పక్కకునెట్టేసి భారత్-అఫ్ఘానిస్థాన్-ఇరాన మధ్య ట్రాన్సిట్‌ కారిడార్‌ ఒప్పందం కుదిరిన సందర్భంలోనూ ఘనీ తన ఆగ్రహాన్ని ఏమాత్రం దాచుకోలేదు. చైనా పాకిస్థాన్‌లను నిలువరించడానికీ, తన అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తరించడానికీ అఫ్ఘాన్‌తో స్నేహం భారత్‌కు ఎంతో అవసరం. అక్కడి రాజకీయనాయకత్వం వైఖరిలో వచ్చిన ఈ మార్పుతో పాటు, ఇటీవలే తాలిబాన్ నాయకత్వ మార్పిడిని కూడా పరిగణనలోకి తీసుకొని, అఫ్ఘాన్‌లో తన పాత్రను భారత్ నిర్వచించుకోవలసిన అవసరం ఉంది.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article