Breaking News

అమెరికన్లు అందుకే హిల్లరీని వద్దనుకున్నారా?

న్యూయార్క్: నువ్వా నేనా అన్నట్టు సాగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై తుదికంటా ఆశలు నిలబెట్టుకున్న హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా డీలాపడ్డారు. హిల్లరీ క్లింటన్ విజయం నల్లేరుమీద నడకేననీ… ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆమె వైపే ఉన్నారని సర్వేలు హోరెత్తాయి. అయితే ట్రంప్ చేతిలో ఓటమి చవిచూడడం వెనుక కారణాలేమిటన్న దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఈ మెయిల్ కుంభకోణమే ప్రధాన కారణమంటూ చెబుతున్నప్పటికీ… ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విజయావకాశాలను దెబ్బతీసినట్టు చెబుతున్నారు.  నామినేషన్‌కు ముందు పార్టీ ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌ ఆరోగ్యంపై విమర్శలు చేసేందుకు హిల్లరీ క్లింటన్ రాజకీయ గురువు నీరా టాండన్ అంగీకరించలేదు. ఒక వేళ శాండర్స్‌పై అలాంటి విమర్శలు చేస్తే అందరి దృష్టి హిల్లరీ ఆరోగ్య సమస్యలపైకి మళ్లే అవకాశం ఉంటుందని ఆమె ప్రచార నిర్వాహకుడు జాన్ పొండెస్టాను హెచ్చరించారు కూడా. ఈ విషయాన్ని వీకీలీక్స్ ఇటీవల బయటపెట్టింది. ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ లీసా బర్డక్ హిల్లరీ ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెబుతున్నప్పటికీ.. అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీనియర్ సలహాదారు జార్రెట్ మాత్రం ఆమె ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వైట్ హౌస్ వర్గాల ద్వారా బయటకి పొక్కింది. వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్లో రహస్యంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కూడా ఒబామా హిల్లరీని కోరినట్టు చెబుతున్నారు. కాగా ఒబామా హయాంలో 2009 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె అస్వస్థత కారణంగా హిల్లరీ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కూడా అమెరికన్లు మర్చిపోలేదంటున్నారు. వీకీలీక్స్ కథనాలను హిల్లరీ ఖండించినప్పటికీ అక్కడి ప్రజలకు ఆమె ఆరోగ్యంపై పూర్తి నమ్మకం కలిగించలేకపోయారు.  దీనికి తోడు ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా హిల్లరీ తూడి పడిపోవడంతో ట్రంప్ ఆమె ఆరోగ్యంపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థి సామర్థ్యంపై ఏ ఒక్క కారణాన్ని తేలిగ్గా తీసుకోని అమెరికా ఓటర్లు… ఆమె ఆరోగ్య సమస్యలను కూడా వదిలిపెట్టలేదని చెబుతున్నారు. ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగానే… ట్రంప్ మద్దతుదారు రూడీ గిలానీ హిల్లరీ ఆరోగ్యంపై విమర్శలు కురిపించారు. సెప్టెంబర్ 11న ఆమె కిందపడిపోయిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య సమస్యలు కూడా గెలుపుపై ప్రభావాన్ని చూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article