ట్రంప్‌పై తిరుగుబాటు.. ప్రత్యేక దేశంగా కాలిఫోర్నియా..!

కాలిఫోర్నియా:మొదటి నుంచి ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న కాలిఫోర్నియా.. అమెరికా నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. వలసదారులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో.. ట్రంప్ విధానాలు నచ్చని వారంతా ఏకమవుతున్నారు. అమెరికా నుంచి విడిపోయేందుకు కాలిఫోర్నియా వాసులు ప్రచారం మొదలెట్టారు. ఈయూ నుంచి బ్రిటన్.. ‘బ్రెగ్జిట్’ పేరుతో విడిపోయిన విధంగా.. అమెరికా నుంచి విడిపోయేందుకు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశంగా అవతరించేందుకు ‘కలెగ్జిట్’ పేరుతో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. గురువారం నుంచే ఈ పిటిషన్‌పై సంతకాల సేకరణ మొదలైందనీ, తదుపరి చర్యలు తీసుకునేందుకు అవసరమైనంత సంఖ్యలో సంతకాలు వస్తే.. తప్పకుండా ముందుకు వెళ్తామని కాలిఫోర్నియా స్టేట్ సెక్రటరీ అలెక్స్ పాండిల్లా స్పష్టం చేశారు.

యస్ కాలిఫోర్నియా ఇండిపెండెన్స్ సంస్థ ప్రెసిడెంట్ లూయిస్ మరినెల్లీ నేతృత్వంలో ‘కలెగ్జిట్’ పేరుతో సంతకాల సేకరణ మొదలైంది. మొత్తం 5 లక్షల 85వేల 407 మంది సంతకాలు పెడితే.. ప్రత్యేక దేశంగా అవతరించడం తథ్యమని చెబుతున్నారు. 2017వ సంవత్సరం జూలై 15వ తారీఖులోపు ఈ టార్గెట్‌ను తప్పకుండా చేరుకుంటామన్నారు. మొత్తం 7000 వేల మంది మద్దతుదారులు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలుపెట్టారన్నారు. కాగా గతంలో కూడా ఇదే విధంగా సంతకాల సేకరణ చేసినా.. సరైన ఫలితం కానరాలేదు. ప్రస్తుతం ట్రంప్‌పై కాలిఫోర్నియా వాసుల్లో నెలకొన్న వ్యతిరేకతతో ప్రస్తుతం ఈ పిటిషన్ కార్యరూపం దాల్చడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ప్రత్యేక దేశంగా 2018 ఎన్నికల్లో మన ప్రెసిడెంట్‌ను మనం ఎన్నుకుందామని యస్ కాలిఫోర్నియా ఇండిపెండెన్స్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాలిపోర్నియాలో అత్యధిక శాతం మంది ప్రజలు 2016 నవంబర్‌లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి ఓటేయడం గమనార్హం.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article