Breaking News

సయోధ్య సాధ్యమేనా?

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ అత్యధికస్థానాలు సాధించి, యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కావడంతో అయోధ్య అంశంలో ఏదో ఒక కదలిక తప్పదని అనుకున్నదే. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధినాయకులంతా బహిరంగ సభల్లో రాముడికి జైకొడుతూ, ఆలయ నిర్మాణం జరగాలంటే తమకు అద్భుత మెజారిటీ దక్కాల్సిందేనని ప్రజలకు గుర్తుచేశారు. ప్రధానితో ఒక్క వేదికనూ పంచుకోని యోగి ఆదిత్యనాథ్‌, తన ప్రచార సభల్లో రామమందిర నిర్మాణం ఖాయమని హామీ ఇస్తూ వచ్చారు. ‘నిర్మాణాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా?’ అని సవాలు చేశారు. ‘మసీదు కూల్చివేతనే ఆపలేనివారు, దీనిని ఆపగలరా?’ అని హెచ్చరించారు. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కొద్దిగంటల్లోనే, ఈ వివాదాన్ని చట్టప్రకారం పరిష్కరిస్తుందనుకున్న సర్వోన్నత న్యాయస్థానం చర్చలతో తేల్చుకోమని సలహా ఇవ్వడం అనేకులను ఆశ్చర్యపరచింది.
సున్నితమైన, మతపరమైన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఉత్తమమని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం. మతంతో, విశ్వాసాలతో ముడిపడిన అంశం కనుక, సుహృద్భావ వాతావరణంలో, సంబంధిత వర్గాలన్నీ చర్చకు కూర్చుని ఏకగ్రీవ పరిష్కారం సాధించి వివాదాన్ని ముగించాలన్నారు ఆయన.
ఇచ్చిపుచ్చుకొనే ధోరణి, చిత్తశుద్ధి ఇత్యాది పదాలు అనేకం ఆ సూచనలో ఉన్నాయి. సున్నితమైన, మతపరమైన అంశాలన్నింటికీ న్యాయస్థానం ఇదే మార్గం సూచించడం లేదు. ఇంతకంటే వివాదాస్పదమైన మతపరమైన అంశాల్లో కూడా న్యాయస్థానాలు తీర్పులు ఇస్తూనే ఉన్నాయి. ప్రజల విశ్వాసాలతో, మనోభావాలతో ముడిపడ్డాయన్న భయంతో తీర్పులు చెప్పడం మానివేసిందేమీ లేదు. ఈ తరహా తీర్పులనేకం ఆచరించలేక ప్రభుత్వాలు కప్పదాట్లు వేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. వివాద పరిష్కారానికి ముస్లిం సమాజ ప్రతినిధులు న్యాయవ్యవస్థ జోక్యాన్ని కోరుకుంటున్నారని సుబ్రహ్మణ్యస్వామి అనడమూ, అవసరమైతే తామే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ న్యాయమూర్తి స్వచ్ఛందంగా ప్రకటించడంతో అయోధ్య వివాదంపై తీర్పుచెప్పాల్సిన అవసరాన్ని సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా పక్కనబెట్టగలిగింది. దశాబ్దాలకాలం నాటి ఈ వివాదంలో పలుదశల్లో చర్చల ప్రయత్నాలు జరిగిన తరువాతే, న్యాయస్థానంలో తప్ప న్యాయం జరగదని భావించిన కారణంగానే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరినమాట వాస్తవం. వివాదం ఏదైనా, అది ఏ దశలోనైనా చర్చల ద్వారా పరిష్కారం కావడం మంచిదే. కానీ, తీర్పు ద్వారానే తమకు న్యాయం చేకూరుతుందని విశ్వసిస్తున్నవారికి మాత్రం ఈ చర్చల ప్రక్రియను తిరిగి ఆరంభించడమంటే కొత్త శక్తుల కొత్త ఒత్తిళ్ళకు తమను గురిచేయడమేనని అనుమానం కలుగుతున్నది.
పాతికేళ్ళ క్రితం నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో వరుస వాయిదాలతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నది. ఈ ఘటన అనంతరం, అయోధ్య విషయంలో సయోధ్య చేకూర్చేందుకు వివిధ రాజకీయపక్షాల ఏలుబడిలో పలుప్రయత్నాలు జరగకపోలేదు. చర్చలు, కోర్టు వెలుపల పరిష్కారాలు, మధ్యవర్తిత్వాల దశలు అనేకం దాటి, ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్న నినాదంతో ఎన్నికల్లో మతవిద్వేషాలు రగల్చడానికి పలుమార్లు ఉపకరించిన తరువాత, అంతిమ పరిష్కారం న్యాయస్థానంతోనే సాధ్యమన్న దశకు చేరింది. వివాదాస్పద స్థలాన్ని సమానంగా మూడు ముక్కలు చేసి సున్నీ వక్ఫ్‌బోర్డుకు, నిర్మోహీ అఖారాకు, రామ్‌లల్లాకు పంచాలంటూ ఆరేళ్ళక్రితం అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన సుప్రీంకోర్టు, దానిపై తన అభిప్రాయమేమిటో ప్రకటించవలసి ఉన్నది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయడమో, ఎత్తిపట్టడమో చేయవలసి ఉన్నది. ఈ దశలో, చట్టం, రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్పవలసిన న్యాయస్థానం, మతాన్నీ సెంటిమెంటునూ కారణాలుగా చూపిస్తూ తిరిగి చర్చలకు ఉపక్రమించమని సూచించడమంటే ఏవో కారణాల రీత్యా అది తన గురుతర బాధ్యతను తప్పించుకున్నదనే భావన కలిగిస్తుంది. చర్చలకు ఉపక్రమించే పక్షాలు సమానస్కంధులైనప్పుడే, ఆ చర్చలు సుహృద్భావంతో సవ్యంగా సాగాయనీ, ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఆ ఇచ్చిపుచ్చుకోవడాలేవో ఇష్టపూర్వకంగానే జరిగాయనీ నమ్మకం కలుగుతుంది. సాధించిన ఆ ఏకాభిప్రాయమేదో సర్వుల మనోభిప్రాయమన్న విశ్వాసమూ ఉంటుంది. అనంతరం ఆచరణ దశలోనూ అనుమానాలూ, ఆగ్రహాలకు తావుండదు. కానీ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అద్భుతమైన మెజారిటీ సాధించి భారతీయ జనతాపార్టీ అత్యంత బలంగా ఉన్నదశలో సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను సూచించింది.
రామమందిర నిర్మాణమే లక్ష్యంగా ప్రకటించిన ఒక పక్షం, ఎదుటిపక్షాన్ని లొంగదీయకుండా, ఒత్తిళ్ళకు పూనుకోకుండా వ్యవహరించిందనీ, ఈ ప్రక్రియ రాజకీయ దుర్వినియోగానికి గురికాలేదని అధికులు విశ్వసించగలిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. సుదీర్ఘకాలం నాటి ఈ వివాదానికి ఇప్పటికైనా స్వస్తిచెప్పాలన్న సదుద్దేశంతో ఒక పక్షం ఎంతోకొంత వదులుకోవడానికి సిద్ధపడినా, అది స్వచ్ఛందంగా జరిగిందన్న విశ్వాసం తమవారిలో కలిగించడం కష్టం. గతంలో కేంద్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు, పీఠాధిపతులు ప్రయత్నించి విఫలమైన ఈ తరహా మార్గాన్ని తిరిగి అనుసరించమంటూ సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే సూచించడం ఇదే ప్రథమం. ఆరేళ్ళ క్రితం అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చే రెండు నెలల ముందు, పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటారా? అని కక్షిదారులను ప్రశ్నించింది. వారు సమ్మతించలేదు. కానీ, ఈ తీర్పుకు కొద్దిరోజుల ముందు కోర్టు వెలుపలి పరిష్కారానికి సంబంధించిన అభ్యర్థన ఒకటి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు దానిని తిరస్కరించడంతో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువడింది. సుప్రీంకోర్టు ఇప్పుడు సూచించిన వివాద పరిష్కార విధానం ఏ రీతిన ఉండబోతున్నదో వచ్చేవారం తేలిపోతుంది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article