Breaking News

పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!

పెళ్ళి అనే బంధంతో ఒక్కటైన రెండు మనసులు.. తమ జీవితంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏడడుగులు నడిచి నాలుగు నెలలు గడవకముందే.. ఏమైనా విశేషమా…? అంటూ పెద్దలు ఆరా తీస్తుంటారు..? అయిదో నెల దాటిందంటే చాలు.. డాక్టర్లను ఓసారి కలవకపోయారా..? అని ఉచిత సలహాలిస్తుంటారు. భార్యాభర్తలే కాదు.. వారి కుటుంబాలు కూడా తమ ఇంట్లో బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాతముత్తాతల కాలం నాడయితే.. స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి శాతం 80 నుంచి 90 శాతంగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి శాతం 45 నుంచి 50 శాతానికి పడిపోయింది. నాటికీ నేటికీ మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఉద్యోగ జీవితం, టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు అన్నీ భార్యాభర్తల ఆశలను ఆవిరి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కారణం ఏదైతేనేమి పిల్లలు పుట్టని దంపతులు, నేడు సంతానోత్పత్తి కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. డాక్టర్లు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అప్పటికీ కుదరకపోతే సరోగసీని ఆశ్రయించడమో లేక దత్తత తీసుకోవడమో చేస్తున్నారు. భార్యాభర్తలకు అసలు సంతానం ఎందుకు కలగదు? శృంగార జీవితం బాగానే ఉన్నా, అనారోగ్య సమస్యలు అసలే లేకున్నా స్త్రీలు గర్భం ఎందుకు దాల్చరు? వంటి ప్రశ్నలు ఎన్నో ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతాయి. 

 
అయితే ఆరోగ్య సమస్యలు, శృంగార జీవితమే కాకుండా దైనందిన కార్యకలాపాలు కూడా పిల్లలు పుట్టకుండా అడ్డుపడతాయని మీకు తెలుసా? కాలక్షేపం కోసం టీవీ చూస్తాం.. ఇష్టమైనవన్నీ లాగించేస్తాం… ఆరోగ్యమే మహాభాగ్యం… అంటూ వ్యాయామం చేస్తాం.. ఇవన్నీ కూడా సంతానం కలగకుండా చేస్తాయంటే నమ్మగలరా? భార్యాభర్తల మధ్య జరిగే రతిక్రీడ కూడా గర్భం దాల్చకుండా చేస్తాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? ఒక కారణం స్త్రీలో పిల్లలు పుట్టకుండా లోపాన్ని కలిగిస్తే, అదే కారణం పురుషుల్లో సంతానోత్పత్తి స్థాయిని పెంచుతుందని తెలిస్తే.. ఏమిటీ విచిత్రం అని అనకుండా ఉండగలరా? స్త్రీ పురుషుల్లో ఏ కారణం వల్ల పిల్లలు పుట్టే యోగ్యం దెబ్బతింటుందో, ఎవరు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుంటే సంతానోత్పత్తి విషయంలో వచ్చే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. 
మహిళలూ.. వ్యాయామం  ఎక్కువ చేయొద్దు 
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందేనన్నది నేటి మాట. అందుకే పార్కులు, జిమ్‌ సెంటర్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తూ ఒళ్లు తగ్గించుకుంటూ, ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు పట్టణ ప్రజలు. ఎంత ఎక్కువసేపు వ్యాయామం చేస్తే అంత మంచిదని భావించేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఈ వ్యాయామం కూడా పిల్లలు పుట్టే విషయంలో కీలక పాత్ర వహిస్తుందని మీకు తెలుసా? స్త్రీ పురుషులు ఎంతసేపు వ్యాయామం చేస్తారన్న దాన్నిబట్టి పిల్లలు కలగడమా? కలగకపోవడమా?అన్నది ఉంటుందని ఎప్పుడైనా విన్నారా..? నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే.
సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ.. వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుందట. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉందట. అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిదట. వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుందట.
మగాళ్లూ.. టీవీలు చూస్తే మటాషే 
ఆఫీసులో ఫుల్లుగా కష్టపడిపోయామని ఇంటికి వచ్చాక తీరిగ్గా టీవీల ముందు కూర్చునే పురుషులు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. గంట, రెండు గంటలయితే సరేకానీ.. వచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కొందరు టీవీని అస్సలు వదలరు. అలాంటి వాళ్లు సంతానం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందట. ఏదో ఒక పని కల్పించుకుని ఇంట్లో భార్యకు సాయం చేయడమో, లేక సరదాగా బయటకు వెళ్లడమో చేస్తే టీవీ చూడాలన్న కోరికను కట్టిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మాంసానికి దూరంగా ఉంటే.. మనసంతా హాయి 
వీకెండ్‌ వచ్చిందంటే చాలు మాంసం దుకాణాల ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు ఓ వ్యక్తి సగటున అయిదు కిలోల మాంసం తింటున్నాడని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోనే అత్యంత ఎక్కువగా మాంసం వినియోగం ఇక్కడే ఉందట. అయితే మాంసాహార అలవాటు కూడా సంతాన లోపానికి ఓ కారణమట. ఎద్దు, గొర్రె, పంది, మేక, గుర్రం వంటి మాంసాలను ఎక్కువగా తినే పురుషుల్లో వీర్యకణాల వేగం మందగించడంతోపాటు, వాటి వృద్ధి కూడా తగ్గిపోతుందట. ఎపిడెమియోలజీ హెల్త్‌ జర్నల్‌ ప్రచురించిన ఈ సర్వేలో ఆసక్తికరమయిన విషయాలెన్నో వెల్లడయ్యాయి. ఈ మాంసాల కంటే.. గుడ్లు, రోస్ట్‌ చికెన్ తినే పురుషుల్లో వీర్యకణ వృద్ధి ఎక్కువగా ఉంటుందట. అయితే మాంసం తిన్నా.. వాటి వల్ల వచ్చే కొవ్వును కరిగించే స్థాయిలో పనిచేస్తే ఇటువంటి సమస్యలు ఉండబోవని మరో సర్వేలో వెల్లడయింది. సర్వేల మాట ఎలా ఉన్నా, మాంసాన్ని కాస్త తగ్గించుకుంటేనే బెటర్‌ అంటున్నారు డాక్టర్లు.
సెల్‌ఫోన్‌తో స్పెర్మ్‌కు  డేంజరే..! 
అదేంటి.. ఈ కాలంలో ఫోన్ లేకుండా ఎలా ఉండగలం. అయినా ఫోన్లో మాట్లాడితే సంతానలోపం రావడం ఏమిటనుకుంటున్నారా…? అసలు మతలబు అక్కడే ఉంది. సాధారణంగా పురుషులు ఫోన్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. మొబైల్స్‌ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నటిక్‌ సిగ్నల్స్‌.. వృషణాల్లో జరిగే వీర్యకణ ఉత్పత్తిని అడ్డుకుంటాయట. ఫోన్ల నుంచి విడుదలయ్యే ఉష్ణం వృషణాల్లో వేడిని పెంచి, వీర్యకణాలను శక్తిహీనం చేస్తాయట. తద్వారా పురుషుల్లో సంతానలోపం కలిగించడంలో సెల్‌ఫోన్లు ఇలా ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడయింది.
లావెక్కువైతే  కష్టమే 
పిల్లలు పుట్టడం, పుట్టకపోవడం అనేది భార్యాభర్తల లావు కూడా నిర్ణయిస్తుందట. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన ఓ పరిశోధనలో ఈ ఆసక్తికరమయిన విషయం వెల్లడయింది. లావుగా ఉన్న వారికి పిల్లలు పుట్టకుండా ఉన్నట్లయితే, అటువంటి వారు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే, ఆరు నెలల్లో సంతానం కలిగే అవకాశాలు మెండుగా పెరుగుతాయని పరిశోధనలో కీలక పాత్ర వహించిన డాక్టర్‌ బిట్నెర్‌ స్పష్టం చేశారు. లావుగా ఉండే భార్యాభర్తల మధ్య శృంగార జీవితం సంతృప్తికరమైన స్థాయిలో ఉండదనీ, బరువు తగ్గితే ఇది కొంత ఆశాజనకంగా ఉంటుందంటున్నారు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను సాధ్యమైనంత తగ్గిస్తే మేలంటున్నారు.
శృంగారం తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే
అమ్మనాన్న ఒకరినొకరు తాకనిచో.. నీవులేవు, నేను లేను.. ఈ జగమే లేదులే అన్నాడో కవి. స్త్రీ పురుషుల కలయిక జరగనిదే సృష్టి లేదని ఒక్క వాక్యంలో చక్కగా చెప్పారు. సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది. కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతానసాఫల్యానికి అంతగా ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు వృథా అవుతుంటాయని డాక్టర్‌ బిట్నెర్‌ వివరిస్తున్నారు. అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదలవకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారాయన.
పొగరాయుళ్లకు సెగ తప్పదుమరి..! 
సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అని దాని ముఖంపై రాసి ఉన్నా, సినిమా థియేటర్లలో మొత్తుకున్నా ఏ మాత్రం లాభం ఉండటం లేదు. కానీ పొగరాయుళ్లకు సంతానం కలగడం కష్టమేనని తెలియజేస్తే లాభం ఉంటుందేమో. సిగరెట్‌ను గుప్పుగుప్పుమని తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో తేలింది. మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుంది.
ఇలా చాలామందికి తెలియని, అస్సలు ఊహించలేని అలవాట్లు స్త్రీలకు అమ్మతనాన్ని, పురుషులకు నాన్న అనే పిలుపును దూరం చేస్తున్నాయి. కొత్తగా పెళ్ళయిన జంట, యువత.. ఈ అలవాట్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article