Breaking News

రూ. 200 నోటు వచ్చేసింది..

  • చవితి రోజే మార్కెట్లోకి..
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) దేశంలో 200 రూపాయల డినామినేషన్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతోంది. శుక్రవారం వినాయక చవితి రోజే ఈ సరికొత్త నోట్లను జారీ చేస్తున్నారు. మహాత్మా గాంధీ కొత్త సీరిస్‌లో ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో జారీ చేస్తున్న ఈ కొత్త నోట్లు పసుపు రంగులో ఉంటాయి. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక రంగంలో నగదు కొరత తీవ్రంగా ఉంది.
కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చినప్పటికీ తక్కువ డినామినేషన్‌ కరెన్సీ లభ్యత సమస్య తీవ్రంగా ఉంది. 100 రూపాయల నోట్లకు డిమాండ్‌ పెరగడంతోపాటు కొరత కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 200 రూపాయల నోట్ల వల్ల తక్కువ డినామినేషన్‌ కరెన్సీ కొరత తీరే అవకాశం ఉంది. 200 రూపాయల నోట్ల జారీకి అనుమతినిచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే ఆర్‌బిఐ కొత్త నోట్లను ప్రవేశ పెడుతుండటం విశేషం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన కొత్త కరెన్సీ నోట్లన్నీ రంగురంగుల్లో, ఆకర్షణీయమైన డిజైన్లలో ఉన్నాయి. మెజంటా బేస్‌ కలర్‌గా ఉన్న 2000 నోటు తర్వాత బూడిద వర్ణంలో 500 నోటు తాజాగా తేట పసుపు వర్ణంలో 200 నోటును జారీ చేస్తున్నారు. సెక్యూరిటీ ఫీచర్స్‌ అన్నీ పకడ్బందీగా ఉన్న 200 రూపాయల కొత్త నోటుపై ఉన్న ఇతర డిజైన్లు , జామెట్రిక్‌ పాటర్న్స్‌ కలర్‌ డిజైన్‌లో కలిసిపోయేట్టుగా ఉన్నాయి.
ఎక్కడ లభిస్తాయి?
రిజర్వ్‌ బ్యాంక్‌ శుక్రవారం నాడు ఎంపిక చేసిన కొన్ని ఆర్‌బిఐ శాఖలు, బ్యాంకుల ద్వారా 200 నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ నోట్లు ఇప్పుడిప్పుడే ఎటిఎంల ద్వారా చలామణిలోకి రాకపోవచ్చు. ఈ డినామినేషన్‌ పూర్తిగా కొత్త కావడం, ఈ నోటు సైజులోనే తేడా ఉండటం వల్ల ఎటిఎంల రికాలిబ్రేషన్‌ అవసరం ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది.
కొత్త నోట్ల జారీ ఎందుకు?
ద్రవ్యోల్బణం, ఆర్థికవృద్ధి, చలామణిలోని పాత బడిపోయిన నోట్ల స్థానే కొత్త నోట్లను ప్రవేశపెట్టాల్సి రావడం, రిజర్వ్‌ స్టాక్‌ అవసరాలు, నకిలీ నోట్ల బెడద నుంచి ద్రవ్యరంగాన్ని రక్షించడం, అన్నింటినీ మించి సగటు ప్రజలు దైనందిన ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించడం..వంటి అంశాలన్నింటినీ కొత్త నోట్ల జారీ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
రద్దు తర్వాత ఐదు కొత్త నోట్లు
మోదీ ప్రభుత్వం గత నవంబర్‌లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ రద్దు తర్వాత కొత్తగా 2000 రూపాయల నోట్లను, కొత్త 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తొలిసారిగా 200 రూపాయల నోట్లను, కొత్త డిజైన్‌తో 50 రూపాయలు, 1 రూపాయి నోట్లను కూడా ప్రవేశపెట్టనుంది. నిజానికి 1 రూపాయి నోట్లను 1994లోనే ముద్రించడం ఆపివేశారు. తాజాగా 2000 రూపాయల నోట్ల ముద్రణను కూడా గణనీయంగా తగ్గించినట్టు తెలిసింది.
మిస్సింగ్‌ మిడిల్‌..
ఏయే డినామినేషన్లలో కరెన్సీ నోట్లను ముద్రించాలనే విషయంలోనూ కొన్ని శాస్త్రీయమైన ప్రమాణాలున్నాయి. వీలున్నంత వరకు అతి తక్కువ డినామినేషన్లలో నోట్లను చలామణి చేయడం, చలామణి క్రమంలో చిల్లర మార్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడటం ఇందులో ముఖ్యమైనవి. సాధారణంగా తొలి డినామినేషన్‌ కరెన్సీకి ఆ తర్వాత డినామినేషన్‌ రెండు రెట్లు ఎక్కువగా లేదా రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండాలన్నది చాలా దేశాల్లో అనుసరించే ప్రమాణం.
200 నోటుతో భారత్‌లో చలామణిలో ఉండే కరెన్సీ నోట్లు 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 డినామినేషన్‌లో ఉంటాయి. ఇప్పటి వరకు 100 తర్వాత 500 నోట్లు మాత్రమే ఉన్నందువల్ల మధ్యలో ఒక డినామినేషన్‌ మిస్‌ అయిందన్న భావన ఉండేది. ఇప్పుడు 200 నోటును ‘మిస్సింగ్‌ మిడిల్‌’’ అనినిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 500 రూపాయలకు 2000కు మధ్య కూడా మరో డినామినేషన్‌ లేకపోవడం వల్ల సాధారణ పౌరులు దైనందిన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 నోటు వల్ల
ఈ ఇబ్బందులు తగ్గుతాయి.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *