Breaking News

ప్రవాసుల కోసం తక్షణం స్పందించే ‘మదద్’

MADAD will be helpful to NRIs

విదేశాల్లోని భారతీయులకు బాసట

గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం… సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ… సమస్య ఎక్కడో…  సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థిలేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ పోర్టల్ లో తమపేర్లను నమోదు చేసుకోవచ్చు.

విదేశాల్లో పనిచేస్తున్న మన కార్మికులు, ఉద్యోగులకు కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి ?
ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలు, ఇండియన్ కాన్సులేట్ లు, ఇండియన్ హైకమీషన్ లు అనగా భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలి.

విదేశాల్లోని మనవారు జైలుపాలయితే, దురదృష్టవశాత్తు మరణిస్తే సహాయంకోసం వారి బంధువులు భారత్ లో గాని, విదేశంలో గాని ఎవరిని ఎలా సంప్రదించాలి ?
సంబంధిత జిల్లా కలెక్టరు, రాష్ట్ర ఎన్నారై విభాగము, డిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశంలోని ఇండియన్ ఎంబసీ లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న సాంప్రదాయ పధ్ధతి ప్రకారం దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరడానికి, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఎంతో సమయం పడుతుంది. ఈ స్పీడ్ యుగంలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకవచ్చి, వేగంగా పరిష్కారం పొందడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించే ఆన్ లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

భారతీయులు ఎక్కువగా వాడే పదం ‘మదద్’…  అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అని అర్థము. ఇంచు మించు అన్ని భాషల సారాంశం కూడా అదే. ఈ విశిష్టమైన అర్థం కలిగిన ‘మదద్’ పేరుతో విదేశాల్లోని భారతీయులకు సహాయం అందించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ప్రవాసి భారతీయ వ్యవహారాల విభాగం) 21 ఫిబ్రవరి 2015 న ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు.  హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలలో వాడుకలో ఉన్న ‘మదద్’ అనే పదానికి తెలుగులో మద్దతు, అండ, బాసట, తోడ్పాటు, సహాయం, సాయం అనే సమానార్థాలు ఉన్నాయి. ఇంగ్లిష్ లో హెల్ప్, ఎయిడ్, అసిస్టెన్స్, సపోర్ట్ అనే అర్థాలున్నాయి.

గల్ఫ్ వలస జీవుల ఇక్కట్లకు ‘వెబ్’ పరిష్కారం
విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు లేదా వారి మిత్రులు ‘మదద్’ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ‘మదద్’ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం – భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల నిర్వహణ వ్యవస్థ) ను https://org2.passportindia.gov.in/AppConsularProject/welcomeLink లేదా https://portal2.madad.gov.in/AppConsular/welcomeLink లింక్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఒక ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఫిర్యాదుపై ఎంబసీలు తీసుకున్న చర్యల గురించి ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకోవచ్చు. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నసందర్భంలో వారికి ఉపయుక్తంగా పారదర్శక పద్ధతిలో సహకారమందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

21 రకాల సేవల గురించి విజ్ఞప్తులు చేసుకోవచ్చు
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలు పొందడానికి, ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేసుకోవడానికి ‘మదద్’ వెబ్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు.  శరణార్థులు (అసైలం), జన్మ ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెటు), పరిహారం (కాంపెన్సేషన్), ఉద్యోగ ఒప్పంద సమస్య ( కాంట్రాక్టు ప్రాబ్లం), ఇంటి పనివారలు (డొమెస్టిక్ హెల్ప్), సందేహాస్పద ఉద్యోగ పత్రాలు / యజమాని / కంపెనీ (డుబియస్ జాబ్ లెటర్ / ఎంప్లాయర్ / కంపెనీ), మోసపూరిత కాల్స్ / ఇ-మెయిల్స్ (ఫ్రాడులెంట్ కాల్స్ / ఇ-మెయిల్స్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), నోరి (నో ఆబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా), ఓసిఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుల సంబంధమైన సమస్యలు, విదేశాల్లో పాస్ పోర్ట్ సమస్యలు (పాస్ పోర్ట్ ఇష్యూస్ అబ్రాడ్), శారీరక వేధింపులు (ఫిజికల్ అబ్యూస్), రిక్రూటింగ్ ఏజెంట్లు, స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), లైంగిక వేధింపులు (సెక్సువల్ అబ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్) మరియు కోర్టుకేసుల లాంటి ఇంకా ఏమైనా ఇతర సమస్యలుంటే ‘అదర్స్’ కేటగిరీ ని సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో కేవలం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సేవల గురించి మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు.

వీసా, డాక్యుమెంట్స్ అటెస్టేషన్ లాంటి సేవలకు ‘మదద్’ ద్వారా కాకుండా ఇండియన్ ఎంబసీలను నేరుగా సంప్రదించాలి. రిక్ర్రూటింగ్ సమస్యల గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు http://www.mea.gov.in/  లేదా ఇ-మైగ్రేట్ వెబ్ సైటు  https://emigrate.gov.in/ext/ ను సంప్రదించాలి.

‘మదద్’ లో ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేయడం ఎలా ?
https://org2.passportindia.gov.in/AppConsularProject/welcomeLink లేదా https://portal2.madad.gov.in/AppConsular/welcomeLink  లింక్ ను క్లిక్ చేస్తే ‘మదద్’ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా లాగిన్ ఐడి, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ‘అప్లికంట్ లాగిన్’ బాక్స్ లో లాగిన్ ఐడి టైపు చేసి  ‘కంటిన్యూ’ బటన్ పై నొక్కాలి. తదుపరి వచ్చిన బాక్స్ మెదటి లైనులో పాస్ వర్డ్, రెండో లైనులో డిస్ ప్లే అయిన క్యారెక్టర్లను టైపు చేసి ‘లాగిన్’ బటన్ పై నొక్కాలి.

‘రిజిస్టర్ గ్రీవెన్స్’ పేజీలో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. పేరు, లింగము (జెండర్), పుట్టిన తేదీ, పాస్ పోర్ట్ నెంబరు, ప్రస్తుత అడ్రస్, మిషన్ / పోస్ట్ (భారత రాయబార కార్యాలయం), ఇ-మెయిల్ ఐడి, క్యాటగిరి (ఫిర్యాదు వర్గీకరణ), డిస్క్రి ప్షన్ (3 వేల పదాలకు మించకుండా సమస్య వివరాలు) తప్పకుండా నమోదు చేయాలి. ఆధార్ కార్డు, రిక్రూటింగ్ ఏజెంట్ వివరాలు, ఫోన్, మొబైల్ నెంబర్ల వివరాలు కూడా నమోదు చేయవచ్చు, కాని తప్పనిసరి కాదు. బాధితుల తరఫున వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఫిర్యాదు నమోదు చేసిన సందర్భంలో వారి వివరాలు కూడా నమోదు చేయడం తప్పనిసరి. పాస్ పోర్ట్, డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఒక ఎంబి సైజుకు మించకుండా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయవచ్చు.

‘మదద్’ వ్యవస్థ పని చేసే విధానం
ఫిర్యాదు నమోదు అయిన వెంటనే మన మొబైల్ నెంబర్ కు, ఇ-మెయిల్ ఐడి కి ఫిర్యాదు సంఖ్యను తెలుపుతూ సమాచారం వస్తుంది. ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యల గురించి, స్టేటస్ (స్థితి) గురించి ఆన్ లైన్ లో ట్రాక్ చేసుకోవచ్చు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసి భారతీయ వ్యవహారాల విభాగం, సంబందిత భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొలకత లకు ఏకకాలంలో ఆన్ లైన్ లో సమాచారం వెళుతుంది. అన్ని శాఖలు సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాయి.

‘మదద్’ ను ఉన్నత ప్రమాణాలతో, జవాబుదారీతనంతో, తక్షణం స్పందించే విధంగా రూపొందించారు. నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించడానికి ఫిర్యాదును ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులుగా వర్గీకరించారు. దీనితో అధికారుల జవాబుదారీతనం మరియు బాద్యత పెరిగింది. ఫిర్యాదుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు.

కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు ‘మదద్’ ను ఎలా ఉపయోగించుకోవచ్చు ?
స్వంత కంప్యూటర్, లాప్ టాప్ లేనివారు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు ‘మదద్’ ను ఎలా ఉపయోగించుకోవచ్చు ? విదేశాల్లో ఉన్న వలసకార్మికులు గాని, భారతదేశంలోఉన్న వారి కుటుంబ సభ్యులు చాలా మందికి వెబ్ సైట్ ఉపయోగించడం తెలియదు. వీరిలో కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారే అధికం. గ్రామాలు, పట్టణాలలోని ‘మీ సేవ’ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ‘మదద్’ సేవలు పొందడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలి. నిర్వాహకులకు, ఆపరేటర్లకు తగిన శిక్షణ ఇవ్వాలి. సామర్థ్య పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్, ఎంపీడివో కార్యాలయాల్లో కూడా తగు ఏర్పాట్లు చేయాలి. ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించి, ప్రజల్లోకి తీసికెల్లాలి.

మొబైల్ అప్లికేషన్
ఫిర్యాదుల నమోదు, పరిష్కార వ్యవస్థను అందరికి అందుబాటులోకి తేవడానికి మరింత సులభతరం, వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.

అన్ని భారతీయ భాషల్లో
ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం, సమాచారం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ) నెంబర్ 1800 11 3090 లేదా చార్జీలు వర్తించే నెంబర్లు +91 124 234 1002 మరియు +91 11 4050 3090 మరియు  +91 11 2307 2536 కు కాల్ చేస్తే తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లో జవాబు దొరుకుతుంది. ఓవర్సీస్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ వెబ్ సైటు http://www.owrc.in ను కూడా సందర్శించవచ్చు.

తెలుగువారు హైదరాబాద్ నాంపల్లి గృహకల్ప లోని మైగ్రంట్ రిసోర్స్ సెంటర్ (వలసదారుల వనరుల కేంద్రం) హెల్ప్ లైన్ నెంబర్  +91 73067 63482 ఇ-మెయిల్: helpline@owrc.in కు సంప్రదించవచ్చు. ఉ. 10 గం.ల నుండి సా.5 గం.ల వరకు స్వయంగా కూడా సంప్రదించవచ్చు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article