Breaking News

కనుమరుగవుతున్న పండుగలు

16.01.1

 

నిజామాబాద్‌, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే తుమ్మెద…. నా చిన్నప్పటి నుంచి వింటున్న సినిమా పాట ఇది. పండగకంటే వారం రోజుల ముందునుంచే టివిలో సందడి చేస్తుంది. బసవన్నల గజ్జల చప్పుడుతో, సన్నాయి మేళాలతో ఉదయం ప్రారంభమయ్యేది. నా చిన్నతనంలో మా వాడలో ప్రతీ ఇంటిముందు కల్లాపి చల్లి ఎంతో పెద్దగా రంగు రంగుల ముగ్గులు దర్శనమిచ్చేవి. పిల్లలమంతా ఒక దగ్గరచేరి భోగిమంటలు వేసేవాళ్లం. స్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని ఉదయం నుంచి పతంగులు ఎగురవేసేవాళ్ళం. రంగురంగుల పతంగులు వందల సంఖ్యల్లో ఆకాశంలో విహరిస్తు కనువిందుచేసేవి.

పండుగ మూడురోజుల పాటు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ముగ్గులు కనిపించేవి. కానీ ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి. మా వాడలో జనాభా మూడింతలు పెరిగింది. అన్నీ పెద్ద పెద్ద భవంతులు అయిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్ళు ఉన్నా కూడా పదుల సంఖ్యలో కూడా ముగ్గులు కనిపించడం లేదు. ఆకాశంలో పతంగుల సంఖ్య కూడా తగ్గిపోయింది. హరిదాసులు కనిపించడం లేదు. బసవన్నల గజ్జల చప్పుడు వినిపించడం లేదు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే తుమ్మెద… టివికే పరిమితమైంది, తప్ప ఎక్కువగా ఏ ఇంట్లో పండుగ వాతావరణం కనిపించడం లేదు. టి.వి.లో ప్రోగ్రామ్స్‌ పుణ్యమా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు చేసే వేడుకలు చూడడం తప్ప ఇంట్లో వేడుకలు చేసుకోవడం మానేశారు మన ఆడవారు. ఆడవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే పిల్లలు సెల్‌ఫోన్‌ గేమ్స్‌ అని ఆటలాడుతూ గడిపేస్తున్నారు.

టెక్నాలజి మనుషులను ఓవర్‌టేక్‌ చేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రంలో ఒక సన్నివేశంలో ఇలాంటి పరిస్థితులు చూపించారు. పండుగ రోజులు టి.వి., సెల్‌ఫోన్స్‌ సిగ్నల్స్‌ కట్‌ చేసేస్తే జనాలు అంతా ఒకచోట చేరి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పండగ జరుపుకుంటారు. ఇది సినిమాలో జరిగిన సంఘటన. నిజ జీవితంలో ఇలా జరిగితే గానీ మార్పు రాదేమో. మళ్లీ పండుగను పండుగలా జరుపుకునే రోజులు ఎప్పుడు వస్తాయో?
Shrikanth Alwala

Check Also

వైభవంగా లలిత పరమేశ్వర కళ్యాణోత్సవం

  కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీలలితా మహాత్రిపుర సుందరి క్షేత్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *