Breaking News

కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యూహం ఖరారు చేయాలి

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటి పారుదల రంగాన్ని అభివద్ధి పరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, దానికి తగినట్లు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి? ఏది ఎంత తింటున్నారు? ఎంత పండిస్తున్నారు? ఎంత దిగుబడి చేసుకుంటున్నారు? ఎంత ఎగుమతి చేస్తున్నారు? తదితర అంశాల్లో ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని ఆదేశించారు.

దీనికి అనుగుణంగా ఏమి పండించాలి? ఏమి పండించవద్దు? ఏ పంటల సాగును ప్రోత్సహించాలి? మొత్తంగా ఏది లాభదాయకం? ఏది ఉపయుక్తం? అనే విషయంలో నిర్ధిష్టమైన అభిప్రాయానికి రావాలని చెప్పారు. ఈ అంశాల్లో ఖచ్చితమైన వివరాలు రాబట్టేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పదిరోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ ఖచ్చితమైన అంచనాలతోనే రాష్ట్రంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని సిఎం నిర్దేశించారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం మార్కెటింగ్‌ శాఖ డైరెక్టరేట్‌ కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట మార్కెట్‌ వచ్చి, కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు.

మార్కెటింగ్‌ శాఖే కొనుగోళ్లు చేయడం వల్ల పోటీ తత్వం పెరుగుతంది. మంచిధర వస్తుంది. మార్కెటింగ్‌ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని సిఎం ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్‌ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం రూపొందించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అవలంభించాల్సిన వ్యూహం రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

”తెలంగాణ రాష్ట్రం చేసిన ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర లభించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”తెలంగాణ రాష్ట్రంలో వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటలున్నాయి. ఇతర పంటలను కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. కానీ ఈ పంటల సాగు శాస్త్రీయంగా లేదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి పండించడం లేదు. ఉత్పాదకత పెరగాలి. నాణ్యత పెరగాలి. అప్పుడే రైతులకు మంచి ధర వస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. ఇంకా కఠినంగా ఉంటుంది. పత్తి దిగుబడి ఎక్కువ రావడం కోసం అనువైన భూముల్లోనే పత్తిసాగు చేయించాలి. మేలురకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని అధ్యయనం చేసి అనుసరించాలి. పంజాబ్‌ సహా వరిసాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి.

మెలుకువలు నేర్చుకుని, రైతులకు నేర్పించాలి. తక్కువ కాలరీలు, తక్కువ షుగర్‌ ఉన్న వరి వంగడాలు సాగుచేయాలి. వరిలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను తీర్చిదిద్దాలి. మక్కజొన్నకు మంచి డిమాండ్‌ ఉంది. మంచి విత్తనాలు తయారు చేయాలి. ప్రతీ రోజు వంటలో వాడే చింతపండుకు కొరత ఉంది. తెలంగాణలో విరివిగా చింతచెట్లు పెంచాలి. హరితహారం కింద కనీసం 5 కోట్ల మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. పసుపు కొమ్ములను పసుపు పొడిగా, మిరపకాయలను కారం పొడిగా, కందులను పప్పుగా మార్చి అమ్మే పనిని మహిళా సంఘాల ద్వారా చేయించాలి. స్వచ్చమైన పల్లినూనె, నువ్వుల నూనెలను తయారు చేయాలి. దీనివల్ల రైతులకు మంచిధర వస్తుంది. మహిళలకు ఉపాధి దొరకుతుంది. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుంది. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పడానికి వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్‌ సెంటర్లను పెట్టాలి. యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలి.

తెలంగాణలోని ప్రజలు ఏ ఆహార పదార్ధాన్ని ఎంత తింటారో ఖచ్చితమైన అంచనా ఉంటే, ఏది పండించాలో నిర్ణయించవచ్చు. ఏ పంటకు మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకుని పంటల సాగు చేస్తే, మంచి ధర వస్తుంది. అందుకే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, ఒక్కో రైతు నుంచి వివరాలు తీసుకుని, ఏ గుంట భూమిలో ఏది సాగు చేస్తున్నారో వివరాలు సేకరించాలి? బియ్యం ఎంత తింటున్నారు? కూరగాయలు ఎన్ని తింటున్నారు? పప్పుదినుసులు ఎంత తింటున్నారు? మసాలా దినుసులు ఎంత తింటున్నారు? నూనె గింజల వాడకం ఎంత? తదితర విషయాలు సేకరించాలి. అన్ని ఖచ్చితమైన వివరాలు ఉంటే దానికి అనుగుణంగా పంటల సాగు చేయడానికి క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది.

పండించిన పంటకు మంచి మార్కెట్‌ రావడానికి ప్రభుత్వమే పూనుకుని చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్‌ కు తీసుకురాకుండా, గ్రామాల వారీగా మార్కెట్‌ కు తీసుకువచ్చే పద్ధతిని అలవాటు చేయాలి. రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి” అని ముఖ్యమంత్రి వివరించారు.

”మనం ప్రతీ రోజు కూరల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీన, జిలకర వేసుకుంటాం. కానీ అవి మనం పండించము. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటాం. మామిడిపండ్లు, బత్తాయిలు, ఇతర పండ్లు తింటాం. వాటిని కూడా దిగుమతి చేసుకుంటాం. చివరికి కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలున్నాయి. నగర జనాభా 50 శాతానికి చేరుకుంటుంది. అక్కడ నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలను ఆ పట్టణాల చుట్టుపక్కలున్న గ్రామాల్లో పండిచవచ్చు. కానీ పండించడం లేదు.

గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మేవారు. కానీ నేడు వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని, పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. ఒక్క బస్తా బియ్యం బస్తా కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్‌ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.

”మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యకరం? ఏది కాదు? అనే విషయంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచాలి. మంచి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి. ఆకుకూరలు, పండ్ల వాడకాన్ని పెంచాలి. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్ధాలను ప్రోత్సహించాలి. కొన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఆయా పండ్ల సాగుకు ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలి” అని సిఎం చెప్పారు. వ్యవసాయ శాఖకు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, దీనికోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సిఎం సూచించారు.

మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎంపి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సీనియర్‌ అధికారులు పార్థసారథి, రాహుల్‌ బొజ్జా, స్మితా సభర్వాల్‌, పౌసమి బసు, హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మిభాయి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *