Breaking News

వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర

నేటి నుంచి గురుపూజ మహోత్సవాలు

హైదరాబాద్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో కాలజ్ఞానం, కాలజ్ఞాన తత్వాల గురించి తొలిసారిగా చెప్పిన యోగి. సంఘసంస్కర్త. ఎవరూ చెప్పడానికీ, పేర్కొనటానికి సాహసించని మరో పర్యాయపదం ఆయన హేతువాది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’ అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. నిజమవుతున్నాయి. మరి బ్రహ్మంగారి మఠంలో ఏం జరుగుతోంది..? తాళపత్ర గ్రంథాలు నిజమైనవేనా..? కాలజ్ఞానం నిజంగా ఆయనే రాశారా..? ఆయన వారసులు ఎక్కడ..? బ్రహ్మంగారి మఠంలో ఉన్న పాదముద్రికలు నిజంగా ఆయనవేనా…? ‘నోస్టర్‌ డామస్‌’ కాపీ కొట్టింది ఈ కాలజ్ఞానమేనా..?.

నేటి నుంచి మహోత్సవాలు

కాలజ్ఞాన ప్రభోద కర్త ఆరాధన, గురుపూజ మహోత్సవాలు వైఎస్‌ఆర్‌ కడపజిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. కడప నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మంగారి మఠం. ప్రతియేటా మహాశివరాత్రినాడు బ్రహ్మంగారి కళ్యాణం, వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి, బ్రహ్మంగారు పుట్టిన రోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 14న స్వామి సజీవ సమాధి నిష్ట వహించిన రోజుగా, 15న బ్రహ్మరథోత్సవంగా అత్యంత ఘనంగా జరుపుతారు. కార్యక్రమాలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం తరలిరానున్నారు.

ఇదీ జన్మ చరిత్ర

శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రకతాంబ, పరిపూర్ణాచార్యులు అనే విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నది తీరంలో కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి (క్రీస్తుశకం 1608) నాడు జన్మించారు. అత్రి మున్యాశ్రమంలో శిష్యులుగా పెరిగారు. కర్ణాటక పాపాఘ్ని మఠాధిపతులు యనమందల వీరభోజయ్య, వీరపాపమాంబ దంపతులకు దత్త పుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగానపల్లెలో గరివిరెడ్డి అచ్చమాంబ, వెంకటరెడ్డి దంపతుల ఇంట పశువులు కాశారు. రవ్వల కొండలో సాంద్రసింధువేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మూెపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నేలమఠంలో ‘అన్నాజయ్య’కు కాలజ్ఞానం బోధించారు.

తాను శిల్పీకరించిన వీరభద్ర స్వామి శిలా విగ్రహాన్ని ‘అల్లాడుపల్లె’లో ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని పెద్దకొమెర్ల శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులను, ఒక పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు. మహ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబుల మన్ననలు పొంది, హిందూ-మహ్మదీయ సఖ్యతను చేకూర్చారు.

పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం స్వీకరించారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన దళితుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి, అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారు. సిద్దవటం నవాబుచే ఏడెకరాల స్థలాన్ని పొంది, ప్రస్తుత మఠం నిర్మాణం చేసుకున్నారు. తన పుత్రిక వీర నారాయణమ్మను ఆమె ‘పౌత్ర పరంపరయే అనువంశీకర’గా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. మహిళా సాధికారత గురించి ఆయన ఆనాడే ఆచరించి చూపారు. నేటికీ అదే సంప్రదాయం అక్కడ కొనసాగడం విశేషం. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు ప్రస్తుతం మఠంలో సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్‌ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు.

మఠంలో దర్శనీయ స్థలాలు

వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గహం, స్వామి తవ్వుకున్న బావి, కాలజ్ఞాన ప్రతులు, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, స్వామి మనవరాలు ఈశ్వరీదేవి మఠం, ఇక్కడకు 9 కిలోమీటర్ల దూరంలో సిద్దయ్య మఠం, కక్కయ్య గుడి, పోలేరమ్మ గుడి, వంటివి దర్శించుకోవచ్చు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *