Breaking News

ఋతుపవనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుతుపవనాలు ప్రారంభం కానున్నందున అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రాబోయే రుతుపవనాలను దష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలకై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ వారి వంతుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా మున్సిపల్‌ ప్రాంతాలలో, గ్రామాలలో, ఆరోగ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, రెండవ వారం చివరలో వర్షాలు కురిసే అవకాశమున్నందున దానికి ముందే చెత్త తొలగింపు, మోరీలు శుభ్రం చేయడం పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం అవసరమైన చర్యలు తీసుకోవడం చేయాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రులలో, పీహెచ్‌సిలలో మందులను అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవసరమైన వైద్య సహాయం అందించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, యాంటీ లార్వా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మున్సిపల్‌ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఒకరికి సంబంధించిన సమాచారాన్ని ఇంకొక శాఖ పంపించు కోవాలని తెలిపారు.

కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసుకొని రౌండ్‌ ది క్లాక్‌ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులు తమ పరిధిలో గల చెరువులను, గుంటలను, ట్యాంక్‌బండ్‌లను పరిశీలించాలని ఎక్కడైనా బలహీనంగా ఉన్నట్లు తెలిస్తే వాటిని రిపేర్‌ చేయించాలని తెలిపారు. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు ఉన్నచోట వాటి పనితీరును పరిశీలించాలని ఎక్కడ కూడా రోడ్లు తెగిపోకుండా చూడాలని వెంట వెంటనే మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.

పెద్ద వర్షం కురిసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతాలను గుర్తించి మోటార్లు ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అన్ని కార్యక్రమాలకు సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఇంచార్జి ఎస్‌ ఈ మురళీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు రాములు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *