Breaking News
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

వర్షాలు కురుస్తున్నాయి… అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వర్షాలు పడుతున్నందున రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను కోరారు. సోమవారం ప్రగతిభవన్‌లో గ్రీవెన్స్‌డే సందర్భంగా సమావేశమైన అధికారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో క్షేత్రస్థాయి అధికారులతో రోజు వారిగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

అదేవిధంగా మునిసిపాలిటీ, గ్రామపంచాయతీ, నగరపాలక సంస్థల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వరదల వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కురిసిన వర్షపు నీరు నిలువకుండా డ్రైనేజీలను క్లీన్‌ చేయాలని, వర్షపునీటిని గుంతల్లో నిలువ ఉండకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. చెరువులు, కుంటలు, కాలువలు బలహీనంగా ఉన్నచోట వర్షాలు పడినప్పుడు తెగిపోకుండా ముందస్తుగా పరిశీలన చేసి వరదలు వచ్చే సందర్భంలో ఏలాంటి సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు తమ విన్నపాలను పరిశీలించి తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు.

గ్రామ, మండల, డివిజన్‌ ఆయా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంబంధించిన ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విద్యాసంస్థ భవనాల ఆవరణలో నీటి నిల్వ లేకుండా బలహీనమైన భవనాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వము లాంచన ప్రారంభోత్సవం తేదీ గుర్తించే ముందే జిల్లాలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

పదవి విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్‌ వెంటనే మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పెండింగ్‌ కేసులను పరిష్కారానికి ఈనెల 26వ తేదీన ప్రగతిభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ ఫారెస్ట్‌, వైద్య ఆరోగ్య శాఖ విద్య శాఖలలో పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉన్నందున ఈనెల 26 తేదీల్లో జరుగు సమావేశంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పదవి విరమణ పొందే ఉద్యోగి ఆరు నెలల ముందు నుండే ప్రాసెస్‌ చేయించిన పక్షంలో జాప్యం జరగకుండా పెన్షన్‌ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, డిఆర్‌డిఏ రమేష్‌ రాథోడ్‌, జడ్పీ సీఈవో వేణు, ఆయా శాఖల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *