Breaking News
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

హరితహారానికి సిద్దమవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు ప్రారంభమైనందున హరిత హారంలో మొక్కలు నాటడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నందున లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలలో, మున్సిపాలిటీలలో రహదారుల ప్రక్కన, ఇతర ప్రాంతాలలో మొక్కలను పెద్ద సంఖ్యలో నాటడానికి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

మున్సిపాలిటీలలో స్వచ్ఛంద సంస్థలు లేదా బ్యాంకుల నిర్వహణలో మొక్కలను నాటి పరిరక్షించడానికి స్పాన్సర్లను గుర్తించాలని తెలిపారు. ఇందుకు పరిశ్రమలు, స్మార్ట్‌ ఆగ్రో, రోటరీ, లయన్స్‌ క్లబ్‌, బ్యాంక్స్‌ ఇతర సంస్థలను సామాజిక బాధ్యతగా ఉపయోగించుకోవాలని తెలిపారు. నగరపాలక సంస్థకు, ఇతర మున్సిపాలిటీలకు అప్రోచ్‌ రోడ్లకు ఇరుపక్కల పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం ప్రతి శాఖకు కూడా ప్రభుత్వం లక్ష్యాలు ఎక్కువగా నిర్దేశించిన ఆ దిశగా లక్ష్యాలను పూర్తి చేయడానికి, ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల ప్రారంభంతో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఎక్కడ కూడా ప్రజల ఆవాసాల వద్ద నీరు నిలువకుండా చూడాలని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించాలని ఆదేశించారు.

వర్షాల వల్ల నీరు నిలిచి ప్రజలకు, రవాణాకు ఇబ్బందులు కలిగే చోట మోటార్లు ఏర్పాటు చేసి వెంటనే నీటిని తొలగించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు కలిగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్‌, డిఆర్‌డిఓ రమేశ్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, ఇతర మునిసిపాలిటీల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *