Breaking News

నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

నిజామాబాద్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యలను దష్టిలో పెట్టుకొని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని జల శక్తి యోజన జాతీయ నోడల్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి, సీఈఓ నికుంజ కిషోర్‌ సుందరాయ్‌ తెలిపారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడు రోజుల పర్యటనకు ఆయన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో జలశక్తి యోజన కార్యక్రమానికి సంబంధించి సంబంధిత లైన్‌డిపార్ట్‌మెంట్‌ల అధికారుల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి సంరక్షణకు ఉద్దేశించిన జలశక్తి యోజన కార్యక్రమంలో దేశంలోని 256 జిల్లాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లా కూడా ఒకటని తెలిపారు. అన్ని జిల్లాల కంటే ముందుగా నిజామాబాద్‌ జిల్లాలో ఈ కార్యక్రమంపై వేగంగా స్పందించి కార్యక్రమాన్ని రూపొందించినందున తమ పర్యటనలో మొట్టమొదటిగా ఈ జిల్లాను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో నీటి సంరక్షణకు ఇప్పటి వరకే తీసుకున్న చర్యలతోపాటు ముందు ముందు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిందని, నిబంధనలు జారీ చేసిన అతి తక్కువ సమయంలో జిల్లా యంత్రాంగం స్పందించినందున తమ కార్యక్రమాన్ని మొదటగా నిజామాబాద్‌ జిల్లా నుండి ప్రారంభించడం జరిగిందన్నారు.

ఇందుకు జిల్లా కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను, యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. అత్యంత వేగంగా కేవలం వారం రోజుల్లోనే స్పందించి తమ పర్యటనకు సంబంధించి అవసరమైన ప్రణాళికను వేగంగా రూపొందించిందని తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దష్టిలో పెట్టుకొని ఇప్పటినుండి దానిని అదిగమించడానికి తీసుకోవలసిన ప్రత్యామ్నాయ చర్యలపై కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపునీటిని ఒడిసి పట్టుకోవడం, భూగర్భ జలాలు పైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలు వధా నీటిని తిరిగి ఉపయోగించడంలాంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి జిల్లాలో నీటి సమస్య అధికంగా ఉన్న బ్లాకులను గుర్తించడం అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల బందం ప్రణాళికలు చేసి అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలని ఆయన తెలిపారు.

ఈ విషయంలో జిల్లా యంత్రాంగం అందజేసిన ప్రణాళిక బాగుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పనులు నిర్వహించడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ, పబ్లిక్‌ భవనాలలో వర్షపునీటిని వధా పోకుండా పొదుపు చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, ఈ విషయాలను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకు అందరు ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి సంరక్షణకు మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తుందని, అదేవిధంగా మాస్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమం తెలంగాణకు హరితహారం ద్వారా వాతావరణ సమతుల్యానికి వర్షాలు కురవడానికి, గ్రీనరీకి తోడ్పడుతుందని ఆయన ప్రశంసించారు.

అనంతరం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు నోడల్‌ అధికారికి పుష్ప గుచ్చం అందించి ఆహ్వానించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జలశక్తి యోజనకు జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలతోపాటు జిల్లాలో ఇకముందు చేపట్టే కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాగునీటికి, తాగునీటికి ముందు ముందు వచ్చే సమస్యలను దష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నీటి వనరులు పరిగణలోకి తీసుకొని కార్యాచరణ ప్రణాళికను సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమన్వయంతో సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులలో పూడికతీత పనులను చేపట్టి గ్రౌండ్‌ వాటర్‌ వద్ధి చెందేలా ప్రత్యక్ష కార్యాచరణతో పాటు పూడికతీత మట్టిని పొలాలకు మళ్లించడం ద్వారా ఆ భూములకు మరింత సారవంతం లభిస్తుందన్నారు.

తెలంగాణకు హరితహారం ద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని గత సంవత్సరం లక్ష్యానికి అనుగుణంగా 1.8 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఫాం పాండ్స్‌, సోక్‌ పిట్స్‌, చెక్‌డ్యాంలను మంజూరు చేసి వాటిలో కొన్ని పూర్తి చేయడం జరిగిందని, మరికొన్ని నిర్మాణం జరుగుతున్నాయన్నారు. జిల్లాలో వేల్పూర్‌, ఆర్మూర్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌, నిజామాబాద్‌ మండలాలను నీటి సమస్య ఉన్న బ్లాకులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ మండలాలలో భూగర్భ జలాలు అభివద్ధి చెందటానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు తయారు చేస్తుందన్నారు. జలశక్తి యోజనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో వర్షం నీటిని సంరక్షించుటకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు.

అదేవిధంగా వాటర్‌ బాడీస్‌ను ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలిపామన్నారు. బోరుబావులు రీఛార్జ్‌ అగుటకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఇప్పటికే 5 వాటర్‌షెడ్‌ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ట్యాంకుల, చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులకు తెలపడం జరిగిందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఇంట్రా విలేజ్‌ పైప్‌లైన్‌ కార్యక్రమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. ఉద్యానవన పంటల ద్వారా నీటి పొదుపును ప్రోత్సహించడానికి రైతులకు 90 శాతం సబ్సిడీపై సామాగ్రి అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జలశక్తి యోజన సాంకేతిక అధికారి రవి మాజేటి, జిల్లా అటవీ అధికారి సునీల్‌, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిడి ప్రసాద్‌, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article