Breaking News

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కలెక్టర్లను ఆదేశించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఈ చట్టంలోని అదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల వ్యర్ధాలు, మురుగు చెత్త, భవన నిర్మాణాల వ్యర్థాలను ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

పర్యావరణ పరిరక్షణకు, వాయు కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రజల నుండి సేకరించిన చెత్తను తరలించడానికి స్వచ్ఛ ఆటోలను సరిపోవు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా ప్రజలు ఇళ్ల వద్దకు వచ్చే ఆటోలలో వేయడానికి సిబ్బందికి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పర్యావరణానికి భంగం ఏర్పడకుండా చట్టంలో పొందుపరచిన నిబంధనలను అమలు పరిచే విధంగా చూడాలన్నారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు సంబంధించి ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికలు పంపించాలని తీసుకున్న చర్యల వివరాలు కూడా తమకు అందచేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించిన ప్రకారం వారం రోజుల్లోగా ప్రణాళికలు సిద్ధం చేసి అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించిన స్థలాలలో డంపింగ్‌ యార్డ్‌లకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి ఆసుపత్రి నుండి వ్యర్ధాలను తొలగించుటకు ఆసుపత్రి యాజమాన్యాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, డిఎంహెచ్‌ఓ సుదర్శనం, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవిందు, ఇంచార్జ్‌ జిల్లా పంచాయతీ అధికారి కష్ణమూర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ బిక్షపతి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

18న ఒక బార్‌కు మాత్రమే డ్రా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ ...

Comment on the article