Breaking News

జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు

బీసీ కమిషన్‌ చైర్మన్‌

నిజామాబాద్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమను బీసీ కులంలోకి మార్చవలసిందిగా కోరిన ప్రజల జీవన స్థితిగతుల కనుగుణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బిఎస్‌ రాములు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పర్యటన కోసం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన విషయాలపై వారిద్దరూ కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జరిగిన పలు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన కలెక్టర్‌ను, యంత్రాంగాన్ని అభినందించారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ చేసినందున ఎంతో కష్టమైన పని ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు.

గెస్ట్‌హౌస్‌లో పలు కులాలకు చెందిన ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. అనంతరం ఆయన బోధన్‌ మండలం తగ్గెల్లి, పెంటా ఖుర్దు గ్రామాలలో పర్యటించి కుళ్ళెకడిగి కులస్తుల స్థితిగతులపై వివరాలు సేకరించడానికి వారి నుండి దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వారి ఇండ్లలో పర్యటించి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. వారు నిర్వహిస్తున్న వత్తుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. బోధన్‌ మండల కేంద్రంలో రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ఈ కులం ప్రజల నుండి కూడా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2009 నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ప్రక్రియ ఆగిపోయిందని తిరిగి ఈ కమీషన్లను పునరుద్ధరించినందున అమ్మ కులాన్ని మార్చ వలసినదిగా కోరే ప్రజల విజ్ఞప్తులను పరిశీలన చేసి వారికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో 70 కులాలకు చెందిన ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా సుమారు 20 కులాల నుండి విజ్ఞప్తులు అందాయన్నారు. మొదటి విడతగా ఆయా కులాల వారిని తమ కార్యాలయానికి పిలిచి వివరాలు సేకరించామని, రెండవ దశలో వారికి సంబంధించిన సమాచారం సేకరించామని, మూడవ దశలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా పరిశీలన చేస్తున్నామని వారి జీవన ప్రమాణాలు, ఇప్పటివరకు నిర్వహిస్తున్న వత్తులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి అందుకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం పరిశీలించి వారిని ఏ కులంలో చేర్చాలో నిర్ణయం తీసుకుంటుందని బహుశా ఆగస్టు చివరి కల్లా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు.

ఇప్పటికీ పలు జిల్లాలలో పర్యటించి ఇందుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించామని ఇతర జిల్లాల్లో కూడా ఆయా కులాలకు సంబంధించి విచారణ నిర్వహించామని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి, బోధన్‌ మండలం తగ్గెల్లి, పెంటాఖుర్దు గ్రామాలు, వర్ని మండలం జాకోరా గ్రామాల్లో రెండవ శతాబ్దంలో కర్ణాటక నుండి వచ్చి ఇక్కడ జీవిస్తున్న కుల్ల కడిగి కులస్తుల స్థితిగతులపై పరిశీలనకు రావడం జరిగిందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 15 గ్రామాలలో ఈ కులస్తులు జీవిస్తున్నట్లు తెలుస్తుందని సుమారు 400 పైగా ఈ కులస్తులు జీవిస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. వీరు చాలామంది కూలి పనులు చేసుకుంటూ ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉన్నట్లు తెలుస్తుంది అన్నారు.

పూర్తి పరిశీలన అనంతరం ఏ కులం ప్రజలను ఏ కేటగిరిలో చేర్చాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. తద్వారా వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేకూర్చే ప్రయోజనాలు పొందడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతో ఇంగ్లీష్‌ మీడియం విద్య ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు మంచి విద్య లభించే అవకాశం ఏర్పడిందని పది సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలల్లో చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలని ఎంతో మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. చైర్మన్‌తో బోధన్‌ ఆర్‌డివో గోపి రామ్‌, ఇంచార్జ్‌ జిల్లా బిసి అభివద్ధి అధికారి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సెలవుల్లో కూడా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హౌస్‌ హోల్డ్‌ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు ...

Comment on the article