ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలి

నిజామాబాద్‌, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం కార్పొరేషన్‌ మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నియమింపబడ్డ ఆర్‌ఓ ఏఆర్‌ఓ అధికారులతో ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎంతో క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా పనిచేసి సజావుగా జరిగేందుకు దోహదపడాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమాల్ని స్వయంగా పాటించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు కషి చేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌లో నిర్దేశించిన ప్రకారంగా నామినేషన్‌ స్వీకరణ, పరిశీలన, సింబల్‌ అలాట్మెంట్‌, పోలింగ్‌, ఫలితాలు జారీ చేసే వరకు పూర్తి బాధ్యత రిటర్నింగ్‌ అధికారిదేనని చెప్పారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను పాటించి అనుసరించి ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికలలో ఎలాంటి షార్ట్‌కట్స్‌ ఉండవని ప్రొసీజర్‌ ప్రకారంగా బాధ్యతలను చేపట్టాలన్నారు. ఈ ఎన్నికలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారంగా నగర పాలక సంస్థ ఎన్నికలు మున్సిపాలిటీలలో తెలంగాణ మునిసిపాలిటీలు చట్టం ప్రకారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు.

రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం సమయానుకూలంగా జారీ చేసే ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని, కార్పొరేషన్‌ మున్సిపాలిటీల చట్టం ప్రకారం కొన్ని నిర్దేశించిన అంశాలు కొంచెం తేడా ఉండవచ్చునని అన్నారు. నామినేషన్ల స్వీకరణ నిర్దేశించిన ప్రదేశాలలో సమయానుకూలంగా రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరించాలన్నారు. నగరపాలక సంస్థలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మున్సిపాలిటీలలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలన్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసే ఇతర అభ్యర్థులు 5 వేల రూపాయలు డిపాజిట్‌ చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2500 రూపాయలు చెల్లించాలని, మున్సిపాలిటీలలో వార్డ్‌ మెంబర్‌గా పోటీ చేసేవారు ఇతర అభ్యర్థులు 2500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1,250 రూపాయలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

నామినేషన్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి గదిలోకి నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికీ మాత్రమే అనుమతి ఉంటుందని అదేవిధంగా ఒకే వాహనం అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఎన్నికల కోసం నియమించబడ్డ పిఓ ఏపీవోలకు ఈనెల 17వ తేదీన శిక్షణ తరగతులు నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ నియమింపబడ్డ పీవో ఏపీవోలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో, బోధన్‌లో ఉర్దూ ఘర్‌, ఆర్మూర్‌ భీమ్‌గల్‌ మున్సిపాలిటీల నియమించిన వారికి ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. శిక్షణ తరగతులకు అందరు సకాలంలో హాజరుకావాలని చెప్పారు.

నగరపాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ శాంసన్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా కషి చేయాలని, జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను లోకల్‌ బాడీ ఎలక్షను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అందరి సహకారం అవసరమని చెప్పారు. సమావేశంలో ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్లు శైలజ, స్వామి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి ఎంపీడీవో నిజామాబాద్‌ సంజీవ్‌ ఎన్నికల నియమ నిబంధనలు ప్రవర్తన నియమాలు ఆర్‌ఓల బాధ్యతలు, విధులను వివరించారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *