Breaking News

ఎక్కడి చెత్త అక్కడే…

నందిపేట్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు కావస్తుండగా, గడిచిన 7 రోజులుగా భారీ నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రోడ్లపై, డ్రైనేజీల్లోని చెత్త చెదారం ఎక్కడి కక్కడ పేరుకు పోవడంతో దోమలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. నందిపేట్‌ మండల కేద్రంలో గత కొన్ని నెలలుగా మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల కాలనీల్లో ముఖ్య రహదారి వెంబడి చెత్త చెదారం ఎక్కడికక్కడే దర్శనమిస్తూ కుళ్లిన వ్యర్థాల నుండి దుర్గంధం వెదజల్లుతోందని, మండల కేంద్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తూ ఇళ్లల్లోకి వస్తున్నాయి. పందుల బారి నుండి కాపాడాలని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై గత పాలక వర్గంలోని గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి దష్టికి తీసుకు వెళ్లగా పందుల పెంపకం దారులకు నోటీసులు ఇచ్చి పందులను వాహనాలలో ఎక్కించి ఇతర ప్రాంతాలకు తరలించారు.

కానీ నూతన పాలక వర్గం ఎన్నికైనప్పటి నుండి పందుల పెంపకం దారులు మళ్ళీ పందులను తీసుకువచ్చి పెంచుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో సీజనల్‌ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లు సరిగా లేక చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.

వర్షపుజలాలు గుంతల్లో రోజుల తరబడి నిలువ ఉంటూ వ్యాధులు గొనేలా చేస్తున్నాయి. గతంలో పారిశుద్ద సమస్యతో పాటు తాగునీటి సమస్యపై గ్రామ సర్పంచ్‌తో పాటు కార్యదర్శి దష్టికి తీసుకెళ్తే తమకు ఇంకా చెక్‌ పవర్‌ రాలేదని అందువల్ల తాము ఏమి చేయలేకపోతున్నామంటూ దాటవేసే ధోరణి అవలంబించారు. ప్రస్తుత నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ వచ్చి రోజులు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గెలిచిన కొత్తలో తమ జేబు ఖర్చుతో సఫాయి పనులు చేయించి హంగామా చేసిన వార్డ్‌ మెంబర్‌లు సైతం కానరావడంలేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి, పారిశుద్యం, తాగునీటి సరఫరా తదితర సమస్యలపై నిర్ల్యక్షంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *