Breaking News

పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పట్టణాల్లో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా కనిపించేలా మిషన్‌ మోడ్‌లో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అటవీ అధికారి మున్సిపల్‌ అధికారులతో హరితహారం పారిశుద్ధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల కార్యక్రమంపై ఆదేశాలు జారీ చేశారని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా నిర్వహించాలని తద్వారా పరిశుభ్రతతో పాటు సీజనల్‌ వ్యాధులను నివారించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

మున్సిపాలిటీలకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను పూర్తిస్థాయిలో నటించాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి శుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను పెద్దఎత్తున అందరి భాగస్వామ్యంతో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. డెంగ్యూ, ఇతర సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాలు, వైరల్‌ జ్వరాలు వ్యాపిస్తున్నందున ప్రజలను వీటి నుండి రక్షించుటకు పారిశుద్ధ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు.

వీధులలో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చాలని, మోరీలు శుభ్రం చేయాలని చెత్తను తొలగించాలని ఆయన ఆదేశించారు. దోమల నివారణకు ఆంటీ లార్వా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలని, దోమలు పెరగకుండా నివారించే తులసి, కష్ణ తులసి ఇలాంటి మొక్కలను నాటించాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ నగరాలకు, పట్టణాలకు ముఖ్య దారులలో ఇరు వైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తిస్థాయిలో నాటించాలని, రహదారుల సెంట్రల్‌ మీడియంలో కూడా మొక్కలను నాటించాలని ఆయన అధికారులకు సూచించారు.

చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటించనున్నారు. ప్రతి మొక్కను రక్షించడానికి అవసరమైన చర్యలు కూడా గైకొనాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డిఎఫ్‌ఓ సునీల్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ ఇంజనీర్‌ ఆనంద్‌ సాగర్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపల్‌ కమిషనర్లు స్వామి నాయక్‌, శైలజ, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళ దుర్మరణం

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *