Breaking News

24, 25 తేదీలలో బ్యాంకులు కస్టమర్లకు చేరువయ్యే కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24, 25 తేదీలలో బ్యాంకుల సేవలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణ పాణిగ్రాహి తెలిపారు. సోమవారం వినాయక్‌ నగర్‌లోని ఎస్‌బిఐ పరిపాలన విభాగంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక బస్వా గార్డెన్‌ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 24వ తేదీన ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని మొదటి విడతలో 250 జిల్లాలలో నిర్వహించారని, రెండవ విడతలో 150 జిల్లాలలో నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమాల ద్వారా ప్రజల కోసం బ్యాంకులు అందిస్తున్న పలురకాల సేవలు, రుణాలు, పథకాలు, సేవింగ్స్‌, కరెంటు ఖాతాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు, ముద్ర రుణాలు, వ్యాపార, గహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ, ఇతర పనిముట్ల రుణాలు, బీమా పథకాలు, తదితర విషయాలపై 25 బ్యాంకుల ద్వారా 25 స్టాల్స్‌ ఏర్పాటుచేసి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం ద్వారా ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బ్యాంకుల ద్వారా అందించే సేవల గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

డిపాజిట్లు వాటికి లభించే ప్రయోజనాలు, ఆర్‌-సెటీ శిక్షణ, సోషల్‌ సెక్యూరిటీ పథకాలు, తదితర సేవలపై కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి అందించే సదుపాయాల గురించి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

మీడియా సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయ సంతోష్‌, జనరల్‌ మేనేజర్‌ ప్రతాప్‌ రెడ్డి, పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *