Breaking News

బ్యాంకు రుణాలతో ట్రాక్టర్ల కొనుగోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చుకోవడానికి బ్యాంకులు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో బ్యాంకు అధికారులు, పంచాయితీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా చెత్తను సేకరించడానికి, డంపింగ్‌ చేయడానికి, హరితహారం మొక్కలకు నీటిని అందించడానికి ఇతర కార్యక్రమాలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్‌ తెలిపారు. పంచాయతీలు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా నిర్వహించడానికి ట్రాక్టర్లు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ ట్రాలీ ట్యాంకర్‌తో కొనుగోలు చేసుకోవాలని ఇందుకు బ్యాంకులు వారి యాజమాన్యాలతో మాట్లాడి కమర్షియల్‌గా కాకుండా తక్కువ వడ్డీతో 36 నుండి 40 వాయిదాలలో తిరిగి రుణం చెల్లించే విధంగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోలుకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి వాటి మాడల్‌, ధరలు, ఇతర వివరాలను పరిశీలించుకుని కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వీటి వాయిదాల చెల్లింపులకు సంబంధిత గ్రామ పంచాయతీలు వారికి గల ఆదాయాల నుండి లేదా పద్నాలుగవ ఫైనాన్స్‌ కమిషన్‌ నుండి లేదా ఇతర నిధుల నుండి బ్యాంకులకు రుణ వాయిదాలు చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

వీటి కొనుగోలుకు సంబంధిత గ్రామ పంచాయతీలు గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాలని ఈనెల 25వ తేదీ కల్లా ట్రాక్టర్ల కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయ సంతోష్‌, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

స్థానికంగా సమస్యను పరిష్కరించుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని దండిగుట్ట గ్రామంలో నిర్మించతపెట్టిన వైకుంఠ ధామం పనుల‌ను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *