Breaking News

ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై నగర ప్రజలకు అవగాహన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం ఖిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఖిల్లా వీధులలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్‌ వాడవద్దనీ, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందచేయాలని కోరుతూ, వారికి జనపనార సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ చెత్తను ఏరివేసి మున్సిపల్‌ సంచుల్లో వేశారు. పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లలో పర్యటించి ప్లాస్టిక్‌ వాడుతున్నారా లేదా పరిశీలించారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్‌ సంచులు ఉపయోగించలేనందున సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నెల రోజుల క్రితం పల్లెల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, విద్యుత్తు స్తంభాలను సరి చేయడం చెత్తను తొలగించడం తదితర కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, అవి గ్రామాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి చెట్లను పెంచడంతో పచ్చదనం వెల్లివిరుస్తున్న దశ్యాలు మనకు కనిపిస్తాయన్నారు.

అదే స్ఫూర్తితో పట్టణాల్లో కూడా పారిశుద్ధ్య ఆరోగ్య కార్యక్రమాల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడానికి అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలతోపాటు పలు దుష్పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను తగ్గించడానికి 50 మైక్రాన్ల లోపు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడానికి, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను రీసైకిలింగ్‌తో తిరిగి ఉపయోగించడానికి, నిజామాబాద్‌ను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడానికి, ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్లాస్టిక్‌ను తగ్గించడానికి ఇప్పటికే వ్యాపారస్తులు, హోటల్స్‌ ప్రజలు సహకరిస్తున్నారని దీనిని పూర్తిగా సాధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

విద్యార్థులు మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా జీవితంలో మంచి అలవాట్లను నేర్చుకుంటానని వారిద్వారా కుటుంబ సభ్యులకు కూడా మంచి చెప్పగలుగుతారని ఆయన తెలిపారు. ప్రజలు వారి ఆవాసాలలోని, పరిసర ప్రాంతాలలోని చెత్తను వీధులలో పడేయకుండా తమ వద్దకు వచ్చే మున్సిపల్‌ సిబ్బందికి తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కోరారు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా మలేరియా దోమలు వ్యాప్తి కాకుండా ఉంటుందని తద్వారా ప్రజలు అనారోగ్యంపాలు కాకుండా సంతోషంగా జీవించగలుగుతారని తెలిపారు. అవగాహనకు వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించి పరిశుద్ధమైన, ఆరోగ్య జీవితాలకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అవగాహనకు సంబంధించిన తెలుగు, ఉర్దూ కరపత్రాలను ఆవిష్కరించారు.

కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ ఆనంద్‌ సాగర్‌, ఎంహెచ్‌ఓ సాజిద్‌, డిప్యూటీ ఈఈ రషీద్‌ డిఎంఅండ్‌ హెచ్‌వో సుదర్శనం, ఐఎంఏ డాక్టర్లు జే బాపురెడ్డి, రషీద్‌, ఎన్‌సిసి విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, నర్సింగ్‌ విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *