Breaking News

పచ్చని ఠాణ

నందిపేట్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఠాణను నందనవనంగా మార్చారు పోలీసులు. సాధారణంగా ఠాణాకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతారు, కానీ నందిపేట్‌ పోలిస్‌ ఠాణ అందుకు భిన్నంగా ఠాణకు వచ్చేవారికి ఆహ్లాదం పంచుతుంది. పోలీస్‌ ఠాణలో వివిధ రకాల మొక్కల పెంపకంతో పాటు నీడనిచ్చే చెట్లు, వివిధ రకాల పూల మొక్కలు దర్శనమిస్తాయి. చెట్లు ఏపుగా పెరగడంతో అన్ని కాలాల్లో పచ్చగా దర్శనమిస్తుంది.

దాంతోపాటు తీగ జాతి మొక్కలను నాటి వాటిని అందంగా తీర్చిదిద్దారు. స్టేషన్‌ లోపల జామ, మామిడి, నారింజ పండ్ల మొక్కలు నాటారు. వాటి ముందు పెద్ద చెట్లతో పాటు టేకు మొక్కలు ఏపుగా పెరిగాయి. పోలీస్‌ ఠాణ ఆవరణలో చెట్టు కింద గుడిసె వేసి గద్దె నిర్మించారు, కేసుల విషయం వచ్చే వారు అక్కడ కూర్చొని సేద తీర్చుకుంటారు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ పోలీస్‌ ఠాణ వెనుక భాగంతొ పాటు పక్కన నిర్మించిన క్వార్టర్‌ భవనం వద్ద సైతం మొక్కలు నాటారు.

రాత్రి వేళల్లో ఎక్కువగా గాలి వీచేందుకు వేప మొక్కలను నాటారు. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చదనం సంతరించుకుంది. ప్రధాన రహదారి నుంచి ఠాణా వరకు గల లింక్‌ రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు చూపరులకు స్వాగత తోరణాలుగా కనిపిస్తున్నాయి.

మొక్కలు నాటే కార్యక్రమం…

తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమానికి పూర్వమే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేది. 2012 సంవత్సరంలో ఇక్కట విధులు నిర్వహించిన ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని మొక్కలు నాటించారు. అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు మహా వక్షాలుగా మారి ప్రజలకు నీడ నిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.

దీనిలో మేము సైతం అంటూ ఎస్‌ఐ జాన్‌ రెడ్డి ఆ తర్వాత ఎస్సై సంతోష్‌లు హరితహారంలో భాగంగా స్టేషన్‌ ఆవరణలో టేకు, నిడనిచ్చే మొక్కలు నాటారు. ఇప్పుడు అవి చెట్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాఘవేందర్‌ కూడా పూర్వ ఎస్సైల పరంపరను కొనసాగిస్తూ ఏ ఒక్క చెట్టు ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ను హరిత స్టేషన్‌ గా మార్చారు. స్టేషన్‌ అందాన్ని చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హరిత హారం నిరంతరం కొనసాగిస్తాం…

ఎస్‌ఐ రాఘవేందర్‌

నందిపేట్‌ పోలీస్‌ ఠాణను మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఈజీఎస్‌ నర్సరీలోనే కాకుండ ప్రైవేట్‌ నర్సరీలలో కొత్తగా ఏ మొక్కలు వచ్చిన వాటిని తీసుకువచ్చి ఇక్కడ నాటుతున్నాం. హరితమయ ప్రదేశంలో పనిచేయడం వలన మానసిక శాంతి వుంటది.

కాబట్టి మా స్టాఫ్‌ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. పూర్వ ఎస్‌ఐల వలే హరితహారం సంప్రదాయాన్ని కొనసాగిస్తాం.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article