Breaking News

చెక్‌పోస్టుల వద్ద తహసిల్దార్‌ కార్యాలయాలలో బందోబస్తు

నిజామాబాద్‌, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద, తహశీల్‌ కార్యాలయాల్లో బందోబస్తుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పోలీస్‌ అధికారులకు తెలిపారు. గురువారం తన చాంబర్లో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున, మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే కనీస మద్దతు ధర అధికంగా చెల్లిస్తున్నందున పక్క రాష్ట్రాల నుండి ధాన్యాన్ని మన జిల్లాకు అక్రమంగా తీసుకువచ్చే అవకాశముందని తెలిపారు. తద్వారా పలు సమస్యలు ఏర్పడతాయని అందువల్ల జిల్లాకు ఆనుకొని ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు అయిన సాలూర, కందకుర్తి వద్ద రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఇందుకుగాను చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 24 గంటలు గట్టి నిఘా ఏర్పాటు చేసి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. దీనికి పోలీస్‌, రెవెన్యూ, సివిల్‌ సప్లైస్‌ సిబ్బందిని నియమించాలన్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు అక్కడ జరిగే కార్యక్రమాలపై నివేదికలు అందేలా చూడాలని ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలకు సమాచారం తెలిపేలా సిబ్బందికి ఆదేశాలు జారి చేయాలన్నారు.

అక్రమంగా వచ్చే ధాన్యాన్ని వెంటనే సీజ్‌ చేసి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలో అక్రమ ధాన్యం కానీ, ఇతర సామాగ్రి రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

తహసిల్దార్‌ కార్యాలయాలలో రక్షణ చర్యలు

ఈమధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో మరియు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని తహసిల్దార్‌ కార్యాలయాల్లో పోలీసు రక్షణతో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో భాగంగా అన్ని తహసిల్దార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బోర్డులు కూడా ప్రదర్శించాలని తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో టచ్‌లో ఉండాలని సిపి కార్తికేయ తెలిపారు.

ప్రజావాణి సందర్భంగా దరఖాస్తుదారులు ఎక్కువగా వచ్చే కార్యాలయాలలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజావాణికి డిప్యూటీ తహసిల్దారును ఇన్‌చార్జిగా నియమించాలని ప్రజావాణి ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కార్యాలయాల్లో పాయింట్‌ బుక్స్‌ను ఉంచాలని అధికారులు చర్చించారు. సమావేశంలో అదనపు సిపి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌ పాల్గొన్నారు.

Check Also

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *