Breaking News

పుస్తకాలతోనే యువత భవిష్యతు

నిజామాబాద్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి యువత భవిష్యత్తు పుస్తకాల పైన ఆధారపడి ఉందని, వాటి ద్వారా విజ్ఞాన సముపార్జన జరుగుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. ఈ నెల 14 నుండి 20 వరకు 52వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

చదువుతోపాటు సంస్కారం, పెద్దలపై గౌరవం పుస్తకాలతోనే లభిస్తుందని తెలిపారు. శరీరానికి వ్యాయామం ఏవిధంగా అవసరమో జ్ఞానానికి పుస్తక పఠనం కూడా అటువంటిదేనని పేర్కొన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సజనాత్మకత వెలికి తీయడానికి కూడా పుస్తక పఠనం, పోటీలు ఉపకరిస్తాయని తెలిపారు. ఒక్క పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో సమానమని ఆయన తెలిపారు.

కొంత సమయమైనా పుస్తక పఠనానికి కేటాయించాలి – కలెక్టర్‌

గ్రంథాలయాలు, పుస్తకాల ద్వారానే ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రస్తుత సాంకేతిక మార్పుల వల్ల పుస్తకాల ముద్రణ పుస్తకాలు పాటించడం తగ్గిపోయిందని, చాలా అవసరాలు సాంకేతికంగా పుస్తకాలు లేకుండా జరుగుతున్నాయని, సోషల్‌ మీడియా కూడా పుస్తకాల పఠనంపై మార్పు తెచ్చిందని తెలిపారు.

క్రమం తప్పకుండా కొంత సమయమైనా మంచి పుస్తకాలు చదవడానికి కేటాయించాలని, తద్వారా విజ్ఞానం లభిస్తుందని తెలిపారు గ్రంథాలయాల్లో తీసుకున్న పుస్తకాలను పాడు చేయకుండా తమ వంతుగా ఉపయోగించుకొని తిరిగి గ్రంథాలయాలకు అప్పగిస్తే వేరొకరికి ఉపయోగపడతాయని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కావలసిన అన్ని పుస్తకాలు అందరూ ఖరీదు చేసి చదువుకోలేరని గ్రంథాలయాల్లో ఎన్నో రకాల పుస్తకాలు లభిస్తాయని కావలసినంత విజ్ఞానం సంపాదించుకోవచ్చని తెలిపారు. తనను కలవడానికి వచ్చినప్పుడు పూల బొకేలకు బదులుగా పుస్తకాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

గ్రంథాలయం పర్సన్‌ ఇన్చార్జి సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్ధుల్లోని సజనాత్మకతను వెలికితీయడానికి వారోత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహించామని ఇందులో గెలుపొందిన 46 మందికి బహుమతులు అందిస్తున్నామన్నారు. గ్రంథాలయంలో మారుతున్న అవసరాలకనుగుణంగా పుస్తకాలను సమకూర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యం, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *