పొగాకు దుష్ప్రభావంపై అందరికీ తెలియాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొగాకు దుష్ప్రభావంతో జరిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పొగాకు కంట్రోల్‌పై జిల్లాస్థాయి సమన్వయ సమితి సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు ప్రభావం వల్ల ప్రతి సంవత్సరం దేశంలో 13.5 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు.

పొగాకు ప్రభావం పొగ తాగే వారికి కాకుండా ఇతరులకు కూడా నష్టం కలుగజేస్తుందని, తీవ్రమైన అనారోగ్యానికి తద్వారా మరణాలకు కారణమవుతుందని తెలిపారు. క్యాన్సర్‌తో పాటు ఇతర భయంకరమైన వ్యాధులకు దారితీస్తుందన్నారు. చట్టప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్‌ ప్రాంతాల్లో విద్యాసంస్థల చుట్టుప్రక్కల పొగ తాగడం నివేదించబడిందని దీనికి జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు.

18 సంవత్సరాల్లోపు మైనర్లు అమ్మడం కాని, కొనడం కాని నిషేధించబడిందని తెలిపారు. పొగాకు సంబంధించిన ప్రకటనలు కూడా చట్టం ప్రకారం నిషేధమని తెలిపారు. పొగాకు తాగడం వల్ల తీవ్ర అనారోగ్యాలు నష్టం కలగడమే కాకుండా తద్వారా ఆర్థిక నష్టంతో పాటు అనారోగ్యం బారిన పడ్డ వారికి ఆసుపత్రి ఖర్చులు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయని వివరించారు.

కమిటీ సభ్యులు అందరూ కూడా వారి పరిధిలో ప్రజలకు, విద్యార్థులకు, యువతకు పొగాకు దుష్ప్రభావంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి పొగాకును నిషేధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కషిచేయాలని ఆయన కోరారు. సమావేశంలో అదనపు ఎస్‌పి ఉషా విశ్వనాథ్‌, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డిసిఎల్‌ చతుర్వేది, డీఏఓ గోవిందు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *