Breaking News

పాఠశాల గుర్తింపు రద్దుచేయాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంజయ్‌ అనే విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపరచడమే గాకుండా, బాదిత కుటుంబానికి అండగా ఉన్న విద్యార్థి యువజన సంఘాల నేతలను బెదిరింపులకు పాల్పడుతున్నారని పివైఎల్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్మూర్‌ కుమార్‌ నారాయణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న సెయింట్‌ పాల్స్‌ హై స్కూల్‌ యజమాని బబ్లూను అరెస్టు చేసి రిమాండ్‌ చేయాలని పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, ఎన్‌ఎస్‌యుఐ డివిజన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌లు డిమాండ్‌ చేశారు. బాదిత విద్యార్థి తల్లి పట్ల దురుసుగా మాట్లాడాడని, వాళ్లకు అండగా ఉన్న విద్యార్థి యువజన సంఘాల నేతలను బెదిరింపులు చేస్తున్న కూడా, అట్రాసిటీ కేసు నమోదు చేసి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు.

మండల విద్యాధికారి శాఖాపరంగా తీసుకున్న చర్యలు ఏమిటని వారు ప్రశ్నించారు. విధ్యార్థినే కాక విద్యార్థి యువజన సంఘాల నేతలను కూడా బెదిరింపు చేస్తున్న బబ్లూ హింసా ప్రవత్తి అర్థం అవుతుందని, ఇలాంటి సైకో శాడిస్టిక్‌ మెంటల్లీ ఇంబాలెన్స్‌ వ్యక్తి నడుపుతున్న పాఠశాలలో తమ పిల్లలను చదివించి వారిని బలిపెట్టవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసులు వెంటనే బబ్లూను అరెస్టు చేసి రిమాండ్‌ చేయాలని, విద్యాశాఖ అధికారులు, చైల్డ్‌ వెల్పేర్‌ అదికారులు స్కూల్‌లో విచారణ జరిపి స్కూల్‌ గుర్తింపు రద్దు చేసి సీజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు నరేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు నాగరాజు, శ్రీకాంత్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు భగత్‌, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాకేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Check Also

కొత్త పుస్తకాలొచ్చాయ్‌….

నందిపేట్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం షాపూర్‌ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ...

Comment on the article