Breaking News

హరితహారండేలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 3న అన్ని మున్సిపాలిటీల‌లో నిర్వహించే హరితహారండే కార్యక్రమంలో మేయర్‌, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిల‌ర్లు, అధికారులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

ఫిబ్రవరి 24 నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించుకొని నగరంలో, మున్సిపాలిటీల‌లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను మీ అందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు అన్నారు. అదేవిధంగా రోడ్లు శుభ్రం చేయడం, చెత్తను, పిచ్చి మొక్కల‌ను తొల‌గించడం విద్యుత్‌ స్తంభాల‌ రిప్లేస్‌మెంట్‌, లూజ్‌ వైర్లు సరి చేయడం తదితర కార్యక్రమాలు జరుగుతున్న విషయాల‌న్ని మీరు కూడా పాల్గొని గమనిస్తున్నారన్నారు.

దీనికి ప్రజల‌ నుండి కూడా మంచి స్పందన వస్తుందని వివరించారు. ఈ నెల‌ 3న మంగళవారం నగరపాల‌క సంస్థతో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల‌లో కూడా హరితహారం రోజును నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతి డివిజన్‌ లేదా వార్డులో కనీసం 200 మొక్కలు నాటడానికి నిర్ణయించామని, కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారని తెలిపారు.

హరితహారండేను విజయవంతం చేయడానికి మీ డివిజన్‌ లేదా మీ వార్డు పరిధిలో నాలుగు కమిటీల‌కు సంబంధించిన సభ్యులు, ప్రత్యేక అధికారుల‌తో కలిసి కనీసం రెండు వందల‌ మొక్కల‌కు తక్కువ కాకుండా నాటించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల‌ని ఆయన కోరారు. మీరు మీతో పాటు మీ వార్డులోని ప్రజల‌ను భాగస్వాముల‌ను చేసుకొని ముందుకు వెళితేనే కార్యక్రమం విజయవంతమవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మీ అందరి సహాయ సహకారాల వ‌ల్ల‌నే నిజామాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల‌ను పరిశుభ్రమైన మున్సిపాలిటీలుగా, హరిత వనాలుగా తీర్చిదిద్దడానికి వీల‌వుతుందని కలెక్టర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article