Breaking News

పట్టణ ప్రగతిలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు

ఆర్మూర్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణాలు పరిశుభ్రంగా, ఆకుపచ్చగా, రూపొందడానికి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాల‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి సంబంధిత అధికారుల‌తో కలిసి భీమ్‌గల్‌ పట్టణంలో పలు వార్డుల‌లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.

అధికారుల‌కు ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన చర్యల‌పై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలు మంత్రివర్యులు కేటీఆర్‌ సూచన మేరకు పట్టణాల‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల‌ జీవన స్థితి గతుల‌లో మార్పు రావాల‌ని, ప్రజలు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండడానికి, పౌర సేలు బాగా అందేలా చూడడంతో పాటు రోడ్లు బాగా చేసుకోవడం, కరెంటు సమస్యలుంటే సరి చేసుకోవడం, డ్రైనేజీలు శుభ్రం చేసుకోవడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాల‌ను ఈ పథకం ద్వారా చేపడుతున్నామని తెలిపారు.

పట్టణంలో తిరగడం ద్వారా ఎక్కడ ఏఏ సమస్యులున్నాయో అవగాహన వచ్చిందని, అందుకు అనుగుణంగా అత్యవసరంగా నిర్వహించే పనులు, ఆ తర్వాత నిర్వహించే పనుల‌పై అధికారుల‌తో చర్చించి ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో నిర్వహించని ఇటువంటి ప్రజా కార్యక్రమం చూసి ఎన్నికల‌ తర్వాత కూడా ప్రజా ప్రతినిధులు తమ ఇళ్ల ముందుకు రావడం వీధుల‌లో పర్యటించడంపై ప్రజలు అభినందిస్తున్నారని ఆయన వివరించారు.

కార్యక్రమాల్లో వారి వంతుగా కూడా మహిళలు, పురుషులు ఎంతో ఆసక్తితో పాల్గొంటున్నారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలోచించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల‌కు తడి పొడి చెత్తకు సంబంధించి రెండేసి బుట్టల‌ను పంపిణీ చేశారు. మొక్కలు నాటి నీరు పోసి, ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ ఆకుల‌ ల‌లిత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాజశ్రీ, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సింహాచలం, కమిషనర్‌ గంగాధర్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *