Breaking News

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…



నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాను మినహాయిస్తే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాగా నిజామాబాద్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

కరోనా వ్యాధి బారిన పడిన వారి వివరాల‌ను తాజాగా ఏప్రిల్‌ 7వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల‌కు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల‌ రాజేందర్‌ వివరాలు విడుద చేశారు. ప్రకటన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 404 కాగా 45 మంది ఇదివరకే వ్యాధి నయమై డిశ్చార్జ్‌ అయినారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృత్యు వాత పడగా, ప్రస్తుతం వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారు 348 మంది ఉన్నారు.

అదేవిధంగా ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాల‌కులు 7వ తేదీ రాత్రి 9 గంటల‌కు విడుదల‌ చేసిన జిల్లా వారి వివరాల‌ ప్రకారం, హైదరాబాద్‌ జిల్లాలో 150 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతుండగా, నిజామాబాద్‌ జిల్లాలో 36 మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ను మినహాయిస్తే 36 కరోనా కేసుల‌తో నిజామాబాద్‌ అన్ని జిల్లాల‌ కంటే ఎక్కువ సంఖ్యతో రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా ముందువరసలో ఉన్నట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.

2011 సెన్సస్‌ జనాభా లెక్కల‌ ప్రకారం, సుమారు 40 ల‌క్షలు ఉన్న హైదరాబాద్‌లో 150 కేసులు నమోదుకాగా, కేవలం 16 ల‌క్షల‌ జనాభా గల‌ నిజామాబాద్‌ జిల్లాలో 36 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా ఇంతవరకు హైదరాబాద్‌లో 22 మంది వ్యాధి బారిన పడ్డవారు నయమై డిశ్చార్జి అయ్యారు, కానీ నిజామాబాద్‌ జిల్లాలో ఇంతవరకు ఒక్కరు కూడా డిశ్చార్జి కాకపోగా ఖచ్చితమైన సమాచారం మేరకు కనీసం ఒక బాధితుడి మరణం ధృవీకరంచారు. నిజామాబాద్‌కు చెందిన వారు మరొకరు హైదరాబాద్‌లో మరణించినట్టు తెలుస్తుంది.

గణాంకాల‌ను బట్టి వ్యాధి తీవ్రత కూడా నిజామాబాద్‌లో ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల సల‌హా ప్రకారం సామాజిక దూరం పాటించడం, ఇంట్లోంచి బయటకు పోకుండా ఉండటం వ‌ల్ల‌ కరోనాను అరికట్టగలం అనేది వాస్తవం. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప, బయటకు అసలు వెళ్లకపోవడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం.



Check Also

కోడ్ ఉల్లంఘించారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *