Breaking News

కుటుంబ పెద్దల‌కు నమస్కారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా కేసుల‌కు సంబంధించి వస్తున్న రిపోర్ట్స్‌ పరిశీలిస్తే మరిన్ని పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం ఉందని అందువ‌ల్ల‌ ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వాయిస్‌ మెసేజ్‌ ద్వారా ప్రజల‌ను, కుటుంబ యజమానుల‌ను, ముఖ్యంగా మహిళల‌ను కోరారు. వస్తున్న పాజిటివ్‌ కేసుల‌ను పరిశీలిస్తే ముఖ్యంగా ఢల్లీి వెళ్లి వచ్చిన వారు వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ సభ్యుల‌కు వైరస్‌ పాజిటివ్‌ వస్తున్నదని తెలిపారు.

అందువ‌ల్ల‌ ప్రజలు ఢల్లీి వెళ్లి వచ్చిన వారు వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారితో చుట్టుపక్కల‌ వారు సన్నిహితంగా ఉన్నట్లయితే వారి వివరాల‌ను మీ పరిధిలోని ఆశా వర్కర్లకు కానీ మెడికల్‌ ఆఫీసర్‌కు గాని సమాచారం అందించాల‌ని కోరారు. విదేశాల‌ నుండి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్నందున వారు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా, వారెవరు బయట తిరగకుండా ప్రతి ఒక్కరు పరిశీల‌న చేయాల‌ని, ఒకవేళ బయట తిరిగితే సంబంధిత అధికారుల‌కు వైద్య సిబ్బందికి సమాచారం అందించాల‌ని కోరారు.

మీ కుటుంబంలో కానీ చుట్టుపక్కల‌ వారు కానీ దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం, గొంతు నొప్పి లాంటి అనారోగ్య పరిస్థితులు ఉంటే ఆశా వర్కర్‌కు లేదా వైద్య అధికారుల‌ దృష్టికి తీసుకురావాల‌ని, వారు మిమ్మల్ని క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన వైద్య సదుపాయం అందిస్తారని తెలిపారు. వైద్యులు అందించే సూచనల‌ను తప్పక పాటించాల‌ని ఆయన కోరారు. పరిస్థితులు పరిశీలిస్తే మనమంతా మరో 15 రోజుల‌ లాక్‌ డౌన్‌ పాటిస్తూ ఇంటిని వదల‌కుండా ఉండవల‌సిన పరిస్థితులు కొనసాగనున్నాయని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లవసి వస్తే మాస్కు ధరించడం, కళ్ళద్దాలు పెట్టుకోవడం, బయటకు వెళ్ళిన తర్వాత ఏ వస్తువును కూడా తాకకుండా ఉండడం, ఎవరితోనూ కూడా ఎదురుగా మాట్లాడకుండా ఉండటం, కనీసం మూడు అడుగుల‌ దూరం పాటించడం తప్పనిసరిగా క్రమశిక్షణతో మసలుకోవాల‌ని లేదంటే వస్తువుల‌తోపాటు వైరస్‌ని కూడా ఇంటికి తీసుకువెళ్లే అవకాశం ఉండవచ్చని, ఈ విషయాన్ని సీరియస్‌గానే ఆలోచించాల‌ని ఆయన సూచించారు.

ఆయా కుటుంబాల‌లోని పెద్ద మనుషులు లేదా మహిళలు వారి కుటుంబ సభ్యుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత వీరిదేనని బయటకు తప్పనిసరి అయితేనే వెళ్లాల‌ని లేదంటే కట్టడి చేయాల‌ని ఆయన వీరిని కోరారు. ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన వారికి యంత్రాంగం మంచి వైద్య సదుపాయం అందిస్తుందని అనుమానితుల‌ను కూడా క్లోజ్‌ అబ్జర్వేషన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా కంటేయిన్మెంటు ఏరియాలో ఉన్న వారిని కూడా బయటకు రాకుండా రిస్కు అయినప్పటికీ అధికారులు సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారని మెసేజ్‌లో కలెక్టర్‌ వివరించారు. అందువ‌ల్ల‌ అనుమానితుల‌ వివరాలు అందించడంతోపాటు ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉంటూ లాక్‌ డౌన్‌ నిబంధనలు పూర్తిగా పాటించాల‌ని అధికారుల‌కు సహకరించాల‌ని ఆయన కోరారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article