Breaking News

కంటేయిన్మెంట్‌ క్లస్టర్‌ ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటేయిన్మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నందున ఇది చాలా క్లిష్టమైన సమస్యని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లాలో హైదరాబాద్‌ తర్వాత అధికంగా కేసులు నమోదు అయినందున జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని కలెక్టర్‌కు ప్రత్యేకంగా సూచించారు.

ఇంతవరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల‌పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌ నుండి సంబంధిత శాఖ సీనియర్‌ అధికారుల‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్‌ తదనంతర తీసుకునే చర్యలు, ధాన్యం కొనుగోలు, వల‌స కూలీల‌కు బియ్యం పంపిణీ తదితర విషయాల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటేయిన్మెంటు ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని, సదుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని, ప్రజలు ఎవరూ కూడా బయట తిరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల‌న్నారు.

వల‌స కూలీలు మరింత మందిని గుర్తిస్తున్నందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ఏర్పాటుతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో గుంపులుగా లేకుండా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈనెల‌ 21న, 28న హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని విడుదల‌ చేసే ముందు తదుపరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తీసుకున్న చర్యల‌పై వివరిస్తూ జిల్లాలో ఇప్పటివరకు 47 మందికి వైరస్‌ పాజిటివ్‌గా వచ్చిందని వారి నివాస ప్రాంతాల‌లో 20 లొకేషన్‌లో కంటేయిన్మెంట్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయటానికి పణాళిక చేసుకొని అందుకు అవసరమైన చర్యల‌తో పాటు సివిల్‌ అధికారుల‌ను నియమించామని, క్లస్టర్‌ కార్యాల‌యాలు కంట్రోల్‌ రూమ్‌లు ప్రారంభిస్తున్నామని, ఆ ప్రాంతాల‌ ప్రజల‌కు నిత్యవసర వస్తువులు తదితర సదుపాయాలు ఏర్పాటు చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని సరుకులు అందించడానికి నియమించామని తెలిపారు.

ఈ ప్రాంతాల్లో 28 వేల‌ ఎనిమిది వందల‌ కుటుంబాలు ఉన్నాయని, ప్రతి కుటుంబానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక ఆశా వర్కర్‌ను నియమించి ప్రతిరోజు వారి ఆరోగ్య విషయాల‌ను పరిశీలించటానికి ఆదేశించామన్నారు. ఇప్పటివరకు 28వేల‌ కుటుంబాల‌కు సర్వే పూర్తయిందన్నారు. ఈ ప్రాంతాల్లో బ్యారికేడ్‌ చేయించి రోడ్లు మూసి వేశామన్నారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన 63 మందిలో 32 పాజిటివ్‌ వచ్చాయని రెండు రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని, మిగతా వారివి నెగిటివ్‌ వచ్చాయన్నారు.

పాజిటివ్‌ వచ్చిన 47 మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ 285 మందికి గాను 218 మందివి శాంపుల్స్‌ తీసుకున్నామని, మిగతా వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచామని, ఒక్కొక్కరికీ వేరు వేరుగా ఒక గది కేటాయించామని అధికారులు అనుమతి ఇవ్వగానే వారి సాంపుల్స్‌ కూడా హైదరాబాద్‌కు పంపిస్తామని తెలిపారు.

జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల‌పై సంతృప్తి చెందిన సి ఎస్‌ – చాలా చొరవతో, క్రియాశీల‌కంగా విధులు నిర్వహించాని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆయన కలెక్టర్‌కు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లు ల‌త, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో ప్రతి మరాజ్‌, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article