Breaking News

రాష్ట్రంలో సన్నబియ్యం ఎక్కువ తింటున్నారు

బాన్సువాడ, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం 2020 పంట సాగుపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్‌, పాతవర్ని, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాల‌లో గురువారం జరిగిన ‘‘అవగాహన సదస్సులో’’ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల‌ను ఉద్దేశించి స్పీకర్‌ మాట్లాడుతూ నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల‌ పంటల‌ను సాగు చేయడం ద్వారా రైతులు తమ దిగుబడు నుండి అధిక లాభాల‌ను ఆర్జిస్తారని తెలిపారు.

మూస పద్ధతిలో ఒకే రకమైన పంటను ఎక్కువ మంది రైతు సాగు చేయడంతో మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల‌సిన పరిస్థితులు ఉన్నాయని, మరోవైపు తక్కువ సాగుచేసిన పంటతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉండి ఇతర రాష్ట్రాల‌ నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత పంట సాగును తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రజల‌ ఆహారపు అల‌వాట్లు, వినియోగానికి అనుగుణంగా పంటను సాగు చేయడం ద్వారా రైతుకు మంచి లాభాలు పొందడంతో పాటు ప్రజల‌కు తక్కువ ధరలో స్థానికంగానే ఆహార ఉత్పత్తులు అందుతాయని పోచారం పేర్కొన్నారు.

రైతులు వ్యవసాయ శాఖ సూచించిన పంటల‌ను సాగు చేయాల‌ని, ఇది రైతు మేలు కోసమే తప్ప మరొకటి కాదని స్పీకర్‌ అన్నారు. రాష్ట్రంలో సన్న రకాల‌ బియ్యంను ప్రజలు ఎక్కువగా తింటున్నారని, ఇతర రాష్ట్రాల‌లో కూడా సన్న రకాల‌కే అధిక డిమాండ్‌ ఉన్నదన్నారు. రైతు సన్న రకాల‌ను సాగు చేయడం ద్వారా మద్దతు ధరతో అధిక లాభాల‌ను పొందుతారని, మార్కెట్లో డిమాండ్‌ ఉండడంతో కొనుగోలు ఇబ్బందులు ఉండవని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతు అభివృద్ధి కోసం కృషి చేయలేదని పేర్కొన్నారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల‌తో ఇతర రాష్ట్రాల‌కు ఆదర్శం అయిందని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల‌ను కష్టాల‌ నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, ఉచితంగా 24 గంటల‌ కరెంటు, రుణమాఫీ, అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, ప్రతి అయిదు వేల‌ ఎకరాల‌కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, రైతు వేధిక నిర్మాణం, నూతన గౌడాన్ల నిర్మాణం మన రాష్ట్రంలోనే చేపట్టారని స్పీకర్‌ వివరించారు.

కోటి ఎకరాల‌కు సాగునీరు అందించడానికి ల‌క్షా యాభై వేల‌ కోట్ల రూపాయల‌తో కృష్ణా, గోదావరి నదుల‌పై ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాల‌ను మన రైతులు అనుభవిస్తున్నారని, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రిజర్వాయర్‌ నుండి ప్రత్యేక కాలువ ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు వస్తాయని, అదేవిధంగా పండిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా రైతుల‌ నుండి కొనుగోలు చేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించిన పంటనే సాగు చేస్తామని వర్ని మండలం శ్రీనగర్‌, పాతవర్ని, వకీల్‌ ఫారం, నెహ్రూ నగర్‌ గ్రామాల‌ రైతులు, చందూర్‌ మండల‌ కేంద్ర రైతులు తమ తీర్మాన పత్రాల‌ను స్పీకర్‌కు అందజేశారు. అవగాహన సదస్సులో రైతు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article