Breaking News

30 లోపు వాటిని పూర్తిచేయకుంటే సస్పెన్షన్‌

నిజామాబాద్‌, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల‌లో స్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్లు జూన్‌ 30 లోపు పూర్తి చేసి ప్రారంభించాల‌ని, పూర్తి చేయని గ్రామాల‌ సర్పంచులు, అధికారుల‌ను సస్పెండ్‌ చేస్తానని, ఎట్టి పరిస్థితుల‌లో ఉపేక్షించేది లేదని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆర్డీవోలు, ఎంపిడివోలు, మండల‌ స్పెషల్‌ ఆఫీసర్లతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల‌ అభివృద్ధి, పరిశుభ్రతకై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో జూన్‌ 30 లోపు స్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్లు పూర్తి చేసి ప్రారంభించాల‌ని, ల్యాండ్‌, సాండ్‌ (ఇసుక) కు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సంబంధిత ఆర్డీవోలు రెండు రోజుల్లో పరిష్కరిస్తారని, డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అవసరమైతే పంచాయతీ నిధుల‌ను ప్రొసీజర్‌ ప్రకారం వాడుకోవచ్చని, గ్రీన్‌ ఫెన్సింగ్‌ కూడా పూర్తిచేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు.

అలాగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల‌పై మంగళవారం జిల్లా అధికారుల‌తో సమావేశం ఏర్పాటు చేశామని, మండలాల‌ వారీగా జరిగిన పనుల‌ను సమీక్షించి తనిఖీ చేసేందుకు శుక్రవారం అధికారుల‌ను పంపిస్తున్నానని, వీరు గ్రామాలో ముఖ్యంగా రోడ్లు, ఇన్స్టిట్యూషన్లు, ఖాళీ స్థలాల‌లో పిచ్చి మొక్కలు పూర్తిగా తొల‌గించడం, నీరు నిలువకుండా గుంతలు పూడ్చడం లేదా కాలువ‌లు తీయడం, వాటర్‌ ట్యాంక్‌ నుండి నల్లా వరకు లీకేజీల‌ను అరికట్టడం, ట్యాంకుల‌ను శుభ్రపరచడం వంటి అంశాల‌పై తనిఖీ చేసి నివేదిక సమర్పించగానే పూర్తిచేయని మండల‌ అధికారుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.

హరితహారం కొరకు గ్రామ పంచాయితీ, మండల‌ స్థాయిలో మొక్క రకం, ఎత్తు వారీగా (మీటరు లోపు, మీటరు పైన, రెండు మీటర్ల పైన) ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కు తయారు చేయాల‌ని, మొక్కలు నాటడానికి పక్కా ప్రణాళికను తయారు చేసి సిద్ధంగా ఉంచాల‌ని, ప్రభుత్వ మార్గదర్శకాల‌కు అనుగుణంగా గుంతలు తీయడం పూర్తిచేయాల‌ని, ఒక్క రోడ్‌ కానీ, ఇన్స్టిట్యూషన్‌ కానీ, ఖాళీ ప్రదేశాలు కానీ వదల‌కుండా మొక్కలు నాటాల‌ని, అవసరమైతే సర్పంచులు, పంచాయితీ సెక్రెటరీల‌కు మండల‌ స్థాయిలో ఒక రోజు ట్రైనింగ్‌ ఇవ్వాల‌ని, ప్రణాళిక ప్రకారం సాంకేతిక పద్దతిలో హరితహారంలో మొక్కలు నాటాల‌ని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. హరితహారంలో తేడాలు వస్తే ఎంపిడివోల‌పై చర్యలు ఉంటాయన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article