Breaking News

గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి పకడ్బందీగా సర్వే చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆశ, ఆరోగ్య సిబ్బంది కరోనా, సీజనల్‌ వ్యాధుల ల‌క్షణాల‌పై సర్వే చేపడుతున్నారని తెలిపారు. జ్వరం, దగ్గు, దమ్ము ఉంటే రాపిడ్‌ టెస్టులు చేయాల‌ని సూచించారు.

కరోనా పాజిటివ్‌ ఉన్న వారికి గృహ నిర్బంధంలో ఉంచి కిట్టు అందజేయాల‌ని పేర్కొన్నారు. తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ను వివరించాల‌ని సూచించారు. ఇళ్ళలో సౌకర్యం లేని వారిని ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రానికి పంపించాల‌ని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఈనెల‌ 18 లోగా సర్వే పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు.

కరోనా, ఇతర సీజనల్‌ వ్యాధుల ల‌క్షణాల‌ను గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాల‌ని పేర్కొన్నారు. కరోనా ల‌క్షణాలున్నవారు ఆందోళన చెందకుండా పౌష్టికాహారం, మందులు సకాలంలో తీసుకోవాల‌ని కోరారు. ఎస్పీ శ్వేతా మాట్లాడుతూ కరోనాను అరికట్టడానికి రెవిన్యూ, పోలీస్‌, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాల‌ని సూచించారు.

మండల ‌స్థాయి అధికారులు గ్రామాల్లో నిత్యం పర్యవేక్షణ చేస్తూ పాజిటివ్‌ కేసులు తగ్గించాల‌ని కోరారు. వీడియో కాన్పరెన్సులో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్‌, డీఎస్పీ ల‌క్ష్మీనారాయణ, కామారెడ్డి ఆర్డీవో నరేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article