Breaking News

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల‌ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు హౌసింగ్‌ శాఖా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా కలెక్టర్‌తో కలిసి రెవిన్యూ, పోలీస్‌, ఇర్రిగేషన్‌, పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాలు, వ్యవసాయ, ఫైర్‌, మత్స్య తదితర శాఖల‌ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు. వర్షాల వ‌ల్ల‌ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, ప్రజల‌కు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే సంబంధిత శాఖల‌ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాల‌ని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ మూడు షిఫ్ట్‌లో 24 గంటలు పనిచేసేలా చూడాల‌న్నారు.

మండల‌ మరియు గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధుల‌ను, మున్సిపాలిటీలో భాగస్వాముల‌ను చేసి తమ పరిధిలో ఏవైనా పాత ఇళ్ళు వర్షాల‌కు దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నట్లయితే అట్టి నివాసితుల‌ను దగ్గరలోని ప్రభుత్వ భవనాల‌కు, స్కూళ్లకు లేదా బంధువుల‌ ఇళ్లకు మార్చేలా చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం చెరువులు, కాలువల‌ను పర్యవేక్షిస్తూ, కట్టలు తెగకుండా చూడాల‌ని, ముందస్తుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాల‌ని, ప్రజల‌కు, పశువుల‌కు ఎటువంటి నష్టం కల‌గకుండా చూడాల‌న్నారు.

నిరంతరం గ్రామాధికారుల‌తో సంప్రదిస్తూ చెరువుల‌ను, కాలువల‌ను, ఫీడర్‌ కెనాల్స్‌ను, చెక్‌ డ్యాంను పర్యవేక్షించాల‌ని, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశమున్నా నివారణ చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. యూరియా సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాల‌ని ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులు క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరిని అప్రమత్తం చేయాల‌ని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల‌ని, విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా చూడాల‌ని, అవసరమైన మెటీరియల్‌ను డివిషన్‌ స్థాయి వరకు సిద్ధంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కల‌గకుండా చర్యలు తీసుకోవాల‌ని మంత్రి అన్నారు.

మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడివోలు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల‌ని, చెత్తను ఎప్పటికప్పుడు తొల‌గిస్తూ, డ్రైనేజీలు పొంగకుండా చూడాల‌న్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు రోడ్లను, క‌ల్వ‌ర్టును పర్యవేక్షిస్తూ వర్షాల‌కు ఏవైనా దెబ్బతిన్నట్లయితే వెంటనే మరమ్మత్తులు చేపట్టి రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు.

వైద్య శాఖ అధికారులు కోవిడ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, వర్షాకాలంలో వచ్చే సీసనల్‌ వ్యాధుల‌ నివారణ చర్యలు తీసుకోవాల‌ని, ఆర్డీవోలు, తహసీల్దార్లు, పోలీస్‌ అధికారులు పరిస్థితుల‌పై నిరంతర నిఘా ఉంచి, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంబంధిత శాఖల‌ను సమన్వయ పరిచి సమస్యలు పరిష్కరించాల‌న్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article