Breaking News

ప్రాధాన్యతా క్రమంలో ముందుకు పోతున్నాం…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలో కావచ్చు, గ్రామాలలో, పట్టణాలలో కావచ్చు, బడుగు బలహీన సమాజంలో కావచ్చు వర్గాల వారీగా, పనుల వారిగా విభజించుకొని ప్రాధాన్యతా క్రమంలో గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు పోతున్న సంగతి మనందరికీ తెలుసని, ఈ రోజు తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక సర్వేలతో తేల్చి బహిరంగంగా చెప్పడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గ హనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో హాజరై మంత్రి ప్రసంగించారు. ప్రస్తుతం కొన్ని విషయాలలో ముందున్నామని, కొన్ని విషయాలలో పురోగమిస్తున్నామని, దాంట్లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన చేపట్టవలసిన సంక్షేమ రంగాలలో వివిధ రకాల పెన్షన్లు, స్కీములు, కల్యాణలక్ష్మి, రైతుల విషయాలలో, సాగునీరు, కరెంట్‌, రైతుబంధు వంటి పథకాల ద్వారా గ్రామాలు అభివద్ధి చెందాలని, ప్రజలు నివసించే ఆవాసాలు అభివద్ధి చెందాలని, ప్రజాజీవనంలో మార్పు రావాలని మనకున్న ఫండ్స్‌, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫండ్స్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, మన బడ్జెట్‌ అన్నిటినీ ఇంటిగ్రేట్‌ చేసుకొని పక్కాగా నెల నెలకు గ్రామాలకు పట్టణాలకు డబ్బులు పంపించు ప్రోగ్రాంలు డిజైన్‌ చేసి సక్సెస్‌ అయ్యామని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రోగ్రామ్స్‌ ప్లాన్‌ చేశారని, విభేదాలు లేకుండా ప్రజల కోసం అందరూ పని చేశారని, ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు సహకారం చేయడంవల్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు సహకారం అందించడం వల్ల పనులు పూర్తి అయినవని, ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అందరూ పని చేయడం వల్ల గ్రామాలలో ఎంతో మార్పు వచ్చిందని, ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌, కంపోస్టు షెడ్‌, ట్రాక్టర్‌, ట్రాలీ సమకూర్చుకున్నామని అన్నారు.

హరితహారం ద్వారా 24 శాతం గ్రీన్‌ కవరేజి ఉన్న రాష్ట్రం ఐదు సంవత్సరాలలో నాలుగున్నర శాతం పెరిగిందని, దేశంలో ఏ రాష్ట్రంలో గ్రీన్‌ కవరేజ్‌ పెరగలేదని ఇదే పట్టుదలతో మూడు సంవత్సరాలు పని చేస్తే 10 శాతం పెరుగుతుందని, అడవులు 33 నుండి 34 శాతం పెరిగితే ఒక నిర్మాణాత్మకమైన అభివద్ధికి సంకేతమన్నారు.

కరోనా సమయంలో జిల్లా వైద్య సిబ్బంది మొత్తం చాలా కష్టపడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని, పీహెచ్సీలలో ఇదే స్ఫూర్తిగా ముందుకు పోవాలని, మాస్కులు పెట్టుకోవాలని, చేతులు సానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని, జిజిహెచ్‌లో సూపరింటెండెంట్‌ 24/7 పని చేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్సీల్లో ఇంతకుముందు సరిగ్గా డాక్టర్లు ఉండేవారు కారని కానీ కష్టకాలంలో అందరూ రెగ్యులర్‌గా పనిచేస్తున్నారన్నారు.

జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని, అలీ సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌, కాకతీయ కెనాల్‌ నుండి చెరువులను నింపుకోవచ్చని, నిజాంసాగర్‌కు 5 టిఎంసిలు, సింగూరుకు 16 టిఎంసిల నీరు వచ్చిందని, నిజాంసాగర్‌ ఆయకట్టు, బోధన్‌, బాన్సువాడ రైతులకు రెండు తడులు వాటర్‌ ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందని, పంటలు ఏమాత్రం నష్ట పోకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజి గౌడ్‌, రాజేశ్వర్‌, ఆకుల లలిత, అదనపు కలెక్టర్‌ లత, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article