Breaking News

వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం సంతకాల సేకరణ చేస్తామని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని కోరారు.

బడా కంపనీలతో ప్రధాని మోడీ కుమ్ముక్కయ్యారని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయ రంగ అభివద్ధికి గొడ్డలిపెట్టుగా, రైతాంగ సంక్షేమానికి తీవ్రమైన అవరోధంగా పరిణమించ బోతున్న వ్యవసాయ వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు విధించిందని, పద్దతి ప్రకారం ఫలానా సరుకు ఫలానా క్వింటాళ్లు లేదా టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలని, అంతకుమించి నిలువ చేసుకోకూడదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్‌ రూపంలో ఉన్న మూడు వ్యవసాయ బిల్లులను ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఏకపక్షంగా ఆమోదించిందన్నారు.

దాదాపు 18 ప్రతిపక్ష రాజకీయ పార్టీలతోపాటు బీజేపీ భాగస్వామ్య పక్షమైన ఆకాలిదల్‌ కూడా ఈ బిల్లులను వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిందని, అయినా కూడా బీజేపీ.ప్రభుత్వం దేశంలోని కోట్లాది రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి తనకు మద్దతుగా ఉన్న కొంతమంది బడా కార్పొరేట్‌ వ్యాపారుల లాభాల కోసం బిల్లులు ఆమోదించిందన్నారు. ఈ బిల్లులతో దేశంలో కోట్లాది రైతుల జీవితాలు చీకటిగా మారిపోతాయని, వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి పోతుందన్నారు. కొద్దిమంది వ్యాపారుల లాభాపేక్షకు, వారి వ్యాపార లబ్దికి పేద, చిన్న, సన్నకారు రైతుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్నారు.

దేశంలో రైతులను చీకటిలోకి నెట్టేసి వ్యవసాయ రంగాన్నీ సంక్షోభంలో పడేసి వ్యాపారుల గుత్తాదిపత్యం కిందికి నెట్టి వేయడానికి ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి మరియు వాణిజ్యం బిల్లు రైతులు (సాధికారత మరియు రక్షణ) ధరల హామీ మరియు వ్యవసాయ సాగు ఒప్పంద బిల్లు ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు, రాజ్యసభలో బీజేపీకి తగిన బలం లేకున్నా దౌర్జన్యంగా బిల్లులను ఆమోదింపచేస్కొని తాను రైతు, వ్యవసాయ వ్యతిరేకినని, కార్పొరేట్‌ వ్యాపారుల తొత్తునని నిరూపించుకున్నదన్నారు.

అదేవిధంగా విమానయాన సంస్థను ప్రైవేటు పరం చేసిందని, దేశంలోనే అతి పెద్దదైన ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎల్‌ఐసిని ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో పెట్టేసిందని, అలాగే ఇండియన్‌ రైల్వేని కూడా ప్రైవేట్‌ పరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని తనకు ఎన్నికల్లో సహకరించిన అంబానీ ఆదాని లాంటి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతుందని, మళ్ళీ భారత దేశ ప్రజలకు రెండోసారి స్వతంత్ర పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చిందని, ప్రజల తరఫున అక్టోబర్‌ 2 నుండి సంతకాల సేకరణ ద్వారా ప్రజా పోరాటం మొదలు పెడతామని షబ్బీర్‌ అలీ వివరించారు. కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article