Breaking News

కాంగ్రెస్‌ పార్టీ, రైతుల విజయం…

కామరెడ్డి, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కజొన్న ప్రభుత్వం కొనదు అనే ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్‌ మరియు రైతులు చేసిన దీక్షలు చూసి ప్రభుత్వం భయపడి శనివారం దిగివచ్చి మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిందని, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌ మరియు రైతుల విజయం అని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.

ఇదేవిధంగా రైతులతో కలిసి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును కూడా రద్దు చేసుకునే వరకు పోరాడుతామని, వ్యవసాయ మార్కెట్లలోనే అమలుకాని దుస్థితి కేంద్ర వ్యవసాయ బిల్లుతో అనర్థాలే అధికమని, పంటల కొనుగోలులో స్వేచ్ఛా వాణిజ్యం అంటూ కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు వల్ల పంటలకు మద్దతు ధర దక్కడం కష్టమేనని మార్కెట్‌ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయన్నారు.

కేంద్రం ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలు ఇప్పటికే రైతులకు అందడం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ పక్కాగా ఉన్నా రైతుల పంటలకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. ఇక మార్కెట్లతో పనేలేదంటే బయట అమ్ముకునే వారికి ధరపై పూచీకత్తు ఎవరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందని షబ్బీర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతా సన్న, చిన్నకారు రైతులే రాష్ట్రంలో 90.75 శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులే వారికి ఉన్న సగటు వ్యవసాయ భూ విస్తీర్ణం 5 ఎకరాల్లోపేనన్నారు.

మొత్తం 60.95 లక్షల మందికి వారిలో 44.22 లక్షల మంది రైతులకున్న భూమి 3 ఎకరాల్లోపే ఉందని వ్యవసాయశాఖ తెలిపిందని, వీరికి పండే పంటలు 15 నుంచి 20 క్వింటాళ్లలోపే ఉంటున్నాయన్నారు. వీటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం రైతులకు సాధ్యం కాదని, రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర దక్కడం లేదని రైతు స్వరాజ్య వేదిక సంస్థ జరిపిన పరిశీలనలో తేలిందన్నారు.

మొక్కజొన్న, పెసర, జొన్న, సోయాచిక్కుడు పంటల సాగు, దిగుబడులు, మరియు గతంలో రైతులకు దక్కిన ధరలను చూస్తే 2018-19లో మొక్కజొన్న క్వింటాలు మద్దతు ధర రూ.1700 గా కేంద్రం ప్రకటించిందని, ఆ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రైతులకు అందిన సగటు ధర రూ.1301. 2019-20లో మద్దతు ధర రూ.1760. రైతులకు అందిన సగటు ధర రూ.2160. ప్రస్తుత ఏడాదిలో మద్దతు ధర రూ.1850 కాగా సగటున రూ.1312 పలికిందన్నారు. ప్రస్తుత సీజన్‌లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఆసరా చేసుకుని ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు పంట ధరను తగ్గించేశారన్నారు.

జొన్నకు 2018-19లో మద్దతు ధర రూ.2430 కాగా సగటు ధర రూ.2137. 2019-20లో మద్దతు ధర రూ.2550కి రైతులకు అందిన ధర రూ.3153. ప్రస్తుత సీజన్‌లో రూ.2620కి పెంచినా ప్రస్తుతం ఇస్తున్న ధర రూ.2410. వ్యాపారులు మార్కెట్లను నియంత్రిస్తారని, వ్యవసాయ బిల్లు చట్టంగా వస్తే కార్పొరేటు సంస్థలు, పెద్ద వ్యాపారులు వారి ప్రాంతాల్లో జమీందార్లుగా శక్తిమంతులై మార్కెట్లను నియంత్రిస్తారన్నారు.

వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమై పోతాయని, వ్యవసాయ బిల్లు వల్ల మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. రైతు విడిగా పంటలు అమ్ముకుంటే ధర రాక నష్టపోవడం ఖాయమని, వ్యాపారుల మోసాల నుంచి వారిని రక్షించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల కోసం చివరి శ్వాస వరకు పోరాడతానని షబ్బీర్‌ అలీ చెప్పారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article