Breaking News

మొక్కజొన్న మద్దతు ధర రూ.1850

కామారెడ్డి, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వానకాలం 2020 మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1850 నిర్ణయించి కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు.

కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ, రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసిన రైతుల వివరాలను రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగినందున, పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు బందంగా ఏర్పడి రైతు పండించిన పంటను, నిల్వ వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన తర్వాత మొక్కజొన్న ఎంత మొత్తంలో రైతుల వద్ద నిల్వ ఉందనే సమాచారం తెలుస్తుందని, దానిని బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

రైతులు వాన కాలంలో ఇప్పటివరకు ఎవరికి అమ్మకుండా నిల్వచేసిన మొక్కజొన్నకు మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులు కూపనులను అందజేస్తారని చెప్పారు. మొక్కజొన్న తేమశాతం 14 శాతానికి మించకుండా ఉన్నటువంటి వాటిని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఇతర పదార్థాలు రెండు శాతం పాక్షికంగా దెబ్బతిన్న గింజలు, 1.5 శాతం రంగుమారిన మొక్కజొన్నలు, 4.5 శాతం పూర్తి పక్వము కానివి, ఒక శాతం తెగుళ్ళు పట్టినవి మించకుండా ఉండాలన్నారు.

రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతుల మొక్కజొన్నలు మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సునీత, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article